ముకుందరెడ్డికి నెక్ పౌల్ట్రీ రైతు అవార్డు | Sakshi
Sakshi News home page

ముకుందరెడ్డికి నెక్ పౌల్ట్రీ రైతు అవార్డు

Published Sat, Oct 15 2016 1:24 AM

ముకుందరెడ్డికి నెక్ పౌల్ట్రీ రైతు అవార్డు - Sakshi

మండపేట: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పౌల్ట్రీలు నెలకొల్పి అత్యధికంగా కోళ్లను పెంచుతున్న శ్రీలక్ష్మి ఎగ్ ఫార్మింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్ కర్రి వెంకట ముకుందరెడ్డిని జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ (నెక్) బిగ్గెస్ట్ లేయర్ ఫార్మర్ అవార్డుతో సత్కరించింది. ప్రపంచ ఎగ్ డే సందర్భంగా శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన వేడుకల్లో కేంద్ర మంత్రులు రాధామోహన్‌సింగ్, సుదర్శన్ భగత్ చేతులమీదుగా ముకుందరెడ్డి ఈ అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ అవార్డుకు ముగ్గురిని ఎంపిక చేయగా అందులో ఆయన ఒకరు.

 2 లక్షల నుంచి 28 లక్షలకు..: తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలోని కేపీఆర్ గ్రూప్స్‌లో భాగంగా 1987లో 2 లక్షల కోళ్లతో ముకుందరెడ్డి శ్రీలక్ష్మి పౌల్ట్రీ కాంప్లెక్స్ నెలకొల్పారు. అనతికాలంలోనే దీనిని శ్రీలక్ష్మి ఎగ్ ఫార్మింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌గా అభివృద్ధి చేసి ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో పౌల్ట్రీలు నెలకొల్పారు. ప్రస్తుతం ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో చెరో 14 లక్షల లేయర్ కోళ్లను పెంచుతున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కిసాన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి దళారుల జోక్యం లేకుండా తక్కువ ధరకే తమ ఉత్పత్తులను రైతులకు అందిస్తున్నారు.

కేంద్రం సహకారం అందించాలి:పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి  సహకారం అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్టు ముకుందరెడ్డి తెలిపారు. న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు.  కోళ్ల మేతల కృత్రిమ కొరత సమస్యను పరిష్కరించాలని, మొక్కజొన్న, ఇతర ఉత్పత్తులను కోళ్ల రైతులకు రాయితీపై సరఫరా చేయాలని కోరామని తెలిపారు.

Advertisement
Advertisement