9,300 పాయింట్లను దాటిన నిఫ్టీ | Sakshi
Sakshi News home page

9,300 పాయింట్లను దాటిన నిఫ్టీ

Published Wed, Apr 26 2017 2:23 AM

9,300 పాయింట్లను దాటిన నిఫ్టీ

ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ నిఫ్టీ రికార్డ్‌లు ∙
బ్యాంక్‌ నిఫ్టీదీ ఇదే జోరు
సానుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు ∙
జోష్‌నిస్తున్న క్యూ4 ఫలితాలు   


ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం మెరుపులు మెరిపించింది. తొలిసారిగా 9,300 పాయింట్లను దాటింది. ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లను సృష్టించింది. నిఫ్టీతో పాటు బ్యాంక్‌ నిఫ్టీ, బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు కూడా రికార్డ్‌లు బద్దలు కొట్టాయి. నిఫ్టీ బ్యాంక్‌ సూచీ 22వేల పాయింట్లపైన ముగిసింది.  

ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30వేల పాయింట్లకు చేరువలో ముగిసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఇతర బ్లూ చిప్‌ కంపెనీల క్యూ4 ఫలితాలు బాగుండటం, సానుకూల అంతర్జాతీయ సంకేతాల దన్నుతో స్టాక్‌ మార్కెట్‌  మంగళవారం లాభాల పంట పండించింది. స్టాక్‌ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లోనే ముగిశాయి.  సెన్సెక్స్‌ 287 పాయింట్లు లాభపడి 29,943 పాయింట్ల వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు లాభపడి 9,307 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది 3 వారాల గరిష్ట స్థాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి.

నిఫ్టీ కొత్త శిఖరాలకు...
ఈ నెల 5నాటి  9,274 పాయింట్ల జీవిత కాల గరిష్ట స్థాయి నిఫ్టీ  రికార్డ్‌ మంగళవారం బద్దలైంది. 9,273 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ జోరు రోజంతా కొనసాగింది. ఇంట్రాడేలో 9,309 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన నిఫ్టీ చివరకు 9,307 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటివరకూ నిఫ్టీ 14 శాతం వరకూ లాభపడింది. ఇక సెన్సెక్స్‌ 29,962–29,781 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది.  

ఎందుకు ఈ పరుగు..
ప్రపంచ మార్కెట్ల జోరు: ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల మొదటి రౌండ్‌లో యూరోపియన్‌ యూనియన్‌లో ఉండేందుకే మొగ్గు చూపే సెంట్రిస్ట్‌ అభ్యర్థి ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ నెగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా రిలీఫ్‌ ర్యాలీ చోటు చేసుకుంది.

ఆర్థిక ఫలితాల జోష్‌: ఇప్పటివరకూ అంతంతమాత్రంగానే కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు సోమవారం నుంచి అంచనాలను మించడం స్టాక్‌ మార్కెట్‌ను పరుగులు పెట్టిస్తోంది. రూపాయి పరుగులు:  డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 64.21 స్థాయికి బలపడడం సెంటిమెంట్‌కు మరింత జోష్‌నిచ్చింది. నేడు చివరకు రూపాయి 65.26 వద్ద ముగిసింది.

షార్ట్‌ కవరింగ్‌: ఏప్రిల్‌ సిరీస్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టులు మరో 2 రోజుల్లో ముగుస్తుండడంతో ఇన్వెస్టర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగారు.
అధిక వెయిటేజ్‌ షేర్ల పరుగు: సూచీల్లో అధిక వెయిటేజీ ఉన్న రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తదితర షేర్లు పెరుగుతుండటంతో మార్కెట్‌ జోరుగా దూసుకుపోతోందని నిపుణులంటున్నారు. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే.. బీఎస్‌ఈలో మొత్తం 293 షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి.  క్యూ4 ఫలితాలు అంచనాలను మించడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ ధర 1.2 శాతం లాభపడి రూ.1,433కు చేరింది.

రూ.125 లక్షల కోట్లకు ఇన్వెస్టర్ల సంపద
ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన అన్ని కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.125 లక్షల కోట్లకు చేరింది. సోమవారం రూ.124 లక్షల కోట్లుగా ఉన్న ఇన్వెస్టర్ల సంపద మంగళవారం  రూ.1.11 లక్షల కోట్లు పెరిగి రూ.1,25,53,561 లక్షల కోట్లకు చేరింది.

6,000 పాయింట్లను దాటిన నాస్‌డాక్‌
అమెరికా షేర్లు దూసుకుపోతున్నాయి. అమెరికా స్టాక్‌ సూచీల్లో ఒకటైన నాస్‌డాక్‌ తొలిసారిగా 6,000 పాయింట్లను దాటింది. ఫ్రాన్స్‌ ఎన్నికల సానుకూల ఫలితాలు, అమెరికా బ్లూచిప్‌ కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగా ఉండటం, అమెరికా అధ్యక్షుడు పన్ను సంస్కరణల హామీతో స్టాక్‌ సూచీలు మంచి లాభాలను సాధిస్తున్నాయి. కార్పొరేట్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ను 35 శాతం నుంచి 15 శాతానికి తగ్గించవచ్చన్న అంచనాలు ఉన్నాయి.
 

Advertisement
Advertisement