రిలయన్స్ బంకులన్నీ ఈ ఏడాదే మళ్లీ షురూ | Sakshi
Sakshi News home page

రిలయన్స్ బంకులన్నీ ఈ ఏడాదే మళ్లీ షురూ

Published Sun, Apr 19 2015 1:58 AM

రిలయన్స్ బంకులన్నీ ఈ ఏడాదే మళ్లీ షురూ - Sakshi

న్యూఢిల్లీ: డీజిల్ ధరల నియంత్రణ ఎత్తివేసిన నేపథ్యంలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఈ ఆర్థిక సంవత్సరంలో పునఃప్రారంభించనుంది. మొత్తం 1,400 పెట్రోల్ పంపులు 320 రిటైల్ అవుట్‌లెట్లను కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆర్‌ఐఎల్ ఈ విషయాలు వెల్లడించింది. భారీ రవాణా సంస్థల ట్రక్కుల ఇంధనావసరాల కోసం నగదు లావాదేవీల ప్రమేయం ఉండని విధంగా.. స్మార్ట్‌కార్డులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది.

ఆర్‌ఐఎల్‌తో పాటు మరో ప్రైవేట్ రిఫైనరీ సంస్థ ఎస్సార్ ఆయిల్‌కి 2006 నాటికి దేశీయంగా డీజిల్‌కి సంబంధించి 17 శాతం, పెట్రోల్‌కి సంబంధించి 10 శాతం మార్కెట్ వాటా ఉండేది. అప్పట్లో అన్ని సంస్థల బంకులతో పోల్చి చూస్తే రిలయన్స్‌వి 4 శాతం బంకులే ఉన్నప్పటికీ గణనీయంగానే మార్కెట్ వాటా ఉండేది. 2006లో డీజిల్ మార్కెట్‌లో ఆర్‌ఐఎల్‌కి 14.3 శాతం, పెట్రోల్ మార్కెట్‌లో 7.2 శాతం వాటా ఉండేది.
 
అయితే, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు సబ్సిడీ రేట్లతో ఇంధనాన్ని విక్రయిస్తుండటంతో ప్రైవేట్ కంపెనీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. భారీ నష్టాలు రావడంతో 2008 మార్చి నాటికి రిలయన్స్‌కి చెందిన 1,432 పెట్రోల్ పంపులు మూతబడ్డాయి. 2010 జూన్‌లో ప్రభుత్వం పెట్రోల్ రేట్లపై నియంత్రణ ఎత్తివేశాక ఎస్సార్ మళ్లీ తమ 1,400 అవుట్‌లెట్లలో పెట్రోల్‌ను విక్రయించడం మొదలుపెట్టింది. ఇక డీజిల్‌పై గతేడాది కేంద్రం నియంత్రణ ఎత్తివేశాక.. ఎస్సార్ కూడా తమ బంకుల్లో డీజిల్ విక్రయాలు ప్రారంభించింది. బంకుల సంఖ్యను 1,600కి పెంచుకుంది. ఏడాది వ్యవధిలో ఈ సంఖ్యను 2,500కి పెంచుకోనుంది.

Advertisement
Advertisement