ఎన్నారైలు...ట్యాక్స్ రిటర్నులు | Sakshi
Sakshi News home page

ఎన్నారైలు...ట్యాక్స్ రిటర్నులు

Published Sun, Jun 15 2014 1:14 AM

ఎన్నారైలు...ట్యాక్స్ రిటర్నులు

ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) విదేశాల్లో ఆర్జించిన ఆదాయంపై భారత్‌లో పన్ను ఉండదు. కానీ, కొందరు ఎన్నారైలకు తమ స్వదేశంలో డిపాజిట్లు, అద్దెల రూపంలో ఆదాయాలుంటాయి. ఇలాంటి ఆదాయం వార్షిక పరిమితి రూ.2 లక్షలు మించితే వారు విదేశాల్లో నివసిస్తున్నా ఇక్కడ కూడా ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. డిపాజిట్లు, అద్దెలే కాకుండా షేర్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి వాటిలోనూ లాభాలొస్తే వాటికీ పన్ను చెల్లించాలి. ఎన్నారైలు రిటర్నులు దాఖలు చేయడానికి గడువు జూలై 31. రిటర్నుల దాఖలుకు ముందు ఎన్నారైలు గమనించాల్సిన కొన్ని అంశాలివీ...
 
రిటర్నులు ఎప్పుడు దాఖలు చేయాలంటే..
ఇండియాలో ఆదాయం బేసిక్ మినహాయింపు పరిమితిని మించినపుడు; చెల్లించాల్సిన పన్ను కంటే ఎక్కువ డిడక్ట్ చేసినపుడు; మూలధన నష్టాల(క్యాపిటల్ లాస్)కు సంబంధించిన క్లెయిమ్‌ల పరిష్కారానికి రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. పన్ను విధించదగిన ఆదాయం విషయంలో వ్యక్తులకు కొన్ని మినహాయింపులుంటాయి.
 
కొన్ని రకాల పెట్టుబడులు, గృహ రుణంలో అసలును చెల్లించడం మొదలైనవి. ఈ మినహాయింపులు ఎన్నారైలకు కూడా వర్తిస్తాయి. దాఖలు చేసిన ట్యాక్స్ రిటర్నుల నుంచి రిఫండ్ కోసం బ్యాంకు అకౌంటు నంబరు, బ్రాంచ్ ఎంఐసీఆర్ కోడ్ వంటి మీ బ్యాంకు వివరాలను లోపరహితంగా అందించాలి. ఆన్‌లైన్లో రిటర్నులు దాఖలు చేసినపుడు రిఫండ్ కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరిగిపోతుంది.
 
ఆదాయ పన్ను శాఖ వారి ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఎన్నారైలు తమ రిటర్నులను ఆన్‌లైన్లో దాఖలు చేయవచ్చు. ఇందుకు ప్రత్యామ్నాయంగా ట్యాక్స్ అడ్వైజర్ల సహాయాన్ని వారు పొందవచ్చు. లేదంటే ప్రైవేట్, పెయిడ్ ఈ-ఫైలింగ్ పోర్టల్స్ ద్వారానూ రిటర్నులు పంపవచ్చు. ఎన్నారైలకు సంబంధించి... భారత్‌లో వారి ఆదాయమంటే దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్, పెట్టుబడులపై ఆదాయం మాత్రమే ఉంటాయి. మినహాయింపు పరిమితిలోపు ఆదాయం ఉంటే రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఆదాయ స్థానంలోనే పన్ను తగ్గింపు జరిగినా రిటర్నులు సమర్పించనక్కర్లేదు.

Advertisement
Advertisement