ఏకాభిప్రాయమే.. కానీ ఉత్కంఠ! | Sakshi
Sakshi News home page

ఏకాభిప్రాయమే.. కానీ ఉత్కంఠ!

Published Mon, Jun 6 2016 12:56 AM

ఏకాభిప్రాయమే.. కానీ ఉత్కంఠ!

రెపో రేటు యథాతథమేనని  అంచనాలు
రేపు ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష

 న్యూఢిల్లీ: ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతల దృష్టి మంగళవారం నాటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్వైమాసిక, ద్రవ్య పరపతి విధానం వైపునకు మళ్లింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- రెపోను మరింత తగ్గించే అవకాశాలు ఈ  సమీక్ష సందర్భంగా లేవన్నది ఏకాభిప్రాయంగా ఉన్నా... అనూహ్య నిర్ణయమేమైనా ఉంటుందా? అన్న సందేహాలూ కొందరు ఆర్థికవేత్తల్లో ఉన్నాయి.  సెప్టెంబర్ 2013లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రమంగా  రుణ బెంచ్‌మార్క్ రేటు- రెపో రేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. 2014 మొత్తం భారత్ అధిక వడ్డీరేటు వ్యవస్థలో కొనసాగింది. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని ఆయన కారణంగా చూపారు. అటుతర్వాత ఆర్థికశాఖ, పరిశ్రమల నుంచి వచ్చిన ఒత్తిడులు, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో క్రమంగా రెపో రేటును 1.50 శాతం తగ్గించారు. దీనితో ఈ రేటు ప్రస్తుతం 6.5 శాతానికి దిగివచ్చింది.

 రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు శాతం ఎగువనే (ఏప్రిల్‌లో 5.39 శాతం) ఉండడం, ఇప్పటికే తగ్గించిన రెపో ప్రయోజనాన్ని బ్యాంకులు ఇంకా పూర్తిగా కస్టమర్లకు బదలాయించని పరిస్థితులు, వర్షపాతంపై ఇంకా స్పష్టత రాకపోవడం వంటి అంశాలు రేటు యథాతథంగా కొనసాగిస్తారన్న అంచనాలకు వేదికగా ఉన్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడ్ ఫండ్ రేటుపై ఈ నెల 15-16 తేదీల్లో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యం సైతం ఆర్‌బీఐ వేచిచూసే నిర్ణయానికి కారణమవుతుందని సంబంధిత వర్గాల వాదన.  అయితే మే నెలకు సంబంధించి తయారీ, సేవల రంగాల ప్రతికూలతల వార్తలు,  రుణ వృద్ధి రేటు తక్కువగా ఉండడం వంటి అంశాలను కొద్దిమంది ‘రేటు కోత ఆశావహులు’ కారణంగా చూపుతున్నారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్‌బీఐ తొలి ద్వైమాసిక ద్రవ్య సమీక్ష ఇది. కొందరి అంచనాలు చూస్తే...

స్టాన్‌చార్ ఇండియా సీఈఓ జరీన్ దారూవాలా అభిప్రాయాల ప్రకారం- ఏప్రిల్‌లో ఆహార ధరలు అధికంగా ఉన్నాయి. క్రూడ్ ధరలు  మరోవైపు బ్యారల్‌కు 50 డాలర్లను తాకాయి. వర్షపాతం విషయం ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో  రెపో రేటును ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ తగ్గిస్తారని తాను భావించడంలేదని దారూవాలా అన్నారు.

ఇక డాయిష్ బ్యాంక్ ఒక నివేదికను విడుదల చేస్తూ.. వారం రోజుల్లో అమెరికా ఫెడ్ రేటుపై కీలక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో- ఇప్పుడు ఆర్‌బీఐ రేటు కోత నిర్ణయం అసాధ్యమని విశ్లేషించింది.

మంగళవారం రెపో రేటును తగ్గించకపోవచ్చన్నది ఇండియా రేటింగ్స్, హెచ్‌ఎస్‌బీసీలు తమ నివేదికల్లో  పేర్కొన్నాయి. ఇప్పటికే జరిగిన రేటు కోత ప్రయోజనం కస్టమర్‌కు బ్యాంకింగ్ అందించకపోవడం, అలాగే ద్రవ్యోల్బణం గరిష్టస్థాయిలోనే కొనసాగడం, అమెరికా ఫెడ్ రేటు కోత, యూరోజోన్‌లో (కొనసాగడంపై) బ్రిటన్ భవితవ్యం వంటి  అంశాలు సమీక్షలో ప్రధానాంశాలు అవుతాయన్న అభిప్రాయాన్ని ఇండియా రేటింగ్స్ వ్యక్తం చేసింది.  కాగా  రేటు కోత అవకాశాలను తోసిపుచ్చిన హెచ్‌ఎస్‌బీసీ,ఆగస్టులో పావుశాతం కోత ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

{పస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్‌బీఐ మరో అరశాతం రెపోరేటు కోత నిర్ణయం తీసుకుంటుందని అంచనావేస్తున్న రేటింగ్ దిగ్గజ సంస్థ- మోర్గాన్‌స్టాన్లీ,  జూన్ 7 ద్రవ్య, పరపతి సమీక్ష సందర్భంగా మాత్రం రేటు కోతకు అవకాశం ఉండదని తను అభిప్రాయపడుతోంది.

 యస్‌బ్యాంక్ భిన్న వైఖరి
కాగా  యస్‌బ్యాంక్ వైఖరి భిన్నంగా ఉంది. యస్ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ రాణా కపూర్ మాట్లాడుతూ, జూన్ 7న పావుశాతం రేటు కోత ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తక్కువ స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణం, వర్షపాతంపై తగిన సానుకూల అంచనాలు వంటివి ఇందుకు రాణా కారణంగా చూపారు. రుణాలకు సంబంధించి ముఖ్యమైన సీజన్ నేపథ్యంలో ఆగస్టులో కూడా పావుశాతం కోత ఉండవచ్చనీ ఆయన పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement