రాజన్.. మూడో‘సారీ’! | Sakshi
Sakshi News home page

రాజన్.. మూడో‘సారీ’!

Published Wed, Aug 6 2014 12:59 AM

రాజన్.. మూడో‘సారీ’!

ముంబై: వర్షాలు ముఖం చాటేయడం... వడ్డీరేట్ల తగ్గింపు ఆశలను గల్లంతుచేసింది. ఆహారోత్పత్తుల ధరలకు రెక్కలొస్తాయనే భయాలు వెంటాడుతుండటంతో కీలక పాలసీ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నిర్ణయించారు. మంగళవారం జరిగిన పరపతి విధాన సమీక్షలో రెపో, రివర్స్ రెపో, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్)లో మార్పులేవీ చేయలేదు.

అయితే, చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్)ని అర శాతం తగ్గించడం ద్వారా వ్యవస్థలోకి రూ.40 వే ల కోట్ల నిధులు విడుదలయ్యేలా చేశారు. మరోపక్క, రుణాలపై వడ్డీరేట్లను తగ్గించే అవకాశాల్లేవని బ్యాంకర్లు తేల్చిచెప్పారు. దీంతో గృహ, వాహన రుణాలపై నెలవారీ వాయిదా(ఈఎంఐ)లు ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగనున్నాయి. ఆర్‌బీఐ నిర్ణయం అటు రిటైల్ రుణ గ్రహీతలతో పాటు కార్పొరేట్ వర్గాలను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. పాలసీ రేట్లలో మార్పులు చేయకపోవడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.

 పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ మరోసారి ద్రవ్యోల్బణం కట్టడికే ప్రాధాన్యమివ్వడంతో కీలక పాలసీ వడ్డీరేట్లయిన రెపో(8%), రివర్స్ రెపో(7%), సీఆర్‌ఆర్(4%)లు ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగనున్నాయి. అయితే, ఎస్‌ఎల్‌ఆర్‌ను అర శాతం తగ్గించడం ద్వారా ప్రస్తుతం ఉన్న 22.5% నుంచి 22 శాతానికి చేర్చింది.  ఈ నెల 9 నుంచి ఈ తగ్గింపు అమల్లోకి రానుందని ఆర్‌బీఐ వెల్లడించింది.

ఎస్‌ఎల్‌ఆర్ తగ్గింపుతో బ్యాంకులు మరిన్ని రుణాలను ఇచ్చేందుకు వీలవుతుంది. గత పాలసీ(జూన్)లో కూడా ఎస్‌ఎల్‌ఆర్‌ను అర శాతం తగ్గించడం తెలిసిందే. మరోపక్క, బ్యాంక్ రేటును కూడా ఇప్పుడున్న 9 శాతం వద్దే ఉంచుతున్నట్లు తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రాజన్.. మూడుసార్లు పావు శాతం చొప్పున రెపో రేటును పెంచిన విషయం విదితమే. ద్రవ్యోల్బణం తగ్గింపే తన లక్ష్యమని కూడా ఆయన పదేపదే స్పష్టం చేస్తూవస్తున్నారు.

 5.5 శాతం వృద్ధికి అవకాశం...
 ప్రభుత్వం ఈ ఏడాదికి(2014-15) అంచనా వేస్తున్నట్లుగా 5.5 శాతం స్ధూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటును సాధించడానికి పరిస్థితులు కొద్దిగా మెరుగుపడుతున్నాయని రాజన్ పేర్కొన్నారు. సెంటిమెంట్, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం ఇందుకు దోహ దం చేయనుందని పేర్కొన్నారు.

 గత రెండేళ్లలో వృద్ధి రేటు 5 శాతం దిగువనే నమోదైన సంగతి తెలిసిందే. ‘రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 43 నెలల కనిష్టమైన 7.31 శాతానికి దిగొచ్చింది. ఇక మే నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 4.7%కి పుంజుకుంది. ఇది 9 నెలల గరిష్టస్థాయి. ఈ అంశాల నేపథ్యంలోనే మరోసారి వడ్డీరేట్లు యథాతథంగా ఉంటాయని అందరూ అంచనా వేశారు’ అని రాజన్ చెప్పారు. కాగా, తదుపరి పాలసీ సమీక్ష సెప్టెంబర్ 30న ఉంటుందని వెల్లడించారు.

 రేట్ల తగ్గింపు అనివార్యం: కార్పొరేట్లు
 వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించడంపై పారిశ్రామిక వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అధిక వడ్డీరేట్లు పరిశ్రమల విస్తరణలపై నీళ్లుజల్లుతున్నాయని పేర్కొన్నాయి. ‘పారిశ్రామికోత్పత్తి ఇంకా మందకొడిగానే ఉంది. మరోపక్క, రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. రుతుపవనాల్లో కాస్త పురోగతి నేపథ్యంలో ద్రవ్యోల్బణం రిస్కులు కూడా క్రమంగా తగ్గనున్నాయి. వీటిని ఆర్‌బీఐ వడ్డీరేట్ల కోతకు అనువుగా మలుచుకోవాల్సింది’ అని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. అయితే, ఎస్‌ఎల్‌ఆర్‌ను మరో అర శాతం తగ్గించడాన్ని సీఐఐతో పాటు ఫిక్కీ, పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ స్వాగతించాయి.

 ఆర్‌బీఐ అస్త్రాలు...
 నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్): బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో కచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉంచాల్సిన మొత్తమే సీఆర్‌ఆర్.

 రెపో రేటు: బ్యాంకులు తన వద్దనుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీనే రెపో రేటుగా వ్యవహరిస్తారు.

 రివర్స్ రెపో: బ్యాంకులు తన వద్ద ఉంచే నిధులపై ఆర్‌బీఐ చెల్లించే వడ్డీయే రివర్స్ రెపో రేటు.


 ఎస్‌ఎల్‌ఆర్: బ్యాంకులు తమ వద్దనున్న మొత్తం డిపాజిట్లలో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా ప్రభుత్వ సెక్యూరిటీ(బాండ్‌లు)ల్లో పెట్టుబడిగా పెట్టాల్సి ఉం టుంది. ఇదే చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్).

Advertisement
Advertisement