బ్రాండ్స్ వైపు ఫార్మా చూపు.. | Sakshi
Sakshi News home page

బ్రాండ్స్ వైపు ఫార్మా చూపు..

Published Sat, Apr 23 2016 12:32 AM

బ్రాండ్స్ వైపు ఫార్మా చూపు..

గడిచిన నాలుగు నెలల్లో మూడు డీల్స్
జాబితాలో సన్, స్ట్రైడ్స్, పిరమాల్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  సాధారణంగా విదేశాల్లో విస్తరణ కోసం కంపెనీల కొనుగోలు లేదా జనరిక్స్ మార్గాన్ని ఎంచుకునే దేశీ ఫార్మా కంపెనీలు ప్రస్తుతం రూటు మారుస్తున్నాయి.  పేరొందిన ఔషధ బ్రాండ్లను కొనుగోలు చేస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ మొదలుకుని ఇటీవలి సన్ ఫార్మా, స్ట్రైడ్స్ షసన్  దాకా చాలా మటుకు దేశీ సంస్థలు గత కొన్నాళ్లుగా ఈ తరహా డీల్స్ కుదుర్చుకున్నాయి. ఫార్మా దిగ్గజం సన్ .. స్విట్జర్లాండ్ ఫార్మా సంస్థ నొవార్టిస్‌కు చెందిన 14 ప్రిస్క్రిప్షన్ బ్రాండ్లను కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకుంది.

దీని విలువ దాదాపు రూ. 1,900 కోట్లు (సుమారు 293 మిలియన్ డాలర్లు). వివిధ చికిత్సల్లో ఉపయోగపడే ఈ బ్రాండ్స్ అన్నింటి వార్షికాదాయాలు 160 మిలియన్ డాలర్ల పైచిలుకు ఉంటాయి. ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతి పెద్ద ఔషధ మార్కెట్ కావడంతో పాటు అత్యధికంగా నియంత్రణలు కూడా ఉండే జపాన్‌లో కార్యకలాపాలు విస్తరించడానికి సన్ ఫార్మాకు ఈ డీల్ ఉపయోగపడనుంది. జపాన్ ఔషధ మార్కెట్ ఏకంగా 73 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని అంచనా. 1 లక్ష కోట్ల డాలర్ల అంతర్జాతీయ ఫార్మా మార్కెట్లో జపాన్‌కు దాదాపు 7 శాతం వాటా ఉంటుంది.

 ఇక మరోవైపు, స్వీడన్‌కు చెందిన మోబర్గ్ ఫార్మా నుంచి స్ట్రైడ్స్ షసన్ .. జాయింట్‌ఫ్లెక్స్, ఫెర్గాన్, వ్యాంక్విష్ అనే మూడు బ్రాండ్లను కొనుగోలు చేసింది. ఇందుకోసం 10.4 మిలియన్ డాలర్లు వెచ్చించింది. మోబర్గ్ బ్రాండ్ల కొనుగోలు.. అమెరికా, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాల్లో ఓవర్ ది కౌంటర్(ఓటీసీ) ఔషధాల విభాగంలో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు తోడ్పడగలదని స్ట్రైడ్స్ పేర్కొంది.

 దేశీయంగాను..
ఇలా కొన్ని ఫార్మా సంస్థలు విదేశీ మార్కెట్‌పై కసరత్తు చేస్తుండగా.. మరికొన్ని సంస్థలు దేశీయంగాను బ్రాండ్ల కొనుగోలుపై దృష్టి పెట్టాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ కొన్నాళ్ల క్రితం బెల్జియం బయోఫార్మా సంస్థ యూసీబీ ఎస్‌ఏకి చెందిన కొన్ని ఉత్పత్తులను దాదాపు రూ. 800 కోట్లకు కొనుగోలు చేసింది. వాటిని భారత్, నేపాల్, శ్రీలంక, మాల్దీవుల్లో విక్రయించే హక్కులను దక్కించుకుంది. అటారాక్స్, జెర్టైక్, జైజాల్ వంటివి వీటిలో ఉన్నాయి. డెర్మటాలజీ, పీడియాట్రిక్స్ తదితర విభాగాల్లో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఇవి తోడ్పడగలవని డాక్టర్ రెడ్డీస్ వర్గాలు పేర్కొన్నాయి. అంతక్రితమే నొవార్టిస్ నుంచి హాబిట్రోల్ అనే ఓటీసీ బ్రాండ్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కొనుగోలు చేసింది.

 పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్ గతేడాది డిసెంబర్‌లో ఎంఎస్‌డీ సంస్థ నుంచి అయిదు బ్రాండ్స్‌ను (న్యాచురోలాక్స్, ల్యాక్టోబాసిల్ మొదలైనవి) కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ రూ. 92 కోట్లు. దేశీయంగా పేరొందిన ఈ బ్రాండ్స్‌ను ఓటీసీ మార్గంలో విక్రయించాలన్నది పిరమాల్ యోచన. భారత ఓటీసీ మార్కెట్ రూ. 15,000 కోట్లు కాగా ఏటా 14 శాతం మేర వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం పిరమాల్‌కి చెందిన ఆరు బ్రాండ్లు టాప్ 100 ఓటీసీల్లో ఉండగా.. తాజాగా ఈ సంఖ్య ఎనిమిదికి చేరింది. అంతకు ముందే బేబీకేర్ బ్రాండ్ లిటిల్స్‌ను కూడా పిరమాల్ కొనుగోలు చేసింది.

Advertisement
Advertisement