రిలయన్స్ గ్యాస్ బిల్లింగ్‌పై ప్రభుత్వం కసరత్తు | Sakshi
Sakshi News home page

రిలయన్స్ గ్యాస్ బిల్లింగ్‌పై ప్రభుత్వం కసరత్తు

Published Fri, Nov 14 2014 1:31 AM

Oil Ministry grapples with payment options for RIL's KG-D6 gas

న్యూఢిల్లీ: సహజ వాయువు ధరలను పెంచిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) సరఫరా చేసే గ్యాస్‌కి సంబంధించిన బిల్లింగ్‌పై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. పెంచిన ధర ప్రకారం యూనిట్‌కు(ఎంబీటీయూ) 5.61 డాలర్ల రేటు చొప్పున కొనుగోలు సంస్థలు ఈ వారాంతంలో కంపెనీకి చెల్లించాలి. అయితే, గ్యాస్ ఉత్పత్తి వివాదం తేలేంతవరకూ ఆర్‌ఐఎల్‌కి చెందిన డీ1, డీ3 క్షేత్రాల గ్యాస్ యూనిట్‌కు 4.2 డాలర్ల పాత ధరే కొనసాగించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో బిల్లింగ్‌పై సందిగ్ధత ఏర్పడింది.

దీంతో ప్రధానంగా రెండు పరిష్కారమార్గాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోన్నట్లు చమురు శాఖ వర్గాలు తెలిపాయి. మొదటిదాని ప్రకారం కొనుగోలు సంస్థలు 5.61 డాలర్ల రేటు రిలయన్స్‌కే చెల్లిస్తే, రిలయన్స్ అందులో 4.2 డాలర్లు అట్టే పెట్టుకుని మిగతా 1.41 డాలర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్యాస్ పూల్ అకౌంటులో జమచేయాలి.

రెండో దాని ప్రకారం రిలయన్స్‌కి కొనుగోలు సంస్థలు 4.2 డాలర్లే చెల్లించి, మిగతా మొత్తం నేరుగా గ్యాస్ పూల్ అకౌంటులో జమచేయాలి. గ్యాస్ రేటును పెంచినప్పటికీ కేజీ డీ6 బ్లాక్‌లో నిర్దేశిత స్థాయిలో గ్యాస్ ఉత్పత్తి చేయలేదన్న ఆరోపణలపై నిజానిజాలు తేలేంత వరకూ రిలయన్స్‌కు కొత్త రేటును పూర్తి స్థాయిలో వర్తింపచేయకూడదని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement