కోత లేదు... నష్టాలు తప్పలేదు

6 Dec, 2019 02:38 IST|Sakshi

ఆర్‌బీఐ పాలసీ... అంచనాలు వమ్ము 

రేట్ల విషయమై యథాతథ స్థితి 

71 పాయింట్లు పతనమై 40,780కు సెన్సెక్స్‌ 

25 పాయింట్ల నష్టంతో 12,018కు నిఫ్టీ  

కీలక రేట్లను యథాతథంగా కొనసాగించాలన్న ఆర్‌బీఐ నిర్ణయం గురువారం స్టాక్‌ మార్కెట్‌ను నష్టాల పాలు చేసింది. అంతే కాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 5 శాతానికి తగ్గించడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 71 పాయింట్లు పతనమై 40,780 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 12,018 పాయింట్ల వద్ద ముగిశాయి.  

ఫిబ్రవరిలో తగ్గింపు !
ఆర్‌బీఐ ఎమ్‌పీసీ(మోనేటరీ పాలసీ కమిటీ) రిటైల్‌ ద్రవ్యోల్బణ అంచనాలను పెంచింది. వృద్ధి అంచనాలను తగ్గించింది. వీలును బట్టి రేట్ల నిర్ణయాన్ని తీసుకునే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించడం ఒకింత ఊరటనిచి్చంది. దీంతో ఫిబ్రవరి పాలసీలో రేట్లను ఆర్‌బీఐ పావు శాతం మేర తగ్గంచగలదని నిపుణులు భావిస్తున్నారు.

‘వడ్డీ’ షేర్లు ఢమాల్‌....
బ్యాంక్, వాహన, రియల్టీ షేర్లు నష్టపోయాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్, ఎస్‌బీఐ, యెస్‌ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, ఫెడరల్‌ బ్యాంక్, హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 0.3 శాతం నుంచి 2.2 శాతం రేంజ్‌లో పడిపోయాయి. ఇక టీవీఎస్‌ మోటార్స్,  మారుతీ సుజుకీ, అశోక్‌ లేలాండ్, హీరో మోటొకార్ప్, టాటా మోటార్స్‌ షేర్లు 0.08 శాతం నుంచి 2 శాతం మేర నష్టపోయాయి. నిఫ్టీ భారత్‌ బాండ్‌ ఇండెక్స్‌ ఆరంభం:  నిఫ్టీ భారత్‌ బాండ్‌ ఇండెక్స్‌ సిరీస్‌ను ఎన్‌ఎస్‌ఈ గురువారం ప్రారంభించింది.  ఏప్రిల్‌ 2023, ఏప్రిల్‌ 2030 బాండ్ల సూచీలను ఎన్‌ఎస్‌ఈ అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన ట్రిపుల్‌ ఏ రేటింగ్‌ ఉన్న బాండ్ల పోర్ట్‌ఫోలియోను ఈ బాండ్‌ సూచీలు ట్రాక్‌ చేస్తాయి. ఈ సూచీలకు ఆధార తేదీ 2019, నవంబర్‌ 29 అని, ఆధార విలువ 1,000 పాయింట్లని ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా