మంచి తరుణం ఇదే...! | Sakshi
Sakshi News home page

మంచి తరుణం ఇదే...!

Published Wed, Nov 19 2014 12:26 AM

మంచి తరుణం ఇదే...! - Sakshi

 మెల్‌బోర్న్: కొత్త ప్రభుత్వం వ్యాపారాలకు అనుకూల సంస్కరణలు చేస్తున్న నేపథ్యంలో భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇదే సరైన సమయమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పర్యావరణ అనుకూల టెక్నాలజీ, ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ), గ్యాస్, విద్య, పర్యాటక రంగాల అభివృద్ధిలో తోడ్పాటు అందించాలని ఆస్ట్రేలియా కార్పొరేట్ దిగ్గజాలను ఆహ్వానించారు. విక్టోరియా రాష్ట్ర గవర్నర్ అలెక్స్ చెర్నోవ్.. వ్యాపార వర్గాలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

 ఇందులో 600 మంది ఆస్ట్రేలియా, భారత్ కార్పొరేట్ దిగ్గజాలు పాల్గొన్నారు. ‘సమ్మిళిత వృద్ధి సాధించేందుకు, ఎకానమీని వేగంగా అధిక వృద్ధి బాట పట్టించేందుకు మా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. పారదర్శకమైన విధానాలతో వాణిజ్యం, పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాం’ అని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. వ్యాపారాల నిర్వహణకు తాము అనుకూలమైన సంస్కరణలు చేపడుతున్న నేపథ్యంలో భారత్‌తో సంబంధాలు పటిష్టం చేసుకునేందుకు, ఇన్వెస్ట్ చేసేందుకు ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు.

 ఆస్ట్రేలియా మైనింగ్ దిగ్గజం హాంకాక్ ప్రాస్పెక్టింగ్ గ్రూప్ చైర్మన్ జినా రైన్‌హార్ట్, బీహెచ్‌పీ చీఫ్ ఆండ్రూ మెకెంజీ మొదలైన వారితో పాటు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా,ఎస్సార్ గ్రూప్ అధినేత శశి రుయా, గుజరాత్ ఎన్‌ఆర్‌ఈ కోక్ సీఎండీ ఏకే జగత్‌రామ్కా తదితరులు ఇందులో పాల్గొన్నారు.

 ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు..
 అత్యాధునిక పోర్టులు, స్మార్ట్ సిటీలు, తక్కువ వ్యయాలతో విమానాశ్రయాలు మొదలైన వాటితో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ చెప్పారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాల స్థాయిలో వ్యాపారాలకు ఏక గవాక్ష పద్ధతిలో అనుమతులు లభించేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇటీవలే మేక్ ఇన్ ఇండియా పిలుపునిచ్చినట్లు మోదీ తెలిపారు. ప్రజాస్వామ్య భారతదేశంలో ఇటు డిమాండు, అటు అత్యధికంగా యువ జనాభా ఉందని ఆయన చెప్పారు. సుపరిపాలనా విధానాలను అమలు చేయడం ద్వారా ఈ బలాలను మరింత సమర్థంగా వినియోగించుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు.

 సీఈవోలతో రౌండ్‌టేబుల్..: అంతకుముందు 30 మంది సీఈవోలతో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు వంటి కీలకాంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గత కొన్నేళ్లుగా భారత ఆర్థిక వృద్ధి మందగించిందని, దీన్ని మళ్లీ మెరుగుపర్చేందుకు అనుకూల పరిస్థితులను కల్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పారు.

ఇవి ప్రోత్సాహకరమైన ఫలితాలు ఇస్తున్నాయన్నారు. పర్యాటక రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి అపార అవకాశాలు ఉన్నాయని మోదీ చెప్పారు. ముఖ్యంగా టూరిజం ఇన్‌ఫ్రాలో వ్యాపారావకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. భారత్ ఇంధన అవసరాలకోసం ఎక్కువగా గ్యాస్‌పై దృష్టిపెట్టాలనుకుంటోందని దీంతో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్స్ ఏర్పాటు కోసం భారీ డిమాండు ఉండగలదని మోదీ తెలిపారు.

Advertisement
Advertisement