స్మార్ట్‌.. జాకెట్‌..! | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌.. జాకెట్‌..!

Published Fri, Mar 24 2017 3:35 AM

స్మార్ట్‌.. జాకెట్‌..! - Sakshi

బైక్‌లో వెళుతున్నారు.. స్మార్ట్‌ఫోన్‌కు హెడ్‌ఫోన్స్‌ తగిలించుకుని ఓ పాట వింటున్నారు. నచ్చలేదు.. మార్చాలంటే బైక్‌ ఆపు చేయాలి. జేబులోంచి స్మార్ట్‌ఫోన్‌ బయటకు తీయాలి. నోటిఫికేషన్స్‌లోకి వెళ్లి ఏదో ఒక బటన్‌ నొక్కాలి. ఇది ఇప్పటివరకూ మనం పాటించే పద్ధతి.. కానీ ఫొటోలో ఒకాయన తొడుక్కు న్నాడే.. బ్లూ జెర్కిన్‌.. అదుంటే మాత్రం ఇది ఒక్క చిక్కే కాదు.. ఎడమ చేతి మణికట్టు దగ్గర కుడి చేత్తో ఓసారి రుద్దితే చాలు! అంతేనా... సౌండ్‌ వాల్యూమ్‌ తగ్గించాలనుకోండి... రెండుసార్లు రుద్దాలి. మ్యాప్స్‌ ఆన్‌ చేయాలనుకోండి. పైకి కిందకు మూడుసార్లు నొక్కితే సరి! అదెలా? ఆ జాకెట్‌లో మ్యాజిక్‌ ఉంది! అదేంటో తెలుసా? ఇందులోని ఒక్కో నూలుపోగు.. అత్యంత సున్నితమైన స్థాయిలో విద్యుత్తును ప్రసారం చేయగలదు.

చేతి కఫ్‌ లింక్‌లో ఉండే బ్లూటూత్‌ రిసీవర్‌ మీ సంకేతాలను గుర్తిస్తుంది. వైర్‌లెస్‌ పద్ధతిలోనే స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్‌ అయిపోతుంది. మీరు చెప్పిన పని చేసేస్తుంది. కాకపోతే ఏ సంకేతానికి ఏ పని చేయాలో మనం ముందే నిర్దేశించుకోవాల్లెండి. జాకెట్‌ వావ్‌ అనిపించేలా ఉంది కదూ... ముందుముందు ఇలాంటివి మనం మరిన్ని చూడబోతున్నాం. ధరించే దుస్తుల్లోకి ఎలక్ట్రానిక్స్‌ను జొప్పించేందుకు గూగుల్, జీన్స్‌ తయారీ కంపెనీ లెవిస్‌లు కలిసికట్టుగా ‘ప్రాజెక్ట్‌ జాక్వర్డ్‌’ పేరుతో ఈ సరికొత్త జాకెట్‌ను అభివృద్ధి చేయడం దీనికి కారణం. ఏడాదిన్నర క్రితం మొదలైన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం అంత్యదశలో ఉంది. అన్నీ సవ్యంగా సాగితే కొన్ని నెలల్లోనే ఈ జాకెట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు లెవిస్‌ ప్రయత్నాలు చేస్తోంది. అయిదు రకాల సంకేతాలను గుర్తించేందుకు వీలుగా లెవిస్‌ ఒక స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ను కూడా సిద్ధం చేసింది. కఫ్‌ లింక్‌లో ఉండే బ్లూటూత్‌ రిసీవర్‌ను తొలగించి ఉతుక్కుంటే చాలు..! ఒక్కో జాకెట్‌ ధర దాదాపు రూ.14 వేలు ఉండవచ్చునని అంచనా!
 – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

Advertisement
Advertisement