గృహోపకరణాలకు ‘ఈజీ’ దారి! | Sakshi
Sakshi News home page

గృహోపకరణాలకు ‘ఈజీ’ దారి!

Published Tue, Oct 17 2017 1:15 AM

Retail stores dominate offline stores

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ముందుగా టెలివిజన్‌. ఆ తర్వాత రిఫ్రిజిరేటర్‌. కొన్నాళ్లకు వాషింగ్‌ మెషీన్‌. ఒక్కో ఇంట్లో గృహోపకరణాల కొనుగోలు తీరిది. ఇదంతా గతమని చెబుతున్నాయి తయారీ కంపెనీలు. నేటి యువతరం వీటికోసం వేచిచూడడం లేదట. ఇంట్లో అన్ని రకాల ఉపకరణాలూ ఉండాలన్న భావనతో ఒకేసారి కొనేస్తున్నారట.

ఇందుకు సులభవాయిదాలు దోహదం చేస్తున్నాయని కంపెనీలు అంటున్నాయి. 24 నెలల వరకు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉండడంతో అమ్మకాలు పెరుగుతున్నాయి. దీనికితోడు కస్టమర్లు అప్‌గ్రేడ్‌ అవడం కలిసొచ్చే అంశమని విక్రేతలు చెబుతున్నారు.

సులభంగా కొంటున్నారు..
ఐదేళ్ల కిందటి వరకూ కొనుగోళ్లలో వాయిదాలపై కొనేవాటి వాటా కేవలం 20 శాతమే. ఇప్పుడిది ఏకంగా రెట్టింపయి 40 శాతానికి చేరింది. వడ్డీ లేని సులభ వాయిదాలను సైతం విక్రేతలు ఆఫర్‌ చేస్తున్నారు. ఇక ఉపకరణాల ఫీచర్లు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఫీచర్లలో సైతం కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీంతో కస్టమర్లు సహజంగానే అప్లయన్సెస్‌కు ఆకర్షితులవుతారు.

‘‘వినియోగదార్లు గతంలో 25 ఏళ్ల వరకు ఒక వస్తువును అట్టిపెట్టుకునేవారు. ఇప్పుడలా కాదు. 8–9 ఏళ్లు కాగానే మార్చేస్తున్నారు’’ అని గోద్రెజ్‌ అప్లయన్సెస్‌ బిజినెస్‌ హెడ్‌ కమల్‌ నంది ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. ప్రతి ఉత్పాదనలో ప్రీమియం కోరుకుంటున్నారని చెప్పారు. ఆదాయాలు పెరగటం, కొత్త టెక్నాలజీ కోరుకోవడం కారణంగా కొన్ని సంవత్సరాలు వినియోగించగానే నూతన మోడళ్లకు మారిపోతున్నారని తెలియజేశారు.

డిస్కౌంట్లంటే గంతేస్తారు..
జీఎస్‌టీ తర్వాత ఉపకరణాల ధర 2.5% వరకు మాత్రమే పెరిగింది. ధరలు బాగా పెరుగుతాయన్న వార్తల నేపథ్యంలో జూన్‌ నెలలో కనీవినీ ఎరుగని రీతిలో అమ్మకాలు నమోదయ్యాయి. విక్రేతలు పాత స్టాక్‌ మీద ఎప్పుడూ ఇచ్చే డిస్కౌంట్‌ కంటే 30% అధికంగా ఇవ్వడం వల్లే జూన్‌లో దుకాణాలు కిక్కిరిసిపోయాయి.

డిస్కౌంట్లు అనగానే ప్రపంచవ్యాప్తంగా కస్టమర్ల తీరు ఒకేలా ఉంటుందని కంపెనీలు చెబుతున్నాయి. ఈ డిస్కౌంట్లే ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల మార్కెట్‌ను నడిపిస్తున్నాయని ఐటీ మాల్‌ ఎండీ మొహమ్మద్‌ అహ్మద్‌ తెలిపారు. దీపావళికి తమ స్టోర్లలో ల్యాప్‌టాప్‌లపై 25 శాతం దాకా డిస్కౌంట్‌ ఇస్తున్నట్టు చెప్పారు. పండుగల సీజన్‌లో మూడు రెట్ల అమ్మకాలు నమోదవుతాయని అంచనా వేశారాయన.

దీపావళికి మెరుపులే..
గత నెలలో చివరివారంలో దసరా రావడంతో చాలా మంది గృహోపకరణాల కొనుగోళ్లకు పెద్దగా మొగ్గు చూపలేదు. అయితే ఈ దీపావళికి మాత్రం అమ్మకాల జోరు ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా సాగే అమ్మకాల్లో పండుగల సీజన్‌ వాటా 35 శాతం మేర ఉంటోంది. గతేడాది సీజన్‌తో పోలిస్తే ప్రస్తుత పండుగల సీజన్‌లో 30 శాతం వృద్ధి ఉంటుందని కమల్‌ నంది చెప్పారు. సానుకూల రుతు పవనాలకుతోడు ప్రభుత్వ ఉద్యోగులకు అలవెన్సులు పెరిగాయి.

ఈ కారణాలతో దీపావళి అమ్మకాలు బాగుంటాయని కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్, అప్లయన్సెస్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (సియామా) ప్రెసిడెంట్‌ మనీష్‌ శర్మ అభిప్రాయపడ్డారు. విస్త్రుతి పరంగా చూస్తే భారత్‌లో 22 శాతం ఇళ్లలో రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి. వాషింగ్‌ మెషీన్లు 10 శాతం, ఏసీలు 4 శాతం గృహాల్లో ఉన్నాయి. 2017లో దేశవ్యాప్తంగా 1.6 కోట్ల యూనిట్ల టీవీలు అమ్ముడవుతాయని ప్యానాసోనిక్‌ అంచనా వేస్తోంది.

ఆఫ్‌లైన్‌దే మార్కెట్‌..
భారత కన్సూ్యమర్‌ ఎలక్ట్రానిక్స్, అప్లయన్సెస్‌ విపణి సుమారు రూ.55,000 కోట్లుంది. ఇందులో ఆన్‌లైన్‌ వాటా ప్రస్తుతం 8–10% ఉన్నట్లు సమాచారం. రెండేళ్ల క్రితం ఇది 5 శాతమే. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆన్‌లైన్‌ వాటా 20% వరకూ ఉన్నట్లు చెబుతున్న పరిశ్రమ వర్గాలు... రానున్న రోజుల్లో భారత్‌లో ఇది 15%కి చేరొచ్చని అంచనా వేస్తున్నాయి.

ప్రధానంగా మైక్రోవేవ్‌ ఓవెన్ల వంటి చిన్న ఉపకరణాలు ఎక్కువగా ఈ–కామర్స్‌ వేదికపై అమ్ముడవుతున్నాయి. పెద్ద ఉపకరణాల విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇప్పటికీ కస్టమర్లు స్వయంగా ఉత్పాదనలను స్టోర్లలో పరీక్షించాకే కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఆఫ్‌లైన్‌ విపణిలో ఆధునిక, జాతీయ స్థాయి కంపెనీలు 20 శాతం, ప్రాంతీయ విక్రేతలు 15 శాతం బిజినెస్‌ చేస్తున్నారు. మిగిలినది వ్యక్తిగత విక్రేతలది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement