ఆర్థిక పరిస్థితిపై నేడు ప్రధాని సమీక్ష | Sakshi
Sakshi News home page

ఆర్థిక పరిస్థితిపై నేడు ప్రధాని సమీక్ష

Published Tue, Sep 19 2017 12:45 AM

ఆర్థిక పరిస్థితిపై నేడు ప్రధాని సమీక్ష - Sakshi

జైట్లీ, అధికారులతో సమావేశం
న్యూఢిల్లీ:
ఆర్థిక వృద్ధి తగ్గుముఖం పట్టడంతో ప్రధాని మోదీ మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, ఇతర ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించనున్నారు. వృద్ధిని పట్టాలెక్కించడానికి తీసుకోవాల్సిన ప్రోత్సాహక చర్యల గురించి జైట్లీతో పాటు, ఆర్థిక శాఖ సెక్రటరీలతో ఈ సందర్భంగా ప్రధాని చర్చించనున్నట్టు అధికార వర్గాల సమాచారం. అలాగే, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లు, పెట్టుబడుల ఉపసంహరణ, ద్రవ్యోల్బణం సహా పలు అంశాలు చర్చకు రానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి మూడేళ్ల కనిష్ట స్థాయి 5.7 శాతానికి తగ్గినట్టు ఇటీవలే అధికారిక గణాంకాలు వెలుగు చూసిన నేపథ్యంలో ప్రధాని భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. జీడీపీ తగ్గడం అన్నది వరుసగా ఆరో త్రైమాసికం. ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో జీడీపీ వృద్ధి 6.1% కాగా, 2016 ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్లో 7.9%గా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా వేసినట్టుగా 7.5 శాతం వృద్ధి రేటు సాధన కష్టమేనని ఆర్థిక సర్వే–2 అభిప్రాయపడింది. 

Advertisement
Advertisement