ఇంటి ధరను నిర్ణయించేవేంటి? | Sakshi
Sakshi News home page

ఇంటి ధరను నిర్ణయించేవేంటి?

Published Fri, Jun 16 2017 11:24 PM

ఇంటి ధరను నిర్ణయించేవేంటి?

సాక్షి, హైదరాబాద్‌: ఇంటి అంతిమ విలువ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నివసించడానికి సౌకర్యాలన్నీ ఉన్నాయా? ఒకవేళ భవిష్యత్తులో ఇల్లు అమ్మాలనుకుంటే మంచి ధర వస్తుందా? అని! చేరువలో షాపింగ్‌ మాళ్లు లేదా దుకాణాలు ఉన్నాయా? స్కూళ్లు, ఆసుపత్రులు, రవాణా సదుపాయాలు వంటివి ఉన్నాయా లేదా అనేవి చూడాల్సిందే. చుట్టుపక్కల వాళ్లు స్నేహపూర్వకంగా ఉంటేనే ప్రశాంతంగా నివసించొచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలకు స్కూళ్ల అవసరముండదు కాబట్టి.. వీరు ఇల్లు కొనే ముందు ఈ అంశం గురించి పట్టించుకోరు. కాకపోతే ఇంటిని అమ్మాలనుకుంటే మాత్రం ఇదే కీలకంగా మారుతుందన్న విషయం మరిచిపోవద్దు. ప్రజా రవాణా వ్యవస్థ, పోస్టల్‌ సదుపాయాలూ కీలకమే.

భవిష్యత్తు అవసరాలూ చూడాల్సిందే..
ఇంటి కొనుగోలులో సౌకర్యాలే కాదు భవిష్యత్తు అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కారు లేదా బైకు ఉన్నవారికి ప్రజా రవాణా వ్యవస్థ అవసరం ఉండకపోవచ్చు. ఈ–మెయిళ్లు, కొరియర్ల యుగంలో పోస్టాఫీసులు అనవసరమే కావచ్చు. కానీ, అదే ఇంటిని మీరు అమ్మేటప్పుడు మాత్రం పైవన్నీ కీలకమవుతాయని మరిచిపోవద్దు. చేరువలోనే షాపింగ్‌ చేసుకోవడానికి అవకాశముందనుకోండి.. వారాంతపు రోజుల్లో బయటికి షికారు వెళ్లడానికి ఆసక్తిని చూపకపోవచ్చు. కానీ, భవిష్యత్తులో ఇల్లు కొనేవారికి ఇవే కీలకమవుతాయి. ఇలాంటి అంశాల ఆధారంగా ఇంటి అంతిమ విలువను లెక్కగడతారని ప్రతి ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవాలి.

న్యాయపరమైన చిక్కులుంటే అంతే!
చేరువలోనే స్కూలు, ఆసుపత్రి, షాపింగ్‌ మాల్‌ వంటి ఎన్ని రకాల సదుపాయాలున్నా సరే న్యాయపరమైన చిక్కులున్నాయో అంతే సంగతులు. యాజమాన్య హక్కుల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని తేలాకే కొనుగోలుదారుడు ముందగుగు వేస్తాడని మరవొద్దు. విక్రయించే స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను కొనుగోలుదారులకు స్పష్టంగా ఓపిగ్గా వివరించాలి.

ప్రాంతం కూడా ముఖ్యమే..
ఇంటికి అధిక ధర రావాలంటే అది ఉన్న ప్రాంతమూ ముఖ్యమే. ఇంటి నిర్మాణం ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో ఆ ప్రాంతం కూడా అంతే వృద్ధి చెంది ఉంటుందనేది మర్చిపోవద్దు. అంటే ఇంట్లోని వసతులకే కాదు ఇంటికి దగ్గర్లో పాఠశాలలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాళ్లు ఉండాలన్నమాట. అలాగే ఆ ఇంటికొచ్చేందుకు లిఫ్ట్, పార్కింగ్‌ వంటి వసతులతో పాటుగా అడ్రస్‌ సులువుగా అర్థమయ్యేలా ల్యాండ్‌మార్క్, ఇంటి నుంచి మెయిన్‌ రోడ్డుకు వెళ్లేందుకు అనువైన రోడ్డు ఉండాలి.

Advertisement
Advertisement