Sakshi News home page

నోకియా స్థానంలో మైక్రోసాఫ్ట్ స్టోర్లు

Published Thu, May 14 2015 12:22 AM

నోకియా స్థానంలో మైక్రోసాఫ్ట్ స్టోర్లు

భారత్‌లో 8,872 ఔట్‌లెట్ల రీబ్రాండింగ్
నోకియా, మైక్రోసాఫ్ట్ బ్రాండ్లలో ఫోన్లు  ‘సాక్షి’తో మైక్రోసాఫ్ట్ మొబైల్ డెరైక్టర్ నిఖిల్ మాథుర్
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నోకియా ఔట్‌లెట్లు కొద్ది రోజుల్లో కనుమరుగు కానున్నాయి. రీబ్రాండింగ్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా తొలి దశలో జూన్ నాటికి 15,684 ఔట్‌లెట్లు ‘మైక్రోసాఫ్ట్’ పేరుతో దర్శనమీయనున్నాయి. వీటిలో భారత్‌లో 8,872 ఔట్‌లెట్లతోపాటు 119 సర్వీసింగ్ కేంద్రాలు ఉన్నాయి.

నోకియా ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్లు మైక్రోసాఫ్ట్ ప్రియారిటీ రీసెల్లర్ స్టోర్లుగా, మల్టీబ్రాండ్ ఔట్‌లెట్లు మైక్రోసాఫ్ట్ మొబైల్ రీసెల్లర్ స్టోర్లుగా మారనున్నాయి. మైక్రోసాఫ్ట్ ప్రియారిటీ రీసెల్లర్ స్టోర్స్‌లో మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులైన ఎక్స్‌బాక్స్ గేమింగ్ కన్సోల్స్, పీసీలు, మొబైల్ ఫోన్లు, యాక్సెసరీస్ విక్రయిస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో 2,100 స్టోర్లు రీబ్రాండ్ చేస్తున్నామని మైక్రోసాఫ్ట్ మొబైల్ ఓవై బిజినెస్ సేల్స్, ఆపరేటర్ చానల్స్ డెరైక్టర్ నిఖిల్ మాథుర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు బుధవారం చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ జూన్ తర్వాతి నుంచి ప్రస్ఫుటంగా కనిపిస్తుందని అన్నారు.  
 
గోల్డెన్ డేస్ దిశగా..
ఐడీసీ ప్రకారం 2014 జనవరి-మార్చి త్రైమాసికంలో నోకియా వాటా 4 శాతానికి వచ్చి చేరింది. కొన్నేళ్ల క్రితం భారత్‌లో అగ్రశ్రేణి కంపెనీగా నోకియా వెలుగొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ బ్రాండ్ తోడవ్వడంతో మార్కెట్లో పట్టుకు రంగంలోకి దిగింది. లూమియా ఫోన్ల ధరను కంపెనీ తగ్గిస్తూ వస్తోంది. లూమియా 430 మోడల్‌ను రూ.5,299లకే ఆవిష్కరించింది. లూమియా స్మార్టఫోన్లు ఇక నుంచి మైక్రోసాఫ్ట్ బ్రాండ్‌తోనే వస్తాయి.

ఫీచర్ ఫోన్లకు ఇంకా డిమాండ్ ఉన్నందున ఈ విభాగంలో నోకియా బ్రాండ్ మోడళ్లను కొనసాగిస్తామని నిఖిల్ పేర్కొన్నారు. ‘కస్టమర్ల అవసరాలను అధ్యయనం చేస్తున్నాం. ఫీచర్, స్మార్ట్‌ఫోన్ విభాగాల్లో అత్యుత్తమ మోడళ్లను అందించిన ఘనత మాది. అదే ఊపుతో విభిన్న ఫీచర్లతో సరికొత్త మోడళ్లను తీసుకొస్తున్నాం’ అని తెలిపారు. కంపెనీకి తిరిగి మంచి రోజులు వస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు.
 
4జీలో సత్తా చాటుతాం..
దేశంలో 4జీ ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తోంది. చాలా లూమియా ఫోన్లు 4జీని సపోర్ట్ చేస్తాయి. మరిన్ని మోడళ ్లను టెలికం కంపెనీలతో కలిసి పరీక్షిస్తున్నామని నిఖిల్ తెలిపారు. టెక్నాలజీ విస్తరించగానే ఈ కంపెనీల భాగస్వామ్యంతో విభిన్న మోడళ్లను ప్రవేశపెడతామన్నారు. 4జీలో సత్తా చాటుతామని పేర్కొన్నారు. కాగా, నోకియా మొబైల్, సర్వీస్ విభాగాలను గతేడాది మైక్రోసాఫ్ట్ 7.5 బిలియన్ డాలర్లకు దక్కించుకుంది. సెబైక్స్ ఎగ్జిమ్ సొల్యూషన్స్ ప్రకారం 2015 జనవరి-మార్చి కాలంలో మైక్రోసాఫ్ట్ 9.30 లక్షల యూనిట్ల స్మార్ట్‌ఫోన్లను భారత్‌కు దిగుమతి చేసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ పరిమాణం 28 శాతం అధికం కావడం గమనార్హం.

Advertisement
Advertisement