8 శాతం పెరిగిన ప్యాసింజర్‌ వాహన విక్రయాలు! | Sakshi
Sakshi News home page

8 శాతం పెరిగిన ప్యాసింజర్‌ వాహన విక్రయాలు!

Published Tue, Mar 13 2018 1:42 AM

Passenger vehicle sales up 8 percent - Sakshi

న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్‌ వాహన విక్రయాల్లో ఫిబ్రవరి నెలలో 7.77 శాతం వృద్ధి నమోదయ్యింది. యుటిలిటీ వాహనాల  బలమైన డిమాండ్‌ దీనికి ప్రధాన కారణం. సియామ్‌ గణాంకాల ప్రకారం..  

దేశీ ప్యాసింజర్‌ వాహన (పీవీ) విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 2,55,470 యూనిట్ల నుంచి 2,75,329 యూనిట్లకు పెరిగాయి. అలాగే దేశీ కార్ల అమ్మకాలు 3.7 శాతం వృద్ధి చెందాయి. ఇవి 1,72,737 యూనిట్ల నుంచి 1,79,122 యూనిట్లకు ఎగశాయి. ఇక యుటిలిటీ వాహన అమ్మకాలు 21.82 శాతం వృద్ధితో 65,877 యూనిట్ల నుంచి 80,254 యూనిట్లకు పెరిగాయి. 
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–ఫిబ్రవరి మధ్య కాలంలో పీవీ విక్రయాలు 8.04 శాతం, వాణిజ్య వాహన అమ్మకాలు 19.3 శాతం, త్రీవీలర్స్‌ విక్రయాలు 19.11 శాతం, టూవీలర్స్‌ అమ్మకాలు 14.47 శాతం ఎగశాయి.
 మార్కెట్‌ లీడర్‌ మారుతీ సుజుకీ ఇండియా దేశీ ప్యాసింజర్‌ అమ్మకాలు 13.31 శాతం వృద్ధితో 1,36,648 యూనిట్లకు చేరాయి. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా విక్రయాలు 5.15 శాతం వృద్ధితో 44,505 యూనిట్లకు పెరిగాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాలు 8.43 శాతం వృద్ధితో 22,339 యూనిట్లకు, టాటా మోటార్స్‌ పీవీ అమ్మకాలు 43.45 శాతం వృద్ధితో 20,022 యూనిట్లకు ఎగశాయి.   
 మొత్తం టూవీలర్‌ విక్రయాలు 23.77 శాతం వృద్ధి చెందాయి. ఇవి 13,62,043 యూనిట్ల నుంచి 16,85,814 యూనిట్లకు చేరాయి.  
   మోటార్‌సైకిల్‌ అమ్మకాలు 26.48 శాతం పెరిగాయి. ఇవి 10,53,230 యూనిట్లుగా నమోదయ్యాయి. మార్కెట్‌ లీడర్‌ హీరో మోటొకార్ప్‌ దేశీ మోటార్‌ సైకిల్‌ విక్రయాలు 18.8 శాతం వృద్ధితో 5,35,232 యూనిట్లకు ఎగశాయి.  
 స్కూటర్‌ విభాగానికి వస్తే.. మార్కెట్‌ లీడర్‌ హోండా స్కూటర్‌ అండ్‌ మోటార్‌సైకిల్‌ ఇండియా దేశీ విక్రయాలు 30.1 శాతం వృద్ధి చెందాయి. ఇవి 3,25,204 యూనిట్లుగా నమోదయ్యాయి.  
 వాణిజ్య వాహన అమ్మకాలు 31.13 శాతం వృద్ధితో 87,777 యూనిట్లకు ఎగశాయి.  

‘ప్యాసింజర్‌ వెహికల్స్, టూవీలర్స్‌ సహా అన్ని విభాగాల్లోనూ విక్రయాలు పెరుగుతున్నాయి. అయితే కేవలం హెవీ బస్సుల విభాగం దీనికి మినహాయింపు. దీని గురించే మేం ఆందోళన చెందుతున్నాం’ అని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ వినోద్‌ మాథూర్‌ తెలిపారు. టూవీలర్‌ విభాగంలో మోటార్‌సైకిల్స్‌ కేటగిరీ మంచి పనితీరు కనబరుస్తోందని సియామ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సుగతో సేన్‌ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటి విక్రయాలు తొలిసారి 2 కోట్ల యూనిట్లను అధిగమించొచ్చని అంచనా వేశారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement