బెంగళూరులో పానాసోనిక్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ | Sakshi
Sakshi News home page

బెంగళూరులో పానాసోనిక్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌

Published Tue, Apr 11 2017 2:18 AM

బెంగళూరులో పానాసోనిక్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌

టాటా ఎలెక్సి భాగస్వామ్యంతో ఏర్పాటు  
న్యూఢిల్లీ: కన్సూమర్‌ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం పానాసోనిక్‌ బెంగళూరులో పరిశోధన, అభివృద్ధి కేంద్రం(ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌)ను ఏర్పాటు చేయనుంది. టాటా ఎలెక్సి భాగస్వామ్యంతో ఈ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని పానాసానిక్‌ తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గృహోపకరణాల వ్యాపారాన్ని మరింతగా పటిష్టం చేసుకోవడం లక్ష్యంగా ఈ ఆర్‌అండ్‌ డీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని పానాసోనిక్‌ కార్పొరేషన్‌ సీనియర్‌ ఎండీ టెట్సురో హŸమ పేర్కొన్నారు.

 ఈ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌కు సమగ్రమైన డిజైన్, టెక్నాలజీ సర్వీస్‌లను టాటా ఎలెక్సి అందిస్తుందని తెలిపారు. ఉత్పత్తుల రూపకల్పన, తయారీలో ఆర్టిఫిషి యల్‌ ఇంటెలిజెన్స్, రోబొటిక్స్‌ వంటి టెక్నాలజీల వినియోగంపై ఈ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌లో పరిశోధనలు జరుగుతాయని టెట్సురో తెలియజేశారు. ఈ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ రెండు విభాగాలుగా ఉంటుందని, ఒకటి డిజైన్‌ డివిజన్‌ అని, మరొకటి ఆఫ్‌షోర్‌ డెవలప్‌మెంట్‌ డివిజన్‌ అని వివరించారు. భారత్, దక్షిణాసియా, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా దేశాల్లో తమ వ్యాపార వృద్ధి కోసం ఈ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కొత్త కేటగిరీ గృహోపకరణాల తయారీకి ఈ సెంటర్‌ ఇతోధికంగా తోడ్పాటునందించగలదని వివరించారు.

ముఖ్యమైన భాగస్వామ్యం..
ఇది తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామ్యమని టాటా ఎలెక్సి సీఈఓ, ఎండీ మధుకర్‌ దేవ్‌ పేర్కొన్నారు. తమ రెండు సంస్థలు కలసి ఇంటర్నెట్‌ ఆఫ్‌  థింగ్స్‌(ఐఓటీ)వంటి టెక్నాలజీలపై పరిశోధన జరుపుతాయని, తర్వాతి తరం గృహోపకరణాల తయారీకి తోడ్పడే టెక్నాలజీలను అభివృద్ధి చేస్తామని వివరించారు. భారత్‌లో తయారీకి బద్దులమై ఉన్నామనడానికి టాటా ఎలెక్సితో ఈ భాగస్వామ్యం ఒక నిదర్శనమని పానాసోనిక్‌ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ మనీశ్‌ శర్మ చెప్పారు. ఇటీవలనే పానాసానిక్‌ కంపెనీ జజ్జార్‌లో తొలి రిప్రిజిరేటర్‌ ప్లాంట్‌ను రూ.115 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి కార్యకలాపాలు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement