ట్రంప్‌ వల్లే పసిడి పరుగు | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ వల్లే పసిడి పరుగు

Published Fri, Sep 8 2017 12:16 AM

ట్రంప్‌ వల్లే పసిడి పరుగు - Sakshi

ఉత్తరకొరియా ప్రభావం కాదని గోల్డ్‌మన్‌ శాక్స్‌ విశ్లేషణ
న్యూయార్క్‌/న్యూఢిల్లీ: బంగారం ఔన్స్‌ (31.1 గ్రా) ధర అంతర్జాతీయ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌ – నైమెక్స్‌లో గడచినరెండు నెలల్లో దాదాపు 150 డాలర్లు పెరిగింది. ఇంత భారీ పెరుగుదలకు ఉత్తరకొరియా ఘర్షణాత్మక వైఖరే కారణమనడం సరికాదని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం.. గోల్డ్‌మన్‌ శాక్స్‌ అభిప్రాయపడింది. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనిశ్చిత విధానాలే కారణమని పేర్కొంది. అయితే పసిడి మెరుపు కొనసాగదని కూడా అంచనావేసింది. ఈ మేరకు విడుదల చేసిన నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే...

జూలై మొదట్లో 1,204 డాలర్ల స్థాయికి పడిపోయిన పసిడి, అక్కడి నుంచి 1,353 డాలర్లపైకి లేచింది. గురువారం కడపటి సమాచారం అందేసరికి– ఆ స్థాయిలోనే ట్రేడవుతోంది. గురువారం ఒక్కరోజే దాదాపు 15 డాలర్లు ఎగసింది. ఈ ఏడాది ఇంత స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. గతేడాది ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన వెంటనే ఆసియా ట్రేడింగ్‌లో పసిడి 1,370 డాలర్లకు లేచినా, అదేరోజు మళ్లీ దాదాపు హై నుంచి 100 డాలర్లు పడిపోయింది. క్రమంగా 2016 చివరినాటికి 1,120 స్థాయికి పడిపోయింది. సహజంగా సంక్షోభ పరిస్థితుల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు సురక్షితమైనదిగా పరిగణించే పసిడి మళ్లీ ఇప్పుడు అప్పటి గరిష్ట స్థాయిలను చూస్తోంది.

ఉత్తరకొరియా సంఘర్షణ దీనికి ప్రధాన కారణమని పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే మొత్తం పెరుగుదలతో 15 శాతమే ఉత్తరకొరియా సంక్షోభం వల్ల చోటు చేసుకున్నదని చెప్పొచ్చు.

వాషింగ్టన్‌లో గడచిన రెండు నెలల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు డాలర్‌ బలహీనతకు, పసిడి పరుగుకు దారితీస్తున్నాయి.

ఇటు అమెరికాలో అనిశ్చిత రాజకీయ, ఆర్థిక పరిస్థితులు కానీ, అటు ఉత్తరకొరియాకు సంబంధించి ఘర్షణాత్మక వాతావరణం కానీ సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం లేదు. ఉత్తరకొరియా తన అణ్వాయుధాలను తన స్వీయరక్షణకే వినియోగిస్తుంది తప్ప, ఇతరులపై ప్రయోగించకపోవచ్చు. అలాగే తక్షణ పరిస్థితి ఎలా ఉన్నా, దీర్ఘకాలంలో అమెరికా ఫెడ్‌ ఫండ్‌ రేటు (ప్రస్తుతం 1.00–1.25 శాతం శ్రేణి) యథాతథంగా కొనసాగే అవకాశమూ లేదు. అందువల్ల తన ఆధిపత్యాన్ని పసిడి కొనసాగించే అవకాశం లేదు. ఆయా పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఏడాది చివరకు పసిడి ఔన్స్‌ 1,250 డాలర్ల వద్దకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.

హర్వే, ఇర్మా వంటి హరికేన్‌ల ప్రభావం నుంచి కోలుకున్నాక రానున్న కొద్ది నెలల్లో ఆర్థిక, రాజకీయ అంశాలకు సంబంధించి నెలకొన్న ప్రతికూలతల నుంచి అమెరికా బయటపడే అవకాశం ఉంది. ట్రంప్‌ సర్కారు ప్రవేశపెట్టే పలు కీలక బిల్లులు ఆమోదం పొందడానికి వీలుంది. అలాగే మౌలిక రంగంపై పెట్టుబడులూ పెరుగుతాయి. ఇవన్నీ కమోడిటీస్‌ ధరల కట్టడికి, వృద్ధి పురోభివృద్ధికి దోహదపడే అంశాలే.  

దేశీయంగా...
అంతర్జాతీయంగా డాలర్‌ బలహీనత నేపథ్యంలో.. అంతే స్పీడ్‌తో ఇక్కడా పసిడి పెరగాల్సి ఉంది. కానీ అలా జరగటం లేదు. దీనికి ప్రధాన కారణం డాలర్‌ మారకంలో రూపాయి పటిష్టం కావడమేనని విశ్లేషణలున్నాయి. కడపటి సమాచారం మేరకు దేశీ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ ఎంసీఎక్స్‌లో ప్రధాన పసిడి కాంట్రాక్ట్‌ ధర రూ.230 లాభంతో రూ.30,303 వద్ద ఉంది. వెండి  రూ.323 లాభంతో రూ.41,646కు  చేరింది.

Advertisement
Advertisement