ముందు వడ్డీరేట్లను తగ్గించాలి: కార్పొరేట్ల డిమాండ్ | Sakshi
Sakshi News home page

ముందు వడ్డీరేట్లను తగ్గించాలి: కార్పొరేట్ల డిమాండ్

Published Wed, Sep 9 2015 1:07 AM

ముందు వడ్డీరేట్లను తగ్గించాలి: కార్పొరేట్ల డిమాండ్

దేశీయంగా పెట్టుబడులు పెంచాలంటే నిధుల సమీకరణ వ్యయం దిగిరావాలని... ఇందుకోసం వడ్డీరేట్లను భారీగా తగ్గించాల్సిందేనంటూ మోదీతో భేటీలో పారిశ్రామికవేత్తలు గళమెత్తారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ పి.మిస్త్రీ, ఆదిత్య బిర్లా గ్రూప్ హెడ్ కుమార మంగళం బిర్లా, భారతీ ఎయిర్‌టెల్ అధినేత సునీల్ మిట్టల్, ఐటీసీ చీఫ్ వైసీ దేవేశ్వర్ తదితర పారిశ్రామిక అగ్రగాములు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బ్యాంకర్ల నుంచి ఐసీఐసీఐ చీఫ్ చందా కొచర్, ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య హాజరయ్యారు. ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియాతో పాటు సుబీర్ గోకర్ణ్ వంటి ఆర్థికవేత్తలు కూడా పాల్గొన్నారు.

‘ప్రస్తుత ప్రపంచ ప్రతికూల పరిస్థితులను మనకు అనువుగా మలచుకోవాలంటే భారీగా పెట్టుబడులు పెట్టాలని ప్రధాని పారిశ్రామిక వేత్తలను కోరారు. పెట్టుబడి నిధులు చాలా భారంగా ఉన్న ఇటువంటి తరుణంలో రిస్క్ తీసుకొని ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తారో చెప్పలేం. తక్షణం వడ్డీరేట్లు తగ్గేలా చూడాలని మేమంతా ప్రధానికి విన్నవించాం’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ జ్యోత్స్న సూచి పేర్కొన్నారు. పారిశ్రామిక రంగం రిస్క్‌లకు సిద్ధపడాలని, పెట్టుబడుల పెంపు ద్వారా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి చేయూతనివ్వాల్సిందిగా ప్రధాని మోదీ సూచించినట్లు సీఐఐ ప్రెసిడెంట్ సుమిత్ మజుందార్ చెప్పారు. వచ్చే ఏడు నెలల్లో ఆర్‌బీఐ కీలక పాలసీ రేటు(రెపో)ను 0.75-1.25 శాతం మేర తగ్గించేందుకు తగిన సానుకూల పరిస్థితులున్నాయని ప్రధానికి వివరించినట్లు అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ చెప్పారు.

Advertisement
Advertisement