ఆన్‌లైన్‌ ఆర్డర్లకు భారీ డిస్కౌంట్లు ఎలా సాధ్యం?

19 Nov, 2019 10:45 IST|Sakshi

ఆన్‌లైన్‌లో ఆర్డర్ల ఫుడ్‌ నాణ్యత లేమి 

తగ్గింపు ధరలతో నాణ్యతకు చెల్లుచీటి 

పలు హోటళ్ల యజమానుల జిమ్మిక్కులు  

మారుతున్న కాలానికి అనుగుణంగా మెచ్చిన హోటల్లో నచ్చిన ఫుడ్‌ ఐటెమ్స్‌ ఆన్‌లైన్లో ఆర్డర్లు తీసుకుని డోర్‌ డెలివరీ ఇస్తున్న సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఇటు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలతో పాటు హోటళ్ల యజమానులు కూడా భారీ డిస్కౌంట్ల ఆఫర్లు ఇస్తున్నాయి. అయితే డిస్కౌంట్లతో ఆన్‌లైన్‌ ఆర్డర్ల ఫుడ్‌ నాణ్యతకు హోటళ్ల యజమానులు తిలోదకాలు ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చిన ఆహారంలో నాణ్యత లోపం ఉందంటూ ఇటీవల కాలంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి.  

సాక్షి, నెల్లూరు:  ఉదయం నుంచి రాత్రి వరకు టిఫిన్స్‌ నుంచి భోజనాలు వరకు, బిర్యానీల నుంచి బర్గర్ల వరకు ఆన్‌లైన్లో ఆర్డర్లు ఇచ్చి తెప్పించుకుంటున్నారు. చేతిలో సెల్‌ఫోన్‌.. అందులో యాప్స్‌ ఉంటే చాలు ఇంట్లో కూర్చొని తమకు కావాల్సిన ఆహార పదార్థాలు డోర్‌ డెలివరీ ఇవ్వాలంటూ ఆన్‌లైన్‌లో ఫుడ్‌ డెలివరీ సంస్థలకు ఆర్డర్లు ఇస్తున్నారు. భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డోర్‌ డెలివరీ సంస్థలు, హోటళ్ల యజమానులు ఇస్తున్న డిస్కౌంట్ల వెనుక చాలా మతలబులు ఉన్నాయి. ఆన్‌లైన్‌ వినియోగదారుల విషయంలో జిల్లాలో ప్రధాన నగరం, పట్టణాల్లోని రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులు జిమిక్కులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.
ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చిన ఆహార నాణ్యత ఒకరకంగా, రెస్టారెంట్‌కు వచ్చే వినియోగదారులకు అందించే నాణ్యత మరో రకంగా ఉంటుంది. ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలోని పలు హోటళ్లలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన అధికారులు రెండు.. మూడు రోజుల పాటు నిల్వ ఉంచిన మాంసం, ఆహార పదార్థాలను గుర్తించి, తీవ్ర స్థాయిలో యజమానులకు హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్, డిస్కౌంట్‌ ఫుడ్‌ ఆర్డర్లకు ఇలాంటి నిల్వ ఆహారాలను అందిస్తున్నట్లు తెలుస్తోంది.   

తగు జాగ్రత్తలు పాటిస్తే మేలు  
రెస్టారెంట్లకు, హోటళ్లకు వెళ్లిన సమయంలో, ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థల్లో నచ్చిన ఆహారాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రముఖ రెస్టారెంట్లు, ఎప్పుడూ జనసందోహం ఉండే హోటళ్లను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

ఎందుకంటే ఆహారం నిల్వ ఉండేందుకు అక్కడ అవకాశం ఉండదు. ముఖ్యంగా నాన్‌ వెజ్‌ ఆహారం ఆర్డర్‌ చేస్తున్న సమయంలో ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. కొన్ని హోటళ్లలో డిమాండ్‌ తగ్గిన సమయంలో మాంసం, తరిగిన కూరగాయలు తదితరాలను నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా మిగిలిపోయిన వాటితో వండిన ఆహారం త్వరగా పాడయ్యే ఆస్కారం ఉంది. 

