రేట్ల కోతకు ‘సానుకూల’ అంకెలు

13 Jul, 2017 01:25 IST|Sakshi
రేట్ల కోతకు ‘సానుకూల’ అంకెలు

పారిశ్రామిక ఉత్పత్తి మందగమనం..
మేలో కేవలం 1.7 శాతం వృద్ధి
చరిత్రాత్మక కనిష్టంలో రిటైల్‌ ధరల స్పీడ్‌
జూన్‌లో 1.54 శాతం
ఆగస్టు ఆర్‌బీఐ పాలసీపై దృష్టి  


ముంబై: రెపో, రివర్స్‌ రెపో వంటి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పాలసీ రేట్లను మరింత తగ్గించాలన్న డిమాండ్‌కు బలం చేకూరే స్థూల ఆర్థిక గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సూచీ మే నెలలో కేవలం 1.7 శాతం (2016 ఇదే నెలతో ఉత్పత్తితో పోల్చితే) నమోదయ్యింది. ఇక జూన్‌లో వినియోగ ధరల (సీపీఐ) సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం చరిత్రాత్మక కనిష్ట స్థాయి 1.54 శాతంగా నమోదయ్యింది. ద్రవ్యోల్బణం కట్టడిలో ఉన్న నేపథ్యంలో అటు ప్రభుత్వం నుంచీ ఇటు పారిశ్రామిక వర్గాల నుంచీ రేటు తగ్గింపునకు ఆర్‌బీఐకి విజ్ఞప్తులు అందుతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల ఒకటి, రెండు తేదీల్లో ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానం నేపథ్యంలో బుధవారం ఆయా శాఖలు విడుదల చేసిన గణాంకాల వివరాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ఐఐపీ... 8 నుంచి 1.7 శాతానికి డౌన్‌

2016 మే నెలలో (2015 మే నెలతో పోల్చితే) పారిశ్రామిక ఉత్పత్తి 8%గా నమోదయ్యింది. అయితే తాజా దిగువ ధోరణికి కారణం– కీలకమైన తయారీ, మైనింగ్‌ వంటి విభాగాల పేలవ పనితీరే.
మొత్తం సూచీలో దాదాపు 70% వాటా కలిగిన తయారీ రంగంలో వృద్ధి రేటు 8.6 శాతం నుంచి 1.2 శాతానికి పడిపోయింది.
భారీ వస్తు ఉత్పత్తికి, డిమాండ్, పెట్టుబడులకు సూచిక అయిన క్యాపిటల్‌ గూడ్స్‌లో అసలు వృద్ధిలేకపోగా – 3.9% క్షీణత నమోదయ్యింది. 2016 మే నెలలో ఈ విభాగంలో వృద్ధి భారీగా 13.9%.
కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగంలోనూ క్షీణత నమోదయ్యింది.
మైనింగ్‌ రంగం 5.7% క్షీణత నుంచి 0.9% క్షీణతకు జారింది.
విద్యుత్‌ రంగంలో ఉత్పాదకత వృద్ధి మాత్రం 6.1 శాతం నుంచి 8.7 శాతానికి ఎగసింది.

ఏప్రిల్‌–మే నెలల్లోనూ దిగువకే...
 2016 ఏప్రిల్‌–మే నెలల్లో ఐఐపీ 7.3 శాతం నుంచి 2.3 శాతానికి పడిపోయింది. ఈ కాలంలో తయారీ రంగం వృద్ధి రేటు 7.1 శాతం నుంచి 1.8 శాతానికి, మైనింగ్‌ రంగానికి సంబంధించి ఈ శాతం 6.2 శాతం నుంచి 1.1 శాతానికి, విద్యుత్‌ రంగంలో ఉత్పత్తి వృద్ధి రేటు 10.1 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గింది.

తగ్గిన రిటైల్‌ ‘ధర’ వేగం
2016 జూన్‌ నెలతో పోల్చితే 2017 జూన్‌లో రిటైల్‌ ధరల పెరుగుదల వేగం గణనీయంగా తగ్గిపోయింది. చరిత్రాత్మక కనిష్ట స్థాయిలో 1.54 శాతంగా నమోదయ్యింది.
ఆహార ఉత్పత్తులు:  కూరగాయల ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా ధరలు 17% తగ్గాయి. పప్పులు, సంబంధిత ప్రొడక్టుల ధరలు కూడా 22% తగ్గాయి. గుడ్లు (–0.08%), సుగంధ ద్రవ్యాలది(–0.73%) కూడా ఇదే పరిస్థితి. తృణధాన్యాలు (4.39%), మాంసం, చేపలు (3.49%), పాలు, పాలపదార్థాలు (4.15%), చమురు, వెన్న (2.34 శాతం), పండ్లు (1.98%) ధరలు స్వల్పంగా పెరగ్గా,  చక్కెర సంబంధిత ఉత్పత్తుల ధర 8.74% ఎగశాయి.
పాన్, పొగాకు: ఈ విభాగంలో ధరలు 5.62 శాతం పెరిగింది.
దుస్తులు, పాదరక్షలు: ధరల పెరుగుదల 4.17 శాతం.
హౌసింగ్‌: ధరల పెరుగుదల రేటు 4.7 శాతం.
ఫ్యూయెల్, లైట్‌: 4.54 శాతం ఎగసింది.

స్థిరత్వానికి సంకేతం
రిటైల్‌ ద్రవ్యోల్బణం స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వానికి సంకేతం. ఈ తరహా గణాంకాలు మనం 1999లో అంతకుముందు 1978 ఆగస్టుల్లోనే చూశాం. – అరవింద్‌ సుబ్రమణ్యం, ప్రధాన ఆర్థిక సలహాదారు

మరిన్ని వార్తలు