ఐపీవో రూట్‌లో జియో | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 13 2017 12:45 AM

Reliance Said To Weigh Jio IPO After $31 Billion Wireless Spree - Sakshi

ముంబై: దేశీ టెలికం పరిశ్రమను ‘జియో’తో షేక్‌ చేసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేశ్‌ అంబానీ... స్టాక్‌ మార్కెట్లో కూడా ఇదే విధమైన ప్రకంపనలు సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ఆర్‌ఐఎల్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ జియో పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ)కు సన్నాహాలు మొదలుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంతర్గతంగా దీనిపై చర్చలు కూడా జరుపుతున్నట్లు ‘బ్లూంబర్గ్‌’ వార్త సంస్థ నివేదిక పేర్కొంది.

వచ్చే ఏడాది ఆఖరికల్లా లేదా 2019 తొలినాళ్లలో జియోను స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీ ఇప్పటివరకూ జియో నెట్‌వర్క్‌పై దాదాపు రూ.1.5 లక్షల కోట్లకుపైగానే పెట్టుబడిగా వెచ్చించింది. నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు మరింతగా కుమ్మరించేందుకూ(దాదాపు రూ.60 వేల కోట్ల పెట్టుబడుల ప్రణాళిక) సిద్ధమని ప్రకటించింది. ఈ మొత్తం పెట్టుబడుల విలువ రూ.2 లక్షల కోట్లు దాటగానే ఐపీఓకి రావాలనేది కంపెనీ ప్రణాళికగా మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ వార్తలపై స్పందించేందుకు ఆర్‌ఐఎల్‌ వర్గాలు నిరాకరించినట్లు బ్లూంబర్గ్‌ పేర్కొంది.

క్యూ3లో బ్రేక్‌ ఈవెన్‌..!
వాణిజ్యపరంగా 4జీ సేవలను ఆరంభించినట్లు (బిల్లింగ్‌ను మొదలు పెట్టాక) ప్రకటించిన తొలి త్రైమాసికంలోనే జియో మంచి పనితీరును ప్రదర్శించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.6,147 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం రూ.260 కోట్లుగా నమోదైంది. నికర నష్టం మాత్రం రూ.21.3 కోట్ల(క్యూ1) నుంచి క్యూ2లో రూ.271 కోట్లకు పెరిగింది. క్యూ2లో సగటున ఒక్కో యూజర్‌ నుంచి రూ.156 చొప్పున ఆదాయం(ఏఆర్‌పీయూ) లభించినట్లు కంపెనీ ఫలితాల సందర్భంగా పేర్కొంది.

ఇక సెప్టెంబర్‌ చివరినాటికి జియో నెట్‌వర్క్‌లో మొత్తం సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 13.86 కోట్లుగా ఉంది. యూజర్ల సంఖ్య పరంగా ప్రస్తుతం దేశంలో నాలుగో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా కొనసాగుతోంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(2017–18, క్యూ3)లో జియో బ్రేక్‌–ఈవెన్‌ను(లాభనష్టాలు లేని స్థితి) సాధించొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక 2012 కల్లా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మొత్తం ఆదాయంలో 40–50 శాతం ఆదాయం జియో నుంచే సమకూరవచ్చని కూడా అంచనా. ఇక మిగతా 50 శాతం ఆదాయం రిఫైనరీ, పెట్రోకెమికల్స్‌ ఇతరత్రా విభాగాల నుంచి లభించవచ్చని లెక్కలేస్తున్నారు. ఆర్థిక పనితీరు భారీగా మెరుగుపరుచుకోవడంపైనే ప్రస్తుతం జియో దృష్టిపెట్టిందని.. ఆ తర్వాతే వాటా విక్రయం(ఐపీఓ)కు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ బ్లూంబర్గ్‌ నివేదికలో వెల్లడించింది.


డేటాలో టాప్‌ లక్ష్యం...
రిలయన్స్‌ గ్రూప్‌లో జియో ఒక మణిమకుటం లాంటిదంటూ ఇటీవలి కంపెనీ వార్షిక సమావేశం(ఏజీఎం) సందర్భంగా ముకేశ్‌ అంబానీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రానున్న దశాబ్ద కాలంలో జియో వ్యాపారం, బ్రాండ్‌ విలువ దూసుకుపోనుందని కూడా స్పష్టం చేశారు. డేటా సేవలు, ఉత్పత్తులు, అప్లికేషన్‌ ప్లాట్‌ఫామ్స్‌లో జియో దేశంలోకెల్లా అతిపెద్ద సంస్థగా ఆవిర్భవిస్తుందని కూడా ముకేశ్‌ పేర్కొనడం గమనార్హం. జియో స్పీడ్‌తో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ధర ఆల్‌టైమ్‌ గరిష్టాన్ని తాకడం విదితమే.

ఫిబ్రవరిలో జియో బిల్లింగ్‌ వివరాలను ప్రకటించిన తర్వాత నుంచి ఆర్‌ఐఎల్‌ షేరు దాదాపు 50 శాతంపైగానే ఎగబాకడం గమనార్హం(ప్రస్తుతం రూ.916 వద్ద ఉంది). సెప్టెంబర్‌ ఆఖరికి రిలయన్స్‌ మొత్తం రుణ భారం రూ.2,14,145 కోట్లుగా నమోదైంది. కంపెనీ వద్దనున్న నగదు నిల్వలు రూ.77,014 కోట్లు. ‘పెట్రోకెమికల్స్, రిఫైనింగ్‌ మార్జిన్లను పక్కనబెడితే.. జియోకు రిలయన్స్‌ ఎంత వ్యాల్యుయేషన్‌ను నిర్ధారించిందనేది ఐపీఓ ద్వారా తేటతెల్లమవుతుంది. ఇప్పుడు ఐడియా–వొడాఫోన్‌(విలీనం తర్వాత), ఎయిర్‌టెల్‌ తర్వాత ఇక జియోనే మూడో స్థానాన్ని ఆక్రమిస్తుండటంతో లిస్టింగ్‌ అనేది ఇన్వెస్టర్లకు కూడా మంచిదే’ అని ఇండియా ఇన్ఫోలైన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ వ్యాఖ్యానించారు. 

Advertisement
Advertisement