జియోకు నాంది ఆమెనే | Sakshi
Sakshi News home page

జియోకు నాంది ఆమెనే

Published Fri, Mar 16 2018 2:21 PM

Reliance Jio Was Daughter Ishas Idea Says Mukesh Ambani - Sakshi

ముంబై : టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తూ దూసుకొచ్చిన రిలయన్స్‌ జియో విజయవంతమైన జర్నీ అందరికీ తెలిసిందే. రెండేళ్ల వ్యవధిలోనే భారత్‌ను ప్రపంచంలో అతిపెద్ద మొబైల్‌ బ్రాడుబ్యాండ్‌ డేటా కన్జ్యూమింగ్‌ దేశంగా నిలబెట్టింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చెందిన ఈ కంపెనీకి నాంది, విత్తనం తన కూతురు ఇషానేనని ముఖేష్‌ అంబానీ వెల్లడించారు. 2011లోనే ఇషా జియోకు విత్తు నాటిందని చెప్పారు. ఫైనాన్షియల్ టైమ్స్ ఆర్సిలర్ మిట్టల్ బోల్డ్‌నెస్‌ ఇన్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు ‘డ్రైవర్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌’  అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖేష్‌ ఈ విషయాన్ని రివీల్‌ చేశారు. 

2016లో జియో ప్రారంభమైనప్పటి నుంచి టెలికాం ఆపరేటర్ల గుండెలు గుబేల్‌మంటున్నాయి. జీవితకాలం ఉచిత కాల్‌ సర్వీసులతో పాటు తక్కువ రేట్లకు డేటాను కూడా ఆఫర్‌ చేస్తూ.. ప్రత్యర్థులకు ఝలక్‌ ఇస్తోంది. 2011లో తొలిసారి తన కూతురు ఇషా ఈ ఆలోచనను అందించిందని, ఆ సమయంలో ఇషా అమెరికాలోని యేల్‌ యూనివర్సిటీలో చదువుకుంటోందని గుర్తుచేసుకున్నారు. సెలవులకి ఇంటికి వచ్చిన సమయంలో ఇషా ఈ ఆలోచనను తమ ముందు ఉంచిందని చెప్పారు. ఇషా, ఆకాశ్‌లు అంబానీ కవల పిల్లలు.  ప్రస్తుతం రిలయన్స్‌లో వీరిద్దరూ యంగ్‌ డైరెక్టర్లుగా ఉన్నారు. 

ప్రపంచంలో ఉన్నతమైన దానిని అందించడానికి దేశ యువతరానికి చెందిన ఇషా, ఆకాశ్‌లు ఎక్కువ సృజనాత్మకంగా, అతిపెద్ద లక్ష్యంతో ఉన్నారు. జియో​ నెలకొల్పడానికి ఈ యంగ్‌ ఇండియన్స్‌ ఇద్దరూ తనని ఒప్పించారని పేర్కొన్నారు. ఆ సమయంలో భారత్‌ పూర్‌ కనెక్టివిటీతో ఉందని, డిజిటల్‌ వనరు డేటాలో తీవ్ర కొరతను ఎదుర్కొంటుందని చెప్పారు. డేటా కేవలం కొరతను ఎదుర్కొనడమే కాక, చాలా మంది భారతీయులకు ఇది అందుబాటులో లేదన్నారు. 

జియో వచ్చిన తర్వాత దేశంలో మారుమూల గ్రామానికి కూడా డేటా సరసమైన ధరల్లో అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. 2016లో జియో లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జియో అతిపెద్ద గేమ్‌ ఛేంజర్‌గా ఉంది. ప్రపంచంలో అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌ 4జీ ఎల్‌టీఈ ఓన్లీ డేటా నెట్‌వర్క్‌ను జియో సృష్టించింది. 2019 నాటికి భారత్‌ లీడర్‌గా జియో నిలవబోతుందని అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. లాంచైనా 170 రోజుల్లోనే 100 మిలియన్‌ కస్టమర్లను ఇది సొంతం చేసుకుందని తెలిపారు. దేశీయ చరిత్రలో అతిపెద్ద స్టార్టప్‌గా కూడా జియో నిలిచిందని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement