2070కు లాభాల వీడ్కోలు | Sakshi
Sakshi News home page

2070కు లాభాల వీడ్కోలు

Published Thu, Oct 23 2014 12:42 AM

2070కు లాభాల వీడ్కోలు

సెన్సెక్స్ లాభాల మెరుపులు
* 212 పాయింట్లు ప్లస్
* 26,787 వద్ద ముగింపు
* మళ్లీ 8,000 తాకిన నిఫ్టీ
* నెల రోజుల గరిష్టానికి మార్కెట్లు

 
మార్కెట్  అప్‌డేట్
స్టాక్ మార్కెట్ల ఏడాది సంవత్ 2,070కు ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో ఘనంగా వీడ్కోలు పలికారు. వరుసగా నాలుగో రోజు మార్కెట్లు లాభాలతో కళకళలాడాయి. వెరసి దీపావళి ముందురోజే నిఫ్టీ మళ్లీ 8,000 పాయింట్లను అధిగమించగా, ఇంట్రాడేలో సెన్సెక్స్ 26,818ను తాకింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా, సంవత్ 2071కు మార్కెట్లు లాభాలతో ఆహ్వానం పలకడం విశేషం!
 
రికార్డ్ లాభాలు
సంవత్ 2,070 మొత్తంమీద చూస్తే సెన్సెక్స్ 5,548 పాయింట్లు(26%) దూసుకె ళ్లింది. గత ఐదేళ్ల కాలంలో దీపావళి నుంచి దీపావళికి ఇదే అత్యధిక లాభంకాగా, సంవత్ 2,065లో గరిష్టంగా 8,813 పాయింట్లు(దాదాపు 104%) ఎగసింది. అయితే ఈ ఏడాది సెన్సెక్స్ కొత్త శిఖరాలను అధిరోహించడంతో బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 25 లక్షల కోట్లమేర ఎగసింది! ఇది చెప్పుకోదగ్గ విశేషంకాగా, బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 212 పాయింట్లు లాభపడి 26,787 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 68 పాయింట్లు పుంజుకుని 7,996 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా, ఆటో అత్యధికంగా 3% జంప్‌చేసింది. పండుగల సీజన్ నేపథ్యంలో అమ్మకాలు పుంజుకుంటాయన్న అంచనాలు ఇందుకు దోహదపడిన ట్లు నిపుణులు చెప్పారు. మోడీ ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకువస్తుందన్న అంచనాలు సెంటిమెంట్‌కు ప్రోత్సాహాన్నిస్తున్నాయని తెలిపారు.
 
నేడు ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్
దీపావళి పర్వదినం సందర్భంగా గురువారం(24న) బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ)  ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. సాధారణ వేళలకు బదులుగా సాయంత్రం 6:15 నుంచి 7:30 వరకూ ఈ ట్రేడింగ్ ఉంటుంది. కాగా, శుక్రవారం బలిప్రతిపద సందర్భంగా మార్కెట్లకు సెలవు.
 
మరిన్ని ముఖ్యాంశాలు...

- ఇంట్రాడేలో నిఫ్టీ 8,005 పాయింట్లను తాకగా, వరుసగా నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 788 పాయింట్లు లాభపడింది.
- ఆటో దిగ్గజాలు హీరోమోటో, టాటా మోటార్స్, మారుతీ, బజాజ్ ఆటో, ఎంఅండ్‌ఎం 4-2.5% మధ్య జంప్‌చేశాయి.
- మిగిలిన బ్లూచిప్స్‌లో సిప్లా, ఎల్‌అండ్‌టీ, డాక్టర్ రెడ్డీస్, భెల్, రిలయన్స్, విప్రో 3.5-1.5% మధ్య పురోగమించాయి.
- సెన్సెక్స్‌లో ఓఎన్‌జీసీ 2% క్షీణించగా, ఐటీసీ, ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, ఐసీఐసీఐ 0.5% స్థాయిలో నష్టపోయాయి.
- మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1%పైగా బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,784 లాభపడగా, 1,031 నష్టపోయాయి.
- బీఎస్‌ఈ-500లో ఇంగెర్సోల్, జిందాల్ స్టీల్, నాట్కో ఫార్మా, ఇంజినీర్స్ ఇండియా, దివాన్ హౌసింగ్, కేపీఐటీ, ఆర్‌ఐఐఎల్, డెన్ నెట్‌వర్క్స్, జూబిలెంట్ ఫుడ్ 13-7% మధ్య దూసుకెళ్లాయి.

Advertisement
Advertisement