సెన్సెక్స్.. రయ్ రయ్ | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్.. రయ్ రయ్

Published Thu, Apr 14 2016 1:04 AM

సెన్సెక్స్.. రయ్ రయ్

చైనా ఎగుమతుల డేటా, గ్లోబల్ ర్యాలీ ఎఫెక్ట్
దేశీయ గణాంకాలతో మరింత హుషారు   
సెన్సెక్స్ 481 పాయింట్లు జంప్
నిఫ్టీ 1.91 పాయింట్లు అప్   
మూడురోజుల్లో 953 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

ముంబై: అన్నివైపుల నుంచి సానుకూల సంకేతాలు వెల్లువెత్తడంతో స్టాక్ మార్కెట్ కదంతొక్కింది. ఈ ఏడాది రుతుపవనాలు బావుంటాయన్న అంచనాలతో రెండురోజుల క్రితమే భారత్‌లో మొదలైన ఈక్విటీ ర్యాలీకి తాజాగా అంతర్జాతీయ మార్కెట్లు జతకలవడంతో బుధవారం సూచీలు పరుగులు తీశాయి. ఇందుకు ప్రోత్సాహకర దేశీయ గణాంకాలు సైతం తోడయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఒక్క ఉదుటున 481 పాయింట్లు ఎగిసి దాదాపు మూడున్నర నెలల గరిష్టస్థాయి 25,627 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఈ స్థాయిలో ముగియడం జనవరి 1 తర్వాత ఇదే ప్రధమం. 7,800 పాయింట్ల శిఖరాన్ని దాటేసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 141 పాయింట్లు ర్యాలీ జరిపి 7,850 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ వారం కేవలం మూడు రోజుల్లో సెన్సెక్స్ 953 పాయింట్లు (3.86 శాతం), నిఫ్టీ 295 పాయింట్లు (3.76 శాతం) చొప్పున పెరిగాయి. ఫిబ్రవరి కనిష్టస్థాయి నుంచి సెన్సెక్స్ 3,100 పాయింట్లు, నిఫ్టీ 1,000 పాయింట్ల మేర ఎగిశాయి.

 క్రూడ్ ధర పెరగడంతో పాటు చైనాలో తొమ్మిదినెలల తర్వాత ఎగుమతులు పెరిగాయన్న వార్తలతో ప్రపంచంలో ప్రధాన మార్కెట్లన్నీ ర్యాలీ సాగించాయి. క్రితం రోజు రాత్రి అమెరికా సూచీలు 1 శాతం, బ్రెజిల్, మెక్సికో సూచీలు 3 శాతం వరకూ పెరగ్గా, బుధవారం ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్, సింగపూర్ సూచీలు 2 శాతంపైగా ఎగిసాయి. చైనా షాంఘై సూచీ 1.5 శాతం పెరిగింది. యూరప్‌లోని లండన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు సైతం 2-3 శాతం మధ్య పెరిగాయి. క్రితం రోజు 1 శాతం మేర ఎగిసిన అమెరికా సూచీలు బుధవారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి 0.8 శాతం పెరుగుదలతో ట్రేడవుతున్నాయి.

 బైబ్యాక్ ప్రకటనతో విప్రో జోరు..
సెన్సెక్స్-30 షేర్లలో 28 షేర్లు ర్యాలీలో పాలుపంచుకున్నాయి. షేర్లను బైబ్యాక్ చేసే ప్రతిపాదనను కంపెనీ బోర్డు త్వరలో పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఐటీ దిగ్గజం విప్రో ప్రకటించడంతో ఈ షేరు 2.9 శాతం పెరిగి రూ. 585 వద్ద ముగి సింది. బజాజ్ ఆటో, బీహెచ్‌ఈఎల్, మారుతి సుజుకి, టాటా మోటార్స్, హీరోమోటో, హిందుస్థాన్ యూనీలీవర్, టాటా స్టీల్, ఐటీసీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 1-5 శాతం మధ్య పెరిగాయి.

 ఆటో ఇండెక్స్ టాప్
రెండు రోజుల నుంచి ప్రధాన సూచీల్ని మించి పెరుగుతున్న బీఎస్‌ఈ ఆటో ఇండెక్స్ తాజాగా మరో 3.59 శాతం పెరిగింది. ఈ మూడురోజుల్లో ఈ సూచీ సెన్సెక్స్‌కంటే రెట్టింపు(7.4 శాతం) పెరిగింది. తాజాగా బ్యాంకింగ్ సూచి 2.56 శాతం, మెటల్ సూచి 2.14 శాతం, ఎఫ్‌ఎంసీజీ సూచీ 1.86 శాతం చొప్పున పెరిగాయి. ఈ వారంలో బ్యాంకింగ్ సూచీ 4 శాతం వృద్ధిచెందింది.

ఇన్వెస్టర్ల సంపద... రూ.1.32 లక్షల కోట్లు అప్
బుధవారం నాటి ర్యాలీ ఇన్వెస్టర్ల సంపదను రూ. 1.35 లక్షల కోట్ల మేర పెంచింది. దీంతో బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ. 96.92 లక్షల కోట్లకు చేరింది. 86 షేర్లు ఆల్‌టైమ్ రికార్డుస్థాయికి చేరగా, 216 షేర్లు వాటి అప్పర్ సర్క్యూట్‌బ్రేకర్‌ను తాకి ఫ్రీజ్ అయ్యాయి.

ర్యాలీకి మూడు కారణాలు...

1 ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం తగ్గినందున, వర్షపాతం సగటుకంటే అధికంగా వుంటుందని, దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్న అంచనాల్ని కేంద్ర వాతావరణ శాఖ, ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌లు ప్రకటించడంతో భారత్‌లో తాజా ర్యాలీకి బీజం పడింది.

2 మంగళవారం మార్కెట్ ముగిసిన తర్వాత దేశీయంగా వెలువడిన గణాంకాలు ఇన్వెస్టర్లలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.86 శాతానికి దిగిరావడం, వరుసగా మూడు నెలల క్షీణత తర్వాత ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి 2 శాతం వృద్ధిచెందడంతో మార్కెట్లో సెంటిమెంట్ బలపడింది.

3 చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు రష్యా, సౌదీలు ఒప్పందం కుదుర్చుకుంటాయన్న వార్తలతో ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 44 డాలర్ల స్థాయికి చేరడం, చైనా సానుకూల వాణిజ్య డేటా (10% ఎగుమతుల పెరుగుదల) వెలువడటంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు  బుధవారం ఒక్కసారిగా ఎగిసాయి. స్థానికాంశాలతో ఇప్పటికే బుల్లిష్‌గా మారిన భారత్ మార్కెట్ గ్లోబల్ ర్యాలీతో జతకలిసింది.

నేడు, రేపు మార్కెట్‌కు సెలవు
అంబేడ్కర్ జయంతి సందర్భంగా నేడు (గురువారం),
శ్రీరామనవమి పండుగ కారణంగా రేపు (శుక్రవారం)
స్టాక్ మార్కెట్‌కు సెలవు.

Advertisement
Advertisement