అసంబద్ధ వడ్డీ రేట్ల పెంపుదలతో ఎకానమీకి దెబ్బ | Sakshi
Sakshi News home page

అసంబద్ధ వడ్డీ రేట్ల పెంపుదలతో ఎకానమీకి దెబ్బ

Published Fri, Sep 12 2014 12:40 AM

Raghuram Rajan Warns of Abrupt Reversal of Global Low Interest Rates

ముంబై: అంతర్జాతీయంగా తక్కువ స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లను అకస్మాత్తుగా, అసంబద్ధంగా పెంచేస్తే.. పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. ఇలాంటి వాటివల్ల పెట్టుబడి నిర్ణయాలు దెబ్బ తింటాయని, ఎకానమీల స్వరూపంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

కాబట్టి, ఈ మార్పులను జాగ్రత్తగా, అంచనాలకు అనుగుణంగా ఉండేలా మాత్రమే చేపట్టాలని రాజన్ సూచించారు. 2008 నాటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం గురించి ముందస్తుగానే చెప్పిన రాజన్.. తాజాగా ఈ తరహా హెచ్చరిక చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఇప్పటికే అంతా పెను సంక్షోభంలో ఉన్నాం. వడ్డీ రేట్లను అర్ధాంతరంగా మార్చేస్తే చాలా పెద్ద స్థాయిలో హాని జరుగుతుంది. కనుక ఇందులో నుంచి ఒక్కసారిగా గాకుండా క్రమక్రమంగా, జాగ్రత్తగా బైటికి రావాలన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధికారుల వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను’ అని రాజన్ చెప్పారు.

చౌక  వడ్డీల మీద భారీ స్థాయిలో మూలధన సమీకరణ జరిగిందని, ఇప్పుడు అక స్మాత్తుగా రేట్లను మార్చేస్తే పెట్టుబడి నిర్ణయాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీర్ఘకాలం పాటు తక్కువ వడ్డీ రేట్లను కొనసాగించడం వల్ల సమస్యలు రావొచ్చా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ద్రవ్య పరపతి విధానం కొంత వరకూ మాత్రమే పనిచేస్తుందన్నది తన అభిప్రాయమన్నారు. నిర్దిష్ట స్థాయి దాటితే అది మంచి కన్నా ఎక్కువగా చెడే చేసే ప్రమాదం ఉందని రాజన్ వ్యాఖ్యానించారు.
 
 నిరంతరాయం సమస్యల నుంచి గట్టెక్కిస్తామంటూ సంవత్సరాల తరబడి మార్కెట్లను.. సెంట్రల్ బ్యాంకులు భరోసా ఇస్తూ వచ్చాయని ఆయన చెప్పారు. వడ్డీ రేట్లను దీర్ఘకాలం పాటు తక్కువ స్థాయిలో ఉంచి, అసెట్ ధరలు భారీగా పెరిగిపోయేలా చేశాయని, దీంతో ఏ కాస్త ప్రతికూల వార్త వచ్చినా మార్కెట్లు కంపించి పోయే పరిస్థితి ఏర్పడిందని రాజన్ అభిప్రాయపడ్డారు.

 మరోవైపు, వర్ధమాన దేశాలు దీర్ఘకాలికంగా తమను తాము రక్షించుకునేందుకు తీసుకుంటున్న చర్యలు అమెరికాపై ప్రభావం చూపుతున్నాయన్నది ఆ దేశం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో విధానాల విషయంలో సంప్రదింపులు జరపడం, సఖ్యతగా వ్యవహరించడం ద్వారా అమెరికా తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు వీలుంటుందని రాజన్ చెప్పారు. అమెరికా తాను సృష్టించిన అస్థిరత పరిష్కారం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే.. మిగతా వారు స్పందించాల్సి ఉంటుందని, దీంతో అందరిపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.

Advertisement
Advertisement