ఓఎన్‌జీసీ లాభం 5,915 కోట్లు | Sakshi
Sakshi News home page

ఓఎన్‌జీసీ లాభం 5,915 కోట్లు

Published Thu, May 31 2018 1:59 AM

ONGCs profit was at Rs 5,915 crore - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ, ఓఎన్‌జీసీ జనవరి–మార్చి క్వార్టర్‌లో రూ.5,915 కోట్ల నికర లాభం సాధించింది. గత నాలుగేళ్లలో ఇదే అత్యధిక నికర లాభమని ఓఎన్‌జీసీ తెలిపింది. 2016–17 నాలుగో క్వార్టర్‌లో రూ.4,340 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ సారి 37 శాతం వృద్ధితో రూ.5,915 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ముడి చమురు ధరలు అధికంగా ఉండడం, సుంకాలు తక్కువగా ఉండటం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ పేర్కొంది. ఏడాది కాలంలో అంతర్జాతీయంగా చమురు దరలు 60 శాతం వరకూ పెరగడంతో ఓఎన్‌జీసీ వంటి చమురు ఉత్పత్తి సంస్థల ఆదాయం, లాభాలు జోరుగా పెరిగాయి. ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.23,969 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు 6 శాతం తగ్గి రూ.19,463 కోట్లకు పరిమితమయ్యాయి.

బ్యారెల్‌ ముడి చమురు ఉత్పత్తి రియలైజేషన్లు  54.91 డాలర్ల నుంచి 66.71 డాలర్లకు పెరిగినట్లు సంస్థ తెలియజేసింది. అలాగే గ్యాస్‌ ధర రియలైజేషన్‌ 16 శాతం వృద్ధితో 2.89 డాలర్లకు ఎగసింది. ముడి చమురు ఉత్పత్తి 3 శాతం తగ్గి 6.2 మిలియన్‌ టన్నులకు చేరింది. ఒక్కో షేర్‌కు రూ.1.35 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. ఇప్పటికే రెండు దశలో ఒక్కో షేర్‌కు రూ.5.25 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించామని తెలిపింది.  ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 11 శాతం వృద్ధితో రూ.19,945 కోట్లకు, టర్నోవర్‌ 5 శాతం వృద్ధితో రూ.27,704 కోట్లకు పెరిగాయి. 2017–18లో మొత్తం 12 చమురు, గ్యాస్‌ అన్వేషణలను కనుగొన్నామని తెలిపింది. మార్కెట్‌ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలను వెల్లడించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఓఎన్‌జీసీ షేర్‌ 0.85 శాతం నష్టంతో రూ.174 వద్ద ముగిసింది.   

Advertisement
Advertisement