ఎరువుల ప్లాంట్లు అన్నిటికీ ఒకే స్థాయి గ్యాస్ ధర! | Sakshi
Sakshi News home page

ఎరువుల ప్లాంట్లు అన్నిటికీ ఒకే స్థాయి గ్యాస్ ధర!

Published Thu, Feb 19 2015 1:15 AM

ఎరువుల ప్లాంట్లు అన్నిటికీ ఒకే స్థాయి గ్యాస్ ధర! - Sakshi

న్యూఢిల్లీ: ఎరువుల ప్లాంట్లన్నింటికీ ఒకే రేటుపై, అందుబాటు ధరలో గ్యాస్‌ను అందించే దిశగా కేంద్ర చమురు శాఖ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. దేశీ సహజ వాయువు, దిగుమతి చేసుకున్న ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) రేట్ల సగటు ఆధారంగా గ్యాస్ ధరను నిర్ణయించాలని (పూలింగ్) ప్రతిపాదించింది. ఇందుకోసం గాను ఎరువుల ప్లాంట్ల కోసం దిగుమతి చేసుకునే ఎల్‌ఎన్‌జీపై కస్టమ్స్ సుంకాన్ని, సర్వీస్ ట్యాక్స్ మొదలైన వాటి నుంచి మినహాయింపునివ్వాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తేవాలని చమురు శాఖ భావిస్తోంది.

ప్రస్తుతం దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్ ధర యూనిట్‌కు 4.2 డాలర్లుగా ఉంది. దిగుమతి చేసుకునే ఎల్‌ఎన్‌జీ ధరలో ఇది మూడో వంతు స్థాయిలో ఉంది. ప్రస్తుతం దేశంలో 30 ఎరువుల ప్లాంట్లు ఉండగా.. వీటిలో 27 గ్యాస్ ఆధారితమైనవి, మూడూ నాఫ్తా ఆధారంగా పనిచేసేవి. దేశీయంగా ఏటా 30 మిలియన్ టన్నుల మేర యూరియా వినియోగమవుతుండగా 23 మిలియన్ టన్నుల దేశంలోనే ఉత్పత్తి అవుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement