పేదరిక నిర్మూలనకు కొత్త రూటు | Sakshi
Sakshi News home page

పేదరిక నిర్మూలనకు కొత్త రూటు

Published Wed, Feb 1 2017 12:53 AM

పేదరిక నిర్మూలనకు కొత్త రూటు - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో పేదరికం నిర్మూలన లక్ష్యంగా ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ తాజా ఎకనమిక్‌ సర్వేలో ‘సార్వత్రిక కనీస ఆదాయం’ (యూబీఐ) అనే ఒక కొత్త ఆలోచనకు తెరతీశారు. ‘‘ప్రతి కంటి నుంచీ ప్రతి కన్నీటి చుక్కనూ తుడవాలి’’ అన్న మహాత్ము ని ఆశయ సాధనను ఎకనమిక్‌ సర్వే ప్రస్తావించింది. పేదలకు కొంత కనీస ఆదాయం తప్పనిసరిగా లభించేలా(నగదు బదిలీ) చర్యలు తీసుకోవడమే క్లుప్తంగా ఈ యూబీఐ లక్ష్యం. సబ్సిడీలను తొలగించడం.. ప్రస్తుత పథకాలకు ప్రత్యామ్నాయంగా యూబీఐ ఆలోచనకు కేంద్రం శ్రీకారం చుట్టింది.

విజయవంతం కావాలంటే..?
ఈ పథకం విజయవంతానికి రెండు అంశాలు కీలకమని పేర్కొన్న సర్వే... ఇందులో ఒకటి జన్‌ధన్, ఆధార్, మొబైల్‌ (జేఏఎం)అని పేర్కొంది. మరొకటి దీనికి అయ్యే వ్యయంపై కేంద్ర–రాష్ట్రాల మధ్య చర్చలని వివరించింది.

ఎంత ఖర్చవుతుంది?
సర్వే అంచనాల ప్రకారం తాజా పథకం పేదరికాన్ని 0.5 శాతానికి తగ్గిస్తుంది. అయితే స్థూల దేశీయోత్పత్తిలో ఇందుకోసం అయ్యే వ్యయం 4 శాతం నుంచి 5 శాతంగా ఉంటుంది.  ప్రస్తుతం మధ్య తరగతికి ఇస్తున్న సబ్సిడీలు, ఆహారం, పెట్రోలియం, ఎరువుల సబ్సిడీల విలువ జీడీపీలో దాదాపు 3 శాతంగా ఉంది.  టెండూల్కర్‌ కమిటీ నివేదిక ప్రకారం– స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశ జనాభాలో 70 శాతం పేదరికం ఉంటే, 2011–12 నాటికి 22 శాతానికి తగ్గింది. అయితే ప్రతి ఒక్కరి కన్నీరూ తుడవాలన్న లక్ష్యంగా తాజా పథకాన్ని ప్రవేశపెట్టాల్సి ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది.

ఇప్పుడు ఎన్నో లొసుగులు..: ప్రస్తుత పేదరిక నిర్మూలనా, పేదల సంక్షేమ పథకాల్లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు సర్వే వివరించింది. తాజా యూబీఐ ద్వారా పేదలకు భౌతికంగా, మానసికంగా అపార ప్రయోజనాలు, భరోసా కల్పించాలన్నది లక్ష్యమని సర్వే పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానం, ఆటోమేషన్‌ ఉద్యోగాల కల్పనకు విఘాతమని వస్తున్న ఆందోళనలకు సైతం యూబీఐ పరిష్కారం చూపే విధంగా ఉండాలన్నది సర్వే ఉద్దేశం.

ఇప్పటికే ఫిన్లాండ్‌లో...
ఇప్పటికే ఫిన్లాండ్‌ దేశంలో పైలట్‌ ప్రాతిపదికన ఈ తరహా పథకం అమలు జరుగుతోంది. మిగిలిన కొన్ని దేశాలూ దీనిని అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గత ఏడాది స్విట్జర్లాండ్‌ ఓటర్లు ఈ తరహా పథకాలను తిరస్కరించారు. ఆహారం, సేవలను అందించడం లేదా కూపన్లు ఇవ్వడం లేదా ప్రత్యక్షంగా డబ్బు ఇవ్వడం వంటి అంశాలు తాజా పథకంలో ఇమిడి ఉంటాయన్న అంచనాలు వెలువడుతున్నాయి.

Advertisement
Advertisement