భారీ డిస్కౌంట్లు ఎలా సాధ్యం 
ఆన్‌లైన్‌లో ఇస్తున్న ఆర్డర్లకు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. నగరంలో ఓ హోటల్‌లో ఐటెమ్‌ విలువ రూ.250 ఉంటుంది. అదే హోటల్‌ నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చిన ఐటెమ్‌ను రూ.150లకే డెలివరీ ఇస్తున్నారు. ఇదెలా సాధ్యమని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు.. పాలక్‌ పనీర్‌ అసలు ధర రూ.200. ఆన్‌లైన్‌లో రూ.135కే అందిస్తున్నారు. చికెన్‌ బిర్యానీ రూ.250.

ప్రత్యేక ఆఫర్‌ కింద రూ.159కే అందిస్తున్నారు. ఈ ఆఫర్‌ రెండు రోజుల మాత్రమే. నాటు కోడి బిర్యానీ అసలు ధర రూ.300 ఈ రోజు ప్రత్యేక ఆఫర్‌గా రూ.180లకే అందిస్తున్నాం అంటూ 15 శాతం, 20 శాతం, 30 శాతం, 50 శాతం డిస్కౌంట్లతో రకరకాల ఆఫర్లతో ఫుడ్‌ డెలివరీ సంస్థలు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి ఆకర్షితులై ధర తక్కువని ఆర్డర్‌ చేస్తే అందులో నాణ్యత ఉండడం లేదని ఇటీవల కాలంలో పలువురు వినియోగదారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలతో పాటు రెస్టారెంట్లలో సంబంధిత శాఖాధికారులు దాడులు చేసి చర్యలు తీసుకుంటున్నారు.  

ఆన్‌లైన్‌ ఆర్డర్లకు ప్రత్యేక ఆహారమా?  
రెస్టారెంట్‌లో వండిన ఆహారానికి, ఆన్‌లైన్‌ ద్వారా పొందిన ఆహారానికి చాలా తేడా ఉంటుందని ఫిర్యాదుల ద్వారా అధికారులకు వచ్చిన సమాచారం. ఆన్‌లైన్‌ ఆర్డర్‌కు వేరే ఆహారం ఇవ్వాలంటూ హోటళ్ల యజమానులు సిబ్బందిని ఆదేశిస్తున్నట్లు సమాచారం. ఎక్కడో వండిన వంటకాలను రెస్టారెంట్‌కు తీసుకొచ్చి ఆన్‌లైన్‌ వినియోగదారులకు అందజేస్తున్నట్లు కూడా అధికారుల దృష్టికి వచ్చింది. ఇలా వండి పెట్టేందుకు చిన్న హోటళ్ల యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. నాణ్యత పాటించకుండా వండిన ఆహారం వినియోగదారులకు చేరే సరికి పూర్తిగా పాడయిపోతున్న సందర్భాలున్నాయి.

తాజా నాణ్యమైన ఆహారాన్నే అందించాలి 
తాజాగా, నాణ్యమైన ఆహారాన్నే వినియోగదారులకు అందించాలి. రంగులు కలపడం, ఒక్కసారి వాడడానికి సిద్ధం చేసిన వాటిని తిరిగి వాడకూడదు. ఎప్పటికప్పుడు కాకుండా రిఫ్రిజిరేటర్‌లో పెట్టి వాడితే చర్యలు తప్పవు. చికెన్, మటన్, కూరగాయలు తాజాగా ఉన్నవే వండి వడ్డించాలి. రంగులు కల్పడం ద్వారా కేన్సర్‌ కారకాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లు, తోపుడు బండ్ల యజమానులు ఎవరైనా సరే నాణ్యతకు తిలోదకాలు ఇస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు. ఆహారానికి సంబంధించి ఏవైనా అనుమానం కలిగినా, నాణ్యత ప్రమాణాలు లేకపోయినా 9989990859కు సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. 
– డాక్టర్‌ వెంకటరమణ, ఆరోగ్య అధికారి, నగరపాలక సంస్థ, నెల్లూరు  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు