ఆ కార్ల కోసం లక్షకుపైగా వెయిటింగ్‌ | Sakshi
Sakshi News home page

ఆ కార్ల కోసం లక్షకు పైగా కస్టమర్లు వెయిటింగ్‌

Published Mon, May 7 2018 1:26 PM

Over 1 Lakh Customers Waiting For Maruti Cars - Sakshi

మార్కెట్‌లో దేశీయ అతిపెద్ద కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ కార్లకు ఉన్న పాపులారిటీ తెలిసిందే. రోడ్లపై చక్కర్లు కొట్టే వాహనాల్లో సగానికి పైగా ఈ కంపెనీవే. రోజురోజుకి ఈ సంస్థ కార్లకు డిమాండ్‌ పెరగడమే కానీ, తగ్గడం మాత్రం ఉండదు. తాజాగా స్విఫ్ట్‌, బాలెనో, డిజైర్‌, విటారా బ్రిజా కార్ల కోసం లక్షకు పైగా కస్టమర్లు వేచిచూస్తున్నట్టు తెలిసింది. ఈ నాలుగు కార్లు కలిపి 1,10,00 యూనిట్ల పెండింగ్‌ ఆర్డర్లను కలిగి ఉన్నాయని రిపోర్టులు పేర్కొన్నాయి. మనీకంట్రోల్‌ రిపోర్టు ప్రకారం కంపెనీకి చెందిన గుజరాత్‌ ప్లాంట్‌లో ఉత్పత్తిని పెంచి, ఈ ప్రొడక్ట్‌ల వెయిటింగ్‌ కాలాన్ని తగ్గించాలని మారుతీ సుజుకీ ప్లాన్‌ చేస్తోందని తెలిసింది. కొత్త మారుతీ స్విఫ్ట్‌ను కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్‌ చేసింది. లాంచ్‌ అయిన వెంటనే ఈ కారు టాప్‌-సెల్లింగ్‌ కార్ల జాబితాలో చోటు దక్కించుకుంది. 

లాంచ్‌ అయిన రెండు నెలల్లోనే స్విఫ్ట్‌కు దాదాపు లక్ష బుకింగ్స్‌ నమోదైనట్టు తెలిసింది. మరోవైపు ఏడాది క్రితం లాంచ్‌ అయిన మారుతీ డిజైర్‌కు కూడా అంతే డిమాండ్‌ వస్తోంది. లాంచ్‌ అయిన ఐదు నెలల లోపే ఈ కారు కూడా లక్ష యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ సెడాన్‌ గతేడాది టాప్‌ సెల్లింగ్‌ కార్ల జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. 2018 ఏప్రిల్‌ చివరి నాటికి మారుతీకి 1.72 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదు కాగ, హ్యుందాయ్‌ ఇండియాకు 59,744 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయని తెలిసింది. ఈ గణాంకాలు బట్టి మారుతీ సుజుకీ ఉత్పత్తులకు భారత్‌లో ఎంత క్రేజ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం గుజరాత్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని 2.5 లక్షల యూనిట్లకు పెంచాలని మారుతీ చూస్తోంది.  ఈ ప్లాంట్‌కు మరో రెండు లైన్లను కూడా జత చేయాలనుకుంటోంది. మొత్తంగా 2020 నాటికి 7.5 లక్షల యూనిట్ల కెపాసిటీని మారుతీ పెంచబోతోంది.
 

Advertisement
Advertisement