కార్నివల్ చేతికి బిగ్ సినిమాస్ | Sakshi
Sakshi News home page

కార్నివల్ చేతికి బిగ్ సినిమాస్

Published Tue, Dec 16 2014 12:36 AM

కార్నివల్ చేతికి బిగ్ సినిమాస్

అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూపు కంపెనీ నుంచి కొనుగోలు

డీల్ విలువ సుమారు రూ. 700 కోట్లు
మూడో పెద్ద మల్టీప్లెక్స్ సంస్థ ఆవిర్భావం

 
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్ సంస్థ రిలయన్స్ క్యాపిటల్.. బిగ్ సినిమాస్ బిజినెస్‌ను కార్నివల్ గ్రూప్‌నకు విక్రయించింది. డీల్ విలువ రూ. 700 కోట్లుగా అంచనా. ఇది దేశీ మల్టీప్లెక్స్ రంగంలోనే అతిపెద్ద డీల్ కాగా, అనుబంధ సంస్థ రిలయన్స్ మీడియా వర్క్స్ ద్వారా దక్షిణాదికి చెందిన కార్నివల్ గ్రూప్‌నకు బిగ్ సినిమాస్‌ను విక్రయించింది. అయితే వీటిలో ముంబైలోని ఐమాక్స్ వాడాల మల్టీప్లెక్సెస్ తదితర ప్రాంతాలలో ఉన్న కొన్ని రియల్టీ ఆస్తులను మినహాయించింది. రూ. 200 కోట్ల విలువైన ఈ ఆస్తులను రిలయన్స్ క్యాపిటల్ విడిగా విక్రయించే యోచనలో ఉంది.

తద్వారా కీలకంకాని వ్యాపారాల నుంచి వైదొలగే ప్రణాళికను అమలు చేయడంతోపాటు ఆమేర రుణ భారాన్ని సైతం తగ్గించుకోనుంది. బిగ్ సినిమాస్ బిజినెస్ అమ్మకం ద్వారా రిలయన్స్ క్యాపిటల్ రుణాల బదిలీతోపాటు, కొంతమేర నగదును సైతం పొందనుంది. వెరసి సుమారు రూ. 700 కోట్ల వరకూ రుణ భారాన్ని దించుకునే వీలు చిక్కనుంది. ఈ విషయాన్ని రెండు సంస్థలూ సంయుక్తంగా వెల్లడించాయి. అయితే డీల్ కచ్చితమైన విలువను అటు కార్నివల్, ఇటు రిలయన్స్ క్యాపిటల్ వెల్లడించలేదు.

ప్రైమ్ ఫోకస్ డీల్‌కు ఓకే
వినోద బిజినెస్‌ను ప్రైమ్ ఫోకస్‌కు బదిలీ చేసేందుకు ఇటీవలే రిలయన్స్ మీడియా వర్క్స్ కుదుర్చుకున్న ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ. 1,800 కోట్ల విలువైన ఈ డీల్ వల్ల దేశీయ వినోద రంగంలో పోటీ వాతావరణం దెబ్బతినే అవకాశం లేదంటూ సీసీఐ ఈ సందర్భంగా పేర్కొంది. ప్రైమ్ ఫోకస్‌లో 30.2% వాటాను పొందే డీల్‌లో భాగంగా రిలయన్స్ మీడియా రూ. 120 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఇక ప్రైమ్ ఫోకస్‌లో ప్రస్తుత ప్రమోటర్లు కూడా ఇదే స్థాయిలో పెట్టుబడులను తీసుకురానున్నారు. డీల్ ప్రకారం రిలయన్స్ మీడియాకు చెందిన ముంబైలోని ఫిల్మ్ సిటీ, నవీముంైబె  సెజ్‌లోని బ్యాక్‌ఎండ్ యూనిట్, లాస్‌ఏంజిల్స్‌లోని లౌరీ డిజిటల్‌తోపాటు, ఈ యూనిట్‌కుగల రూ. 200 కోట్ల రుణ భారం కూడా ప్రైమ్ ఫోకస్‌కు దాఖలు కానున్నాయి.
 
కార్నివల్ సంగతిదీ...
కేరళ కేంద్రంగా ఏర్పాటైన కార్నివల్ గ్రూప్ ఇప్పటికే 125కుపైగా తెరలను కలిగి ఉంది. గ్రూప్ సీఈవో శ్రీకాంత్ భసీ. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో కార్యకలాపాలు విస్తరించింది. మీడియా, వినోదం, ఆతిథ్య రంగాలలో బిజినెస్‌లు కలిగి ఉంది. ఈ ఏడాది జూలైలో ముంబై రియల్టీ సంస్థ హెచ్‌డీఐఎల్‌కు చెందిన మల్టీప్లెక్స్ బిజినెస్ బ్రాడ్‌వే సినిమాను రూ. 110 కోట్లకు సొంతం చేసుకుంది. ఇదే నెలలో లీలా గ్రూప్‌నకు చెందిన కొచ్చిలోని ఐటీ పార్క్‌ను రూ. 280 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

అక్టోబర్‌లో ఎల్‌అండ్‌టీకి చెందిన చండీగఢ్‌లోని ఎల ంటే మాల్‌ను రూ. 1,900 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపింది. బిగ్ సినిమాస్ పేరుతో రిలయన్స్ మీడియావర్క్స్ ప్రస్తుతం  దేశవ్యాప్తంగా 250 తెరలను కలిగి ఉన్న విషయం విదితమే. వెరసి బిగ్ సినిమాస్ కొనుగోలుతో కార్నివల్ మూడో పెద్ద మల్టీప్లెక్స్ సంస్థగా ఆవిర్భవించనుంది.

Advertisement
Advertisement