2 ఫొటోలతో జన ధన ఖాతా తెరవొచ్చు | Sakshi
Sakshi News home page

2 ఫొటోలతో జన ధన ఖాతా తెరవొచ్చు

Published Tue, Sep 23 2014 12:48 AM

2 ఫొటోలతో జన ధన ఖాతా తెరవొచ్చు

న్యూఢిల్లీ: కేవలం సంతకంతో కూడిన 2 ఫొటోగ్రాఫ్‌లు సమర్పించి ఎవరైనా జన ధన అకౌంట్లను ప్రారంభించవచ్చని ఆర్థిక మంత్రిత్వశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అధికారికంగా ఎటువంటి పత్రాలు లేదా ఆధార్ నంబర్లు లేని వారికి ఈ వెసులుబాటు ఎంతో ప్రయోజనం చేకూర్చుతుందని ప్రకటన తెలిపింది. ఆగస్టు 26న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆర్థిక మంత్రిత్వశాఖ తాజా అధికారిక ప్రకటన జారీ చేసింది. అయితే ఈ తరహా అకౌంట్లను ‘స్మాల్ అకౌంట్లుగా పిలుస్తారు.

12 నెలలు మాత్రమే ఇవి అమల్లో ఉంటాయి. ఈ అకౌంట్ ప్రారంభించిన 12 నెలలలోపు అధికారిక పత్రాలను సంబంధిత అకౌంట్ హోల్డర్ సమర్పించాల్సి ఉంటుంది. స్మాల్ అకౌంట్లకు కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. బ్యాలెన్స్ ఎప్పుడూ రూ.50,000 దాటకూడదు. మొత్తం క్రెడిట్ ఒక ఏడాదిలో రూ. లక్ష దాటకూడదు. ఒక నెలలో నగదు ఉపసంహరణ రూ.10,000కు మించి ఉండకూడదు. ఇప్పటికే అకౌంట్‌ను కలిగిఉన్న ఒక వ్యక్తి ప్రధానమంత్రి జన ధన యోజన కింద ప్రయోజనాలను పొందడానికి మరో బ్యాంక్ అకౌంట్ పొందాల్సిన అవసరం లేదని కూడా ఆర్థికమంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటికే అకౌంట్‌ను కలిగిఉన్న వారు ఈ ప్రయోజనాలు పొందడానికి తమ అకౌంట్ కలిగి ఉన్న బ్రాంచ్‌లో ఒక దరఖాస్తు సమర్పిస్తే సరిపోతుంది.

అకౌంట్లు తెరవడానికి సంబంధించిన దరఖాస్తులు అందుబాటులో ఉండడం లేదని కొన్ని ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ  తెలిపింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రధాన వార్తా పత్రికల్లో దరఖాస్తులతో కూడిన ప్రకటనలు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ దరఖాస్తులు తీసుకువచ్చి సైతం ఎవరైనా అకౌంట్లను ప్రారంభించవచ్చని తెలిపింది. ఠీఠీఠీ.జజ్చీఛిజ్చీట్ఛటఠిజీఛ్ఛిట.జౌఠి.జీ వెబ్‌సైట్ ద్వారా కూడా అకౌంట్ ఓపెనింగ్ డాక్యుమెంటును పొందవచ్చని వెల్లడించింది. కాగా, జన ధన యోజన కింద ఇప్పటికి 4.18 కోట్ల అకౌంట్లను ప్రారంభించినట్లు పేర్కొంది.

Advertisement
Advertisement