ద్రవ్యోల్బణం తగ్గుదల క్రెడిట్ ఆర్బీఐదే | Sakshi
Sakshi News home page

ద్రవ్యోల్బణం తగ్గుదల క్రెడిట్ ఆర్బీఐదే

Published Wed, Jul 27 2016 1:06 AM

ద్రవ్యోల్బణం తగ్గుదల క్రెడిట్ ఆర్బీఐదే

క్షీణించిన చమురు ధరలు కారణం కాదు
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింది చాలా తక్కువ
విమర్శకులకు ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ చురక

ముంబై : తన విమర్శకులపై ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి విరుచుకుపడ్డారు. అధిక వడ్డీ రేట్లతో ఆర్‌బీఐ వృద్ధి రేటును దెబ్బతీస్తోందన్న విమర్శలు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ కోణంలో భాగమేనన్నారు. అయితే, ఈ ఉద్దేశ పూర్వక విమర్శలకు దూరంగా ప్రభుత్వం ఆర్‌బీఐ స్వతంత్రను తప్పకుండా కాపాడాలని సూచించారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్ సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. సోమవారం ఇక్కడ ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయంలో పదవ గణాంక దినోత్సవం సందర్బంగా జరిగిన కార్యక్రమంలో రాజన్ సూటిగా మాట్లాడారు. అదృష్టవశాత్తూ చమురు ధరలు దిగిరావడంతోనే ద్రవ్యోల్బణం తగ్గిందని, ఆర్‌బీఐ చర్యల వల్ల కాదన్న చర్చతో ఆయన విభేదించారు.

అంతర్జాతీయంగా గణనీయ స్థాయిలో ధరలు తగ్గగా... ఆ స్థాయిలో దేశీయంగా ధరల తగ్గుదల లేదని, ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అధిక వడ్డీ రేట్లు సహా బ్యాంకుల మొండి బకాయిల ప్రక్షాళన విషయంలో రాజన్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం తెలిసిందే. అధిక ద్రవ్యోల్బణం బలహీన వర్గాలకు హాని చేస్తుందన్నారు. కానీ ధరల పెరుగుదలపై ఆ వర్గాలు అంతగా ఆందోళన చెందకపోవడంపై రాజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ద్రవ్యోల్బణం పెరగకూడదంటే... స్థూల ఆర్థిక స్థిరత్వంతో సంస్థలు పనిచేసేలా వాటిని నిర్మించాలి. బహుశా ఈ వివేకంతోనే ప్రభుత్వాలు ఆర్‌బీఐకి కొంత స్వేచ్ఛను ఇచ్చినట్టున్నాయి’ అని రాజన్ వ్యాఖ్యానించారు.

 రెండు విరుద్ధ వాదనలు...
‘విమర్శకులు ద్రవ్యోల్బణంపై రెండు విరుద్ధ వాదనలు వినిపిస్తుంటారు. ఆర్‌బీఐ అధిక వడ్డీ రేట్లతో గిరాకీని, వృద్ధిని దెబ్బతీస్తోందని అంటారు. అదే సమయంలో ద్రవ్యోల్బణం నియంత్రణ విషయంలో మన విధానం పెద్దగా ప్రభావం చూపలేదంటారు. చమురు ధరలు తగ్గడం వల్లే డిఫ్లేషన్ (ద్రవ్యోల్బణం తగ్గడం) అని చెబుతారు. ఈ రెండూ అసంబద్ధం.  చమురు ధరలు క్షీణించకముందుగానే ద్రవ్యోల్బణం తగ్గుదల 2013 చివరిలో మొదలైంది. ఆ తర్వాత ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా, దేశీయంగా ఇంధన ధరలు అంతగా తగ్గలేదు.  2014 ఆగస్ట్, 2016 జనవరి కాలంలో దేశీయ క్రూడ్ బాస్కెట్ ధరలు 72 శాతం పతనం అయ్యాయి.

కానీ పెట్రోల్ ధర 17 శాతమే తగ్గింది. కనుక చమురు ధరలు తగ్గడం వల్లే ద్రవ్యోల్బణం తగ్గిందన్న వాదన సరికాదు’ అని వివరించారు. బ్రిటన్, అమెరికా తదితర దేశాల్లో పరిణామాలను ఆయన ప్రస్తావిస్తూ దేశం వెలుపల జరిగిన పరిణామాల ప్రభావాలకు సంబంధించి సెంట్రల్ బ్యాంకును నిందించడం తగదన్నారు. అయితే, ఈ ప్రేరేపిత విమర్శలకు గురికాకుండా ప్రభుత్వాలు తమ సెంట్రల్ బ్యాంకుల స్వతంత్రతను కాపాడాలని, స్థిరమైన, సుస్థిర వృద్ధికి ఇది తప్పనిసరి అని రాజన్ చెప్పారు. సెంట్రల్ బ్యాంకుల పాలసీలను ఆధార రహితంగా విమర్శించడం అలవాటుగా మారిందని తప్పుబట్టారు. బ్యాంకు ఆఫ్ ఇంగ్లండ్, యూఎస్ ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులలో ఎన్ని ఈ విధంగా విమర్శలు ఎదుర్కొంటున్నాయని ఆయన ప్రశ్నించారు.

 ద్రవ్యోల్బణం కట్టడి చేయకుంటే సంక్షోభం
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయకుంటే సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని రాజన్ హెచ్చరించారు. అధిక స్థాయిలో ద్రవ్యోల్బణంతో కరెన్సీ ఆటుపోట్లకు లోనవుతుంది. పొదుపు నిల్వలు ఆవిరవుతాయి. బంగారంపైకి పెట్టుబడులు మళ్లుతాయి. మనం పుత్తడిని ఉత్పత్తి చేయని విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫలితంగా కరెంటు ఖాతాపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో సంక్షోభం తలెత్తుతుంది’ అని రాజన్ వివరించారు.

ఎన్‌పీఏల ప్రక్షాళన ముందే చేపట్టాల్సింది
బ్యాంకుల నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) ప్రక్షాళనను మరింత ముందుగానే చేపట్టి ఉండాల్సిందని రాజన్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం మాదిరిగానే బ్యాంకు ఖాతాల ప్రక్షాళనకు ముందుగానే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆర్‌బీఐపై ఉందన్నారు. అధిక రుణాలు తీసుకుని చెల్లించడంలో విఫలమైన 120 ఖాతాల జాబితాను 2015 డిసెంబర్‌లో ఆర్‌బీఐ వెల్లడించడం ద్వారా ప్రక్షాళన ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘బ్యాంకులు తొలుత ఎన్‌పీఏల ప్రక్షాళన పట్ల విముఖత చూపాయి. కానీ, ఆ తర్వాత అదే స్ఫూర్తితో ముందడుగు వేశాయి. కొన్ని అయితే, కోరిన దాని కంటే ఎక్కువే దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. రుణ నష్టాలకు సమస్యను విస్మరించడం తేలికే. కానీ ఈ ధోరణి వల్ల సమస్య పెద్దది అయిపోయి నిర్వహణ కష్టమవుతుంది. ఫలితంగా బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంలోకి వెళుతుంది’ అని రాజన్ వివరించారు. 2017 మార్చి నాటికి ఎన్‌పీఏల సమస్యకు ముగింపు పలకాలని ఆర్‌బీఐ లక్ష్యాన్ని నిర్ణయించిన విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement