నిశ్చింతగా రిటైర్మెంట్ ఇలా.. | Sakshi
Sakshi News home page

నిశ్చింతగా రిటైర్మెంట్ ఇలా..

Published Sun, Sep 7 2014 12:20 AM

నిశ్చింతగా రిటైర్మెంట్ ఇలా..

ఉద్యోగం చేసినన్నాళ్లు  కుటుంబానికి ఏ ఢోకా లేకుండా చూసుకునేందుకు, సౌకర్యంగా గడిపేందుకు ప్రాధాన్యతనిస్తుంటాం. అయితే ప్రస్తుత అవసరాలపై దృష్టి పెట్టే హడావుడిలో .. రిటైర్మెంట్ గురించి ప్లానింగ్ చేసుకోవడాన్ని మనలో చాలా మంది పట్టించుకోరు. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి సంపన్న దేశాల్లో ప్రభుత్వం తమ పౌరులందరికీ రిటైర్మెంట్ తర్వాత సామాజిక భద్రత కల్పిస్తుంటుంది.

కానీ భారత్‌లో మాత్రం ఉద్యోగం చేసే జనాభాలో కేవలం 12 శాతం మందికి మాత్రమే పింఛను కవరేజి ఉంది. వారికి కూడా ప్రావిడెంట్ ఫండ్ ఏకమొత్తంగా లభించినా.. ధరల పెరుగుదల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. నెలవారీగా పింఛను వచ్చినా అదే పరిస్థితి.  ప్రస్తుతం దాదాపు రూ. 15,000గా ఉన్న కుటుంబఖర్చులు.. పదేళ్లలో రూ. 35,000కి పెరిగిపోతాయన్న ద్రవ్యోల్బణ గణాంకాల్లో అతిశయోక్తి లేదు. అంటే మనం పొదుపు చేసే దానికి మించిన స్థాయిలో ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇది రిటైర్మెంట్ తర్వాత గడిపే జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది. కనుక, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొని పదవీ విరమణ తర్వాత కూడా నిశ్చింతగా జీవితం గడపాలంటే సమగ్రమైన ప్రణాళిక ఉండాలి.

 లక్ష్యాన్ని బట్టి ప్రణాళిక ..
 రిటైర్మెంట్ ప్లాన్ రూపొందించుకునేటప్పుడు ప్రధానంగా ఆర్థిక లక్ష్యాలు, మీరెంత రిస్కు తీసుకోగలరు, అలాగే ద్రవ్యోల్బణం రేటును పరిగణనలోకి తీసుకోవాలి. రిటైరయ్యాక జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నారు? ప్రపంచాన్ని చుట్టి వద్దామనుకుంటున్నారా, ఏదైనా కన్సల్టెన్సీ లాంటిది ప్రారంభిస్తారా లేదా హాయిగా ఇంటిపట్టునే ఉండి మనవలు, మనవరాళ్లతో సరదాగా కాలం వెళ్లబుచ్చుదామనుకుంటున్నారా? ఇలా.. మీ రిటైర్మెంట్ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి.

దానికి అవసరమయ్యే నిధిని సమకూర్చుకునేందుకు అనువైన వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాలి. ఇందుకోసం స్టాక్స్, బీమా, మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్‌లు మొదలైన సాధనాలు ఉన్నాయి. మీరు ఏ దశలో ఉన్నారు, ఆర్థిక లక్ష్యాలేంటి, రిస్కు సామర్థ్యం ఎంత మొదలైన వాటి ఆధారంగా వీటన్నింటి మేళవింపుతో సమగ్రమైన పోర్ట్‌ఫోలియో రూపొందించుకోవాలి.

 రిటైర్మెంట్ లేదా పింఛను పథకాలు: బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు వీటిని ఆఫర్ చేస్తుంటాయి. ఇవి దీర్ఘకాలికమైనవి. బీమా కంపెనీలు అందించే పింఛను పథకాల్లో మెచ్యూరిటీ వేళ సమ్ అష్యూర్డ్‌లో 30 శాతం మొత్తాన్ని అందుకోవచ్చు. మిగతాది యాన్యుటీ రూపంలో అందుకోవచ్చు.

 ఆరోగ్య బీమా: వైద్యం ఖర్చులు రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో సమగ్రమైన ఆరోగ్య బీమా ఉండాలి. మెడిక్లెయిమ్, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీ ఆరోగ్యానికి బీమా రక్షణ పొందవచ్చు.

 ఎండోమెంట్ పథకాలు: బీమా సంస్థలు అందించే ఈ పథకాలు పిల్లల పెళ్లిళ్లు, ఇల్లు కొనుగోలు వంటి నిర్దిష్ట లక్ష్యాలకు ఉపయోగపడతాయి. బీమాతో పాటు పెట్టుబడి పథకాలుగా ఇవి ఉపయోగపడతాయి. క్రమం తప్పకుండా నిర్దిష్ట కాలానికి ప్రీమియం కడితే, గడువు తీరిన తర్వాత భారీ మొత్తాన్ని మెచ్యూరిటీ విలువ కింద అందుకోవచ్చు. ఒకవేళ పాలసీదారు ఆకస్మికంగా మరణించినా నామినీకి సమ్ అష్యూర్డ్ మొత్తం అందుతుంది. పెట్టుబడి, ఆర్థిక లక్ష్యాలకు ఎటువంటి విఘాతం కలగకపోవడం ప్రధాన ప్రయోజనం.

 వీటన్నింటితో పాటు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ అనుభవాన్ని, రిస్కు సామర్థ్యాన్ని బట్టి స్టాక్స్‌లో నేరుగా లేదా యులిప్స్ లేదా ఫండ్స్ మార్గంలో పెట్టుబడి పెట్టొచ్చు. స్టాక్‌మార్కెట్లలో భారీ ఒడిదుడుకులు ఉంటుంటాయి కనుక వయసు పెరిగే కొద్దీ ఈక్విటీల్లో పెట్టుబడులను క్రమంగా తగ్గించుకోవడం మంచిది.

 రిటైర్మెంట్ తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారన్న దాని ఆధారంగా ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి. పర్యాటక ప్రదేశాలు తిరిగి రావడం వంటి ఆలోచనలు ఉంటే కాస్త దూకుడుగా, ఈక్విటీ ఆధారిత ప్రణాళికలు, అలా కాకుండా ఇంటిపట్టునే ఉంటే డెట్ సాధనాల ఆధారిత ప్లాన్ వైపు మొగ్గు చూపవచ్చు. పిల్లల చదువు, పెళ్లిళ్లు మొదలైన వాటికి ముందునుంచే ప్లానింగ్ చేసుకుంటే నిశ్చింతగా రిటైర్ కావొచ్చు.

Advertisement
Advertisement