జియో మరో సంచలనం, ప్రత్యర్థులకు షాక్ | Sakshi
Sakshi News home page

జియో మరో సంచలనం, ప్రత్యర్థులకు షాక్

Published Fri, May 1 2020 3:58 PM

 Reliance Jio to take on Zoom Google Meet with new video conferencing app JioMeet  - Sakshi

సాక్షి, ముంబై : టెలికాం రంగం సునామి రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన రిలయన్స్ జియో మరో సంచలనానికి నాంది పలికింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్‌డౌన్‌ పరిస్థితులను సరిగ్గా క్యాష్ చేసుకునేందుకు కొత్త  వీడియో కాన్ఫరెన్స్ యాప్ ని లాంచ్ చేసింది. రిలయన్స్ జియో తన ప్లాట్ ఫాం మీద జియో మీట్‌ అనే వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ను లాంచ్ చేసింది. తద్వారా ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో  అత్యవసరంగా మారిన వీడియో-కాన్ఫరెన్సింగ్  సేవలలోకి ప్రవేశించింది.  అంతేకాదు రంగంలో దూసుకుపోతున్న జూమ్, గూగుల్ మీట్,  హౌస్‌పార్టీ  లాంటి యాప్ లకు గట్టి  షాక్ ఇచ్చింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రైమాసిక ఫలితాల సందర్బంగా జియోమీట్‌ను ప్రారంభించనున్నట్లు గురువారం తెలిపింది. జియో మీట్ చాలా ప్రత్యేకతను కలిగి ఉందని,ఇది ఏ పరికరంలోనైనా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌ లోనైనా పని చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సీనియర్ విపి పంకజ్ పవార్ వెల్లడించారు. జియోమీట్‌ను స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ఇలా ఏ యాప్‌లో అయినా యాక్సెస్ చేయొచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్ మార్కెట్‌ప్లేస్‌ నుంచి, మ్యాక్ యాప్ స్టోర్ నుంచి జియోమీట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరో ముఖ్య విషయం ఏమిటంటే వీడియో కాన్ఫరెన్సింగ్‌కు మాత్రమే జియో మీట్ పరిమితం కాదు. జియో ఇహెల్త్, ఇఎడ్యుకేషన్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లతో దీన్ని అనుసంధించారు. దీని ద్వారా వినియోగదారులు వర్చ్యువల్ గా వైద్యులను సంప్రదించడానికి, ప్రిస్క్రిప్షన్లను పొందడానికి, మందులను ఆర్డర్లు ఇవ్వడానికి  ఉపయోపడుతుంది. దీంతోపాటు  డిజిటల్ వెయిటింగ్ రూమ్‌లను ప్రారంభించడానికి వైద్యులకు అనుమతిస్తుంది. ఇంకా వర్చువల్ తరగతి గదులు, రికార్డ్ సెషన్లు, హోంవర్క్‌లు, పరీక్షలను నిర్వహించడం లాంటి వాటికోసం ఇ-ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫాం సహాయపడుతుంది. తమ జియో మీట్ బహుళ ప్లాట్‌ఫామ్‌లను ఏకీకృతం చేస్తుందనీ, నావిగేట్ చేయడం  కూడా చాలా సులభం కనుక దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చని పవార్ చెప్పారు. (లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఇన్ఫీ మూర్తి స్పందన)

ఫ్రీప్లాన్‌లో ఐదుగురు  వినియోగదారులు, బిజినెస్‌ ప్లాన్‌లో 100 మంది యూజర్ల వరకు జియో మీట్‌  పాల్గొనే అవకాశాన్ని కల్పించనుంది. జియో వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం గ్రూప్ కాలింగ్‌ ద్వారా ఒకేసారి 100 మంది పాల్గొనే అవకాశం ఉండనుంది. జూమ్ ప్రస్తుతం 40 నిమిషాల వ్యవధిలో 100 మంది పాల్గొనే అవకాశాన్ని ఉచితంగా అందిస్తోంది. అయితే ప్రస్తుతానికి జియోమీట్ వెబ్‌సైట్‌లోని అన్ని వివరాలను తొలగించింది. మీ ఆసక్తికి ధన్యవాదాలన్న సందేశం కనిపిస్తోంది.  (కరోనా : ట్రెండ్ సెట్ చేసిన అంబానీ, వేతనాల కోత)

కాగా కరోనా కల్లోలంతో దాదాపు అన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటినుంచి పనిచేసేందుకు అనుమతినిచ్చాయి. వీడియో సమావేశాల ద్వారా పనులు చక్కబెట్టుకుంటున్నాయి. అలాగే విద్యాసంస్థలు కూడా వీడియో-కాన్ఫరెన్సింగ్, ఆన్ లైన్ పాఠాల వైపు మళ్లాయి. దీనితో గూగుల్, మైక్రోసాఫ్ట్ , జూమ్ వంటి సంస్థల వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ కు ఆదరణ భారీగా పెరిగింది. అయితే జూమ్ యాప్ సెక్యూరిటీ పై సందేహాలను వ్యక్తి చేసిన కేంద్రం ఈ యాప్ ను సాధ్యమైనంతవరకు వినియోగించ వద్దని  ఇటీవల  సూచించిన సంగతి తెలిసిందే.  (భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర)

Advertisement
Advertisement