బోర్డు నుంచి వెంకటేశన్, కుద్వాలను తొలగించండి | Sakshi
Sakshi News home page

బోర్డు నుంచి వెంకటేశన్, కుద్వాలను తొలగించండి

Published Thu, Jan 4 2018 12:38 AM

Remove Venkateshan and Kudwala from the board - Sakshi

హైదరాబాద్‌: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ‘ఇన్ఫోసిస్‌’ ఏదో ఒక రూపంలో నిత్యం వార్తల్లో ఉంటోంది. తాజాగా సంస్థకు చెందిన మాజీ సీఎఫ్‌వో వి.బాలకృష్ణన్‌... బోర్డులోని కొందరు సభ్యులపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫీ మాజీ కో–చైర్మన్‌ రవి వెంకటేశన్‌ను, అడిట్‌ కమిటీ మాజీ చైర్‌పర్సన్‌ రూప కుద్వాను బోర్డు నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఇన్ఫోసిన్‌ కొత్త సీఈవోగా సలీల్‌ పరేఖ్‌ పగ్గాలు చేపట్టిన మరుసటి రోజే బాలకృష్ణన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం మరంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కంపెనీ బోర్డును పునర్నిర్మించాల్సిన అవసరముందని బాలకృష్ణన్‌ తెలిపారు. ‘నందన్‌ (కంపెనీ చైర్మన్‌) త్వరితగతిన బోర్డు పునర్నిర్మాణాన్ని పూర్తి చేయాలి. మాజీ కో–చైర్మన్, అడిట్‌ కమిటీ చైర్మన్‌లను మార్చేయాలి.

పూర్తి శక్తి సామర్థ్యాలతో పనిచేసేందుకు వీలుగా పరేఖ్‌కు స్వచ్ఛమైన బోర్డును అందించాలి’ అని వివరించారు. బోర్డుకు వన్నె తెచ్చేవారిని నియమించుకోవాలని సూచించారు. ‘కంపెనీని రూపాంతరం చెందించడానికి సలీల్‌ పరేఖ్‌కు గొప్ప అవకాశం అందుబాటులో ఉంది. ఈయన బ్యాక్‌గ్రౌండ్, నిర్వర్తించిన బాధ్యతలు కంపెనీని ముందుకు నడిపించడానికి ఉపయోగపడతాయి. సీఈవో పదవికి పరేఖ్‌ అనువైన వ్యక్తి. గత మేనేజ్‌మెంట్‌ చేసిన తప్పులు ఈయన చేయడని భావిస్తున్నాం. కంపెనీ విలువలకు కట్టుబడి ఉండాలి’ అన్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులు సహా పలు సవాళ్లను పరేఖ్‌ ఎదుర్కోవలసి ఉందని పేర్కొన్నారు. కాగా సంస్థలో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ బాగోలేదని ఇదివరకే ఆరోపణలొచ్చాయి. సంస్థ మాజీ సీఎఫ్‌వో రాజీవ్‌ బన్సాల్‌కు అధిక పేమెంట్‌పై పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి కంపెనీ గత నెల సెబీకి సెటిల్‌మెంట్‌ విజ్ఞప్తిని పంపింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement