Sakshi News home page

డాలర్‌ ర్యాలీతో పసిడి పరుగు కష్టమే

Published Mon, May 7 2018 1:42 AM

Phil stribli on doller index - Sakshi

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ ఇండెక్స్‌ పరుగు కొనసాగితే పసిడి వెనక్కు తగ్గడం ఖాయమని ఆర్‌జేఓ ఫ్యూచర్స్‌లో సీనియర్‌ మార్కెట్‌ విశ్లేషకులు ఫిల్‌ స్ట్రిబ్లీ అభిప్రాయపడ్డారు. గతవారం పసిడికి సంబంధించి రెండు ప్రధాన అంశాలు చూస్తే...
ఒకటి అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ ఫండ్‌ రేటు (ప్రస్తుతం 1.50–1.75 శాతం శ్రేణి)లో ఎలాంటి మార్పు చేయలేదు.  
18 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో అమెరికా నిరుద్యోగిత 3.9 శాతంగా నమోదయ్యింది.  

ఈ రెండు అంశాల నేపథ్యంలో వారంలో పసిడి న్యూయార్క్‌ కమోడిటీ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ ఔన్స్‌ (31.1గ్రా) ధర 9 డాలర్లు తగ్గి 1,316 డాలర్లకు పడింది. కేవలం నెలరోజుల వ్యవధిలో 1,368 డాలర్ల స్థాయి నుంచి పసిడి ప్రస్తుత స్థాయికి పడుతూ వచ్చింది. అయితే ఇదే సమయంలో డాలర్‌ ఇండెక్స్‌ 89.10 కనిష్ట స్థాయిల నుంచి 4వ తేదీతో ముగిసిన శుక్రవారం నాటికి 92.42 స్థాయికి చేరింది.  

ఫిల్‌ స్ట్రిబ్లీ అభిప్రాయం ప్రకారం–  జూన్‌లో ఫెడ్‌రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనితో డాలర్‌ ఇండెక్స్‌ మరింత పెరిగే అవకాశం ఉంది.  బంగారంపై తీవ్ర ఒత్తిడిని పెంచే అంశం ఇది. ఇక అంతర్జాతీయ ఉద్రిక్తతలూ తీవ్ర రూపం దాల్చే అవకాశాలు తక్కువే. ఉత్తరకొరియా విషయంలో ఇప్పటికే ఈ విషయం స్పష్టమైంది. సంబంధిత అంశాలన్నీ పసిడి ధరను తగ్గించే అవకాశాలే ఉన్నాయి. ‘‘ప్రస్తుతం డాలర్‌ ఇండెక్స్‌ ఒక స్థిర స్థాయిలో తిరుగుతోంది. ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత గరిష్టస్థాయిలు 95ను తాకవచ్చన్నది మా అంచనా. గత నవంబర్‌లో డాలర్‌ ఇండెక్స్‌ ఇదే స్థాయిలో ఉంది. అప్పుడు పసిడి స్థాయి 1,275 డాలర్లు. ఇప్పుడు డాలర్‌ ర్యాలీ జరిగితే పసిడి 1,300 డాలర్ల స్థాయి దిగువకు పడిపోవచ్చు’’ అని  ఫిల్‌ స్ట్రిబ్లీ అభిప్రాయపడ్డారు. అయితే 1,300 డాలర్లు పటిష్ట మద్దతు స్థాయని ఆయన అంచనావేస్తున్నారు. 

ఇక ఎగువ స్థాయిలో 1,370 డాలర్ల వద్ద పసిడికి పటిష్టం నిరోధం కనిపిస్తోంది. ఈ ఏడాది చివరి నుంచీ ఇదే శ్రేణిలో తిరిగిన పసిడి సమీప కాలంలో తన బాటను మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణుల విశ్లేషణ. అమెరికా వృద్ధి సంబంధ అంశాలు ఇందుకు ప్రధానంగా దోహదపడతాయని భావిస్తున్నారు.

దేశీయంగా స్వల్ప నష్టాలు...
డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత (4వ తేదీతో ముగిసిన వారంలో 20 పైసలు నష్టంతో 66.82), అంతర్జాతీయంగా ప్రతికూలతల నేపథ్యంలో గడచిన వారంలో పసిడి స్వల్పంగా నష్టపోయింది. దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాముల ధర రూ.103 తగ్గి రూ.31,114వద్ద ముగిసింది. ఇక ముంబై ప్రధాన మార్కెట్‌లో 99.9, 99.5 స్వచ్ఛత ధరలు రూ.170 చొప్పున తగ్గి రూ.31,160, రూ.31,010 వద్ద ముగిశాయి. వెండి కేజీ ధర రూ.90 తగ్గి రూ.39,180 వద్ద ముగిసింది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement