విస్తరణపై పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు దృష్టి | Sakshi
Sakshi News home page

విస్తరణపై పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు దృష్టి

Published Thu, Jan 4 2018 12:36 AM

Pay attention to the postal payments bank on expansion - Sakshi

న్యూఢిల్లీ: తపాలా విభాగానికి చెందిన ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) తన కార్యకలాపాలు విస్తరించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి ఐపీపీబీ మొత్తం 650 శాఖలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు లోక్‌సభకిచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా తెలిపారు. పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు సాగించేందుకు గతేడాది జనవరి 20న ఐపీపీబీకి ఆర్‌బీఐ లైసెన్సు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐపీపీబీ గతేడాది జనవరి 30న ప్రయోగాత్మకంగా రాయ్‌పూర్‌ (చత్తీస్‌గఢ్‌), రాంచీ (జార్ఖండ్‌)లో రెండు శాఖలను మాత్రమే ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా శాఖలను విస్తరించలేదు.

దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించాలని భావిస్తున్న ఐపీపీబీ..  వీలును బట్టి మొత్తం పోస్టాఫీసులన్నింటినీ (సుమారు 1.55 లక్షలు) బ్యాంకింగ్‌ పథకాలు, సర్వీసులను అందించడానికి ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు మనోజ్‌ సిన్హా తెలిపారు. మరోవైపు, ఇతర బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలతో కూడా ఐపీపీబీ ఒప్పం దాలు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిపై ఇప్పటికే పలు సంస్థలు ఆసక్తి వ్యక్తపర్చాయని, ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలతో ఐపీపీబీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని మనోజ్‌ సిన్హా చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement