ఐటీ రిటర్నులు వేస్తున్నారా? | Sakshi
Sakshi News home page

ఐటీ రిటర్నులు వేస్తున్నారా?

Published Mon, Jul 17 2017 12:05 AM

ఐటీ రిటర్నులు వేస్తున్నారా? - Sakshi

గడిచిన ఏడాది కాలంలో ఆదాయపన్ను పరంగా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు ఫైల్‌ చేసేందుకు జులై నెలాఖరు వరకు గడువుంది. ఈనేపథ్యంలో ఆ మార్పులేంటన్నది తెలియకపోయినా కూడా కొన్ని తప్పులు జరిగే అవకాశముంది.


ఆదాయపు పన్ను చెల్లించినా... లేక మినహాయింపులకు లోబడి పన్ను తప్పించుకున్నా... ఎవరైనా సరే!! ఆదాయపన్ను పరిధిలోకి వచ్చే వారంతా ఏటా రిటర్నులు వెయ్యటం చట్ట ప్రకారం తప్పనిసరి. అయితే, కొందరు తెలిసో, తెలియకో రిటర్నుల పత్రాల్లో తప్పులు చేస్తుంటారు. వార్షికాదాయం, మినహాయింపులు, చెల్లించాల్సిన పన్ను ఈ వివరాలన్నింటినీ రిటర్నుల్లో తప్పనిసరిగా చెప్పాలి. అయితే, చివరి నిమిషంలో రిటర్నులు వేసే హడావిడిలోనో, నిబంధనలు పట్టించుకోకపోవడం వల్లనో తప్పులు జరుగుతుంటాయి. వీటి వల్ల కొన్ని సందర్భాల్లో అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుంది.

ఇక, పెద్ద నోట్ల రద్దు తర్వాత... బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు, విదేశాల్లోని ఆస్తులు, ఆదాయం వంటి కీలక సమాచారం తెలియజేయకపోతే చట్ట ప్రకారం విచారణ ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ విధమైన సమస్యల్లో చిక్కుకోకుండా ఉండాలంటే రిటర్నుల్లో తప్పులు, దాపరికాలకు అవకాశం లేకుండా జాగ్రత్తపడాలి. అందుకోసం ఏం చేయాలనే విషయమై పన్ను నిపుణుల  అభిప్రాయాల ఆధారంగా ఇస్తున్న కథనమిది...
– సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

రిటర్నులు ఎవరు ఫైల్‌ చేయాలి?
ఆదాయపన్ను రిటర్నులు ఎవరు దాఖలు చేయాలన్న విషయంలో చాలా మందిలో గందరగోళం ఉంటుంది. చట్టంలోని నిబంధనల ప్రకారం ఏటా కనీస ఆదాయ పరిమితి (రూ.2.50 లక్షలు) దాటిన ప్రతి ఒక్కరూ రిటర్నులు ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. ఈ పరిమితి 60 ఏళ్లు దాటిన వారికి రూ.3 లక్షలు, 80 ఏళ్లు దాటిన వారికి రూ.5 లక్షలుగా ఉంది. దీన్ని ఎలా చూడాలంటే స్థూల ఆదాయం నుంచి ఇంటి అద్దె అలవెన్స్‌ (హెచ్‌ఆర్‌ఏ), కన్వేయన్స్, ఎల్‌టీఏ తదితర మినహాయింపులు తీసివేయగా వచ్చే నికర ఆదాయం కనీస ఆదాయ పరిమితి దాటితే రిటర్నులు ఫైల్‌ చేయాల్సి ఉంటుంది.

ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చేవారు సెక్షన్‌ 80సీ, సెక్షన్‌ 80డీ, సెక్షన్‌ 80టీటీఏ కింద వివిధ బీమా పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసిన మొత్తానికి, పిల్లలకు చెల్లించిన స్కూలు ఫీజుల మొత్తానికి... ఇలా పలు రకాల ఇన్వెస్ట్‌మెంట్లు, ఖర్చులకు మినహాయింపు పొందవచ్చు. ఇలా మినహాయింపులన్నీ పొందాక కొందరు పన్ను చెల్లించాల్సి రాకపోవచ్చు. ఈ మినహాయింపులన్నీ పొందాక పన్ను పరిధిలోకి రాకపోయినా సరే... వారు రిటర్నులు దాఖలు చేయాల్సిందే.

ఉదాహరణకు రమణ (30) వార్షిక స్థూల వేతనం రూ.3 లక్షలు. ఇతడి వేతనంలో హెచ్‌ఆర్‌ఏ, కన్వేయన్స్‌తదితర మినహాయింపులు రూ.20,000 ఉన్నాయి. అదే సమయంలో 80సీ కింద పన్ను మినహాయింపులు పొందగలిగే రూ.40,000 ఆదాయం కూడా ఉంది. ఇప్పుడు హెచ్‌ఆర్‌ఏ, కన్వేయన్స్, ఎల్‌టీసీ రూపంలో ఉన్న రూ.20,000 స్థూల వేతనం నుంచి మినహాయిస్తే వార్షిక వేతనం రూ.2,80,000 అవుతుంది. కనీస ఆదాయ పరిమితి రూ.2.50లక్షల కంటే ఇది ఎక్కువే కనుక రిటర్నులు దాఖలు చేయడం తప్పనిసరి. ఇక సెక్షన్‌ 80 కింద చేసే పెట్టుబడులు, వ్యయాలు పన్ను పరమైన మినహాయింపులే కానీ, రిటర్నుల దాఖలుకు వర్తించవు. అంటే రూ.40,000పై రమణ పన్ను చెల్లించనక్కర్లేదు కానీ, రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.

గడువు ఈ నెల 31
ఆ లోపే వేస్తే మంచిది


రిటర్నులో తప్పులు లేకుండా చూసుకోవాలి

రద్దు తర్వాతి డిపాజిట్లను వెల్లడించాలి

ఆధార్‌తో పాన్‌ అనుసంధానం తప్పనిసరి


టీడీఎస్‌ వివరాలు  పరిశీలించాలి
మీరు ఉద్యోగులైతే మీ యజమాని ప్రతినెలా జీతంలో పన్ను కింద కొంత కోత వేస్తారు. అలాగే వ్యాపారులైతే మీకు చెల్లించేవారు వారే పన్ను చెల్లించేసి మిగిలిన సొమ్ము మీకిస్తూ ఉంటారు. అంటే ఆదాయంపై మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) విధించినట్టన్నమాట. అయితే ఈ టీడీఎస్‌ మీ పాన్‌ నంబర్‌పై జమ అయిందా, లేదా అన్నది పరిశీలించుకోవాలి. ఉద్యోగ సంస్థ టీడీఎస్‌ విధించినట్టయితే అది ఫామ్‌ 16లో కనిపిస్తుంది.

వ్యాపారులకు చెల్లించేవారు కూడా ఇపుడు ఆన్‌లైన్లోనే చెల్లిస్తున్నారు కనక అది కూడా పాన్‌ నంబరుపైనే జమవుతుంది. ఫామ్‌ 26ఏఎస్‌ను పరీశీలించడం ద్వారా ముందస్తు పన్ను, వడ్డీ, ఇతర ఆదాయంపై టీడీఎస్‌ మీ పాన్‌ నంబర్‌పై జమ అయిందీ, లేనిదీ తెలుస్తుంది. ఒకవేళ ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే దాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇవేమీ పరిశీలించకుండా యథాలాపంగా రిటర్నులు దాఖలు చేసేసి పనైపోయిందని అనుకుంటే కష్టమే. రిటర్నుల్లో పేర్కొన్న వివరాలకు, టీడీఎస్‌కు మధ్య వ్యత్యాసం కనిపిస్తే నోటీసు అందుకోవాల్సి వస్తుంది. నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయం ఉండి, దానికి పాన్‌ నంబర్‌ లింక్‌ అయి ఉంటే ఫామ్‌ 26ఏఎస్‌ను పొందడం సులభమే.

వడ్డీ, ఇతర ఆదాయం కూడా...
ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రూపంలో వచ్చే ఆదాయానికి పన్ను ఉండదని కొందరు అనుకుంటుంటారు. నిజానికి ఈ డిపాజిట్లు సెక్షన్‌ 80 సీ కింద పన్ను మినహాయింపునకు ఉపకరించేవి. వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏటా వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం కనక రూ.10 వేలు దాటితే దానిపై బ్యాంకులు టీడీఎస్‌ మినహాయించుకుని మిగిలిందే చెల్లిస్తాయి. కొందరు తెలివిగా ఈ కోత నుంచి తప్పించుకునేందుకు వివిధ శాఖల్లో డిపాజిట్లు చేస్తుంటారు. కానీ, ఇది గతంలో. ప్రస్తుతం ఓ బ్యాంకుకు సంబంధించి ఒకటికి మించిన శాఖల్లో ఒకే వ్యక్తి ఎన్ని డిపాజిట్లు చేసినా అధికారులకు తెలిసిపోతుంది. అన్నింటి మొత్తాన్ని లెక్కించి టీడీఎస్‌ కత్తిరించేస్తున్నారు. రికరింగ్‌ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఏడాదిలో రూ.10,000 దాటినా దానిపైనా టీడీఎస్‌ అమలవుతుంది.

గడువుకు ముందే దాఖలు చేస్తే...
ఏటా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలకు తుది గడువు జూలై 31. కనుక ఈ గడువులోపు రిటర్నులు ఫైల్‌ చేయాలి. గతంలో ఆలస్యంగా దాఖలు చేస్తే జరిమానా ఉండేది కాదు. పన్నులు చెల్లించి ఉంటే గత రెండు సంవత్సరాలకు సంబంధించిన రిటర్నులు సైతం ఒకేసారి ఫైల్‌ చేసే అవకాశం ఉండేది. ఉదాహరణకు 2014–15 ఆర్థిక సంవత్సరం రిటర్నులు దాఖలుకు 2015–16 అసెస్‌మెంట్‌ సంవత్సరం అవుతుంది. అసెస్‌మెంట్‌ సంవత్సరం ముగిసిన తర్వాత ఏడాదిలోపు రిటర్నులు ఫైల్‌ చేయొచ్చు. అంటే 2015 మార్చితో ముగిసిన సంవత్సరానికి 2017 మార్చి వరకు రిటర్నులు ఫైల్‌ చేసేందుకు అవకాశం ఉండేది. ఇకపై ఈ అవకాశం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అసెస్‌మెంట్‌ సంవత్సరం ముగిసేలోపే రిటర్నులు ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఏడాది కాలం తగ్గిపోయింది.

ఎవరు ఏ పత్రాన్ని దాఖలు చేయాలి?
ఐటీఆర్‌1 లేదా సహజ్‌: వేతనం లేదా పెన్షన్‌ ద్వారా ఆదాయం పొందుతున్న వారు, ఒక ఇంటిపై ఆదాయం అందుకుంటున్నవారు, వడ్డీ, డివిడెండ్ల రూపంలో ఆదాయం అందుకుంటున్న వారు ఐటీఆర్‌1ను దాఖలు చేయాలి. అదే సమయలో ఆదాయం రూ.50 లక్షలు దాటిన వారు, గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నష్టాలను తర్వాతి సంవత్సరంలో క్లెయిమ్‌ చేసుకోవాలనుకునేవారు, విదేశీ ఆస్తులు కలిగి ఉన్నవారు, రూ.5,000 దాటిన వ్యవసాయ ఆదాయం ఉంటే, మూలధన లాభాల రూపంలో ఆదాయం ఉంటే, వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం అందుకుంటున్న వారు, ఒకటికి మించిన ఇళ్లపై ఆదాయం వస్తున్న వారు ఐటీఆర్‌1ను ఉపయోగించడానికి లేదు.

ఐటీఆర్‌2: వేతనం లేదా పెన్షన్‌ రూపంలో ఆదాయం ఉన్న వారు, ఇల్లు లేదా ప్రాపర్టీపై ఆదాయం వస్తుంటే, మూలధన లాభాల రూపంలో ఆదాయం అందుకునే వారు, ఇతర వనరుల ద్వారా ఆదాయం ఉంటే,  ఓ సంస్థలో భాగస్వామ్యం ద్వారా ఆదాయం ఉంటే, విదేశీ ఆస్తులు, ఆదాయం కలిగిన వారు, రూ.5,000 దాటి వ్యవసాయంపై ఆదాయం అందుకునే వారు ఐటీఆర్‌2ను దాఖలు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో వ్యాపారం, వృత్తి ద్వారా ఆదాయం అందుకునేవారికి ఇది వర్తించదు.

ఐటీఆర్‌3: యాజమాన్య వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం కలిగిన వ్యక్తి లేదా హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్‌) ఐటీఆర్‌3 పరిధిలోకి వస్తారు.  

నోట్ల రద్దు తరవాత నగదు డిపాజిట్లు
కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌ 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత డిసెంబర్‌ 30 వరకు ఈ రద్దయిన నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఒకవేళ ఆ సమయంలో రూ.2.5 లక్షలకు మించి నగదు డిపాజిట్‌ చేసిన వారు ఆ వివరాలను పన్ను రిటర్నుల్లో తప్పనిసరిగా వెల్లడించాలి. ఒకవేళ దాచి పెడితే అది అధికారులకు తెలియదనుకోవడం భ్రమే అవుతుంది. ఎందుకంటే రూ.2.5 లక్షలకు మించి నగదు డిపాజిట్‌ చేసిన వారి వివరాలు అదాయపన్ను శాఖ వద్దకు ఎప్పుడో చేరాయి. డిపాజిట్ల వివరాలు, రిటర్నుల్లో పేర్కొన్న వివరాలతో సరిపోలకపోతే అధికారుల నుంచి నోటీసు వస్తుంది. తప్పుదోవ పట్టించే వివరాలు ఉంటే పెనాల్టీ కింద 50 నుంచి 200 శాతం కట్టాల్సి వస్తుంది. అలాగే, తప్పుడు వివరాలు ఇచ్చినందుకు విచారణను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్యాంకులు స్వచ్ఛందంగా భారీ డిపాజిట్ల వివరాలను పన్ను అధికారులకు తెలియజేస్తుంటాయి. కనుక తప్పించుకోవాలన్న ఆలోచన సరికాదు.

ఆధార్‌ వివరాలూ చెప్పాలి...
తాజాగా అమల్లోకి వచ్చిన నిబంధనల మేరకు పన్ను రిటర్నులు వేసే ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌ నంబర్‌ను తెలియజేయాల్సి ఉం టుంది. అలాగే, పాన్‌ నంబర్‌తో ఆధార్‌ను లింక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్‌ కార్డు కోసం రిజిస్టర్‌ చేసుకుంటే ఆ వివరాలు ఇచ్చినా సరిపోతుంది.

ఉద్యోగం మారినా...
ఆర్థిక సంవత్సరం మధ్యలో ఓ కంపెనీ నుంచి మరో కంపెనీలోకి మారిపోతే... పాత కంపెనీలో పొందిన ఆదాయం, టీడీఎస్‌ వివరాలు సైతం వార్షిక పన్ను రిటర్నుల్లో భాగంగా చూపించాల్సి ఉంటుంది. దాచి ఉంచితే పన్ను చెల్లింపు నుంచి తప్పించుకోవచ్చు అని అనుకంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే మాజీ సంస్థలో టీడీఎస్‌ కోత విధించి ఉంటే అది ఫామ్‌ 26 ఏఎస్‌లో కనిపిస్తుంది. రిటర్నుల్లో ఆ వివరాలు లేకపోతే అధికారులు పన్ను పత్రాలను స్క్రూటినీ చేసే సమయంలో విషయం బయట పడుతుంది. దాంతో నోటీసు జారీ చేస్తారు. అందుకే కొత్తగా చేరిన సంస్థలో పాత సంస్థలో పొందిన ఆదాయం, టీడీఎస్‌ వివరాలు తెలియజేయడం మర్చిపోవద్దు లేదా దాచిపెట్టొద్దు.

విదేశీ ఆస్తులు, ఆదాయం
విదేశాల్లో బ్యాంకు ఖాతాలుంటే ఆ వివరాలు తెలియజేయాలి. అంటే ఖాతా ఎప్పుడు ప్రారంభించిందీ, ఓ ఆర్థిక సంవత్సరంలో పొందిన వడ్డీ ఆదాయం తదితర వివరాలు పేర్కొనాలి.

రూ.50 లక్షలు దాటితే...
గతంలో రూ.కోటి ఆదాయం దాటితే అదనంగా 10 శాతం సర్‌చార్జ్‌ విధించే వారు. దీన్ని గతేడాదే 15 శాతానికి పెంచడంతోపాటు రూ.కోటి పరిమితి కాస్తా రూ.50 లక్షలకు తగ్గించారు. కనుక రూ.50 లక్షలు దాటిన వారు తప్పకుండా తమ అన్ని రకాల ఆస్తుల వివరాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. అంటే స్థిర, చరాస్తులెన భూమి, భవనం, నగదు, వాహనాలు (బోట్లు, విమానాలు), ఆభరణాలు, బంగారం, ఇతర విలువైన వస్తువుల గురించి వెల్లడించడం తప్పనిసరి.

Advertisement
Advertisement