రిటైర్మెంట్‌కు ఎంత కావాలి?

8 Jul, 2019 12:43 IST|Sakshi

ఇందుకోసం ఎన్నో సూత్రీకరణలు

60 ఏళ్ల నాటికి జీవన వ్యయాలే కీలకం

కనీసం వార్షిక ఖర్చులకు  28–30 రెట్లు అవసరం

సంపాదన ఆరంభించిన నాటి నుంచే ప్రణాళిక

అప్పుడే దీర్ఘకాలంలో తగినంత నిధి ఏర్పడుతుంది

ఈ తరం వారికి రిటైర్మెంట్‌ తర్వాత పెన్ష వచ్చే సదుపాయాలు ఉండడం లేదు.ప్రైవేటు రంగంలోని వారికి ఈపీఎఫ్‌ ఉన్నా కానీ, అదేమంత సరిపోయే మొత్తం కాదు. ప్రభుత్వరంగంలోని వారిని మినహాయించి చూస్తే, మిగిలిన వారు ఉద్యోగ జీవితం ముగిసిన తర్వాత తమ జీవన అవసరాల కోసం అవసరమైనంత నిధి ఏర్పాటుకు ముందు నుంచే చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం. అయితే,మలి జీవితం భద్రత దృష్ట్యా ఎంత మొత్తం పొదుపు చేయాలన్నది అందరికీఅర్థమయ్యే విషయం కాదు. అయితే, ఇందుకు ఆర్థిక నిపుణులు కొన్ని రకాల లెక్కింపు విధానాలను సూచించారు. వాటి ఆధారంగా ఎవరికి వారు తమ రిటైర్మెంట్‌ అనంతర జీవితం కోసం ప్రణాళిక రూపొందించుకోవచ్చు.  

ఖర్చులు రెండు భాగాలు
రిటైర్మెంట్‌ సమయంలో వ్యయాలు ఎంత మేర ఉంటాయన్నది లెక్కించాలి. జాబితాగా రాసుకోవాలి. కిరాణా, యుటిలిటీ బిల్లులు (రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఉండేవి) ఇవి ఒకరకం. రోజువారీ ఉద్యోగానికి వెళ్లి వచ్చేందుకు అయ్యే వ్యయాలు, వృత్తిరీత్యా ధరించాల్సిన దుస్తులు, ఇంటి రుణానికి చెల్లించే ఈఎంఐ ఇవన్నీ రిటైర్మెంట్‌తో ముగిసిపోతాయి కనుక ఇవి మరో భాగంగా రాసుకోవాలి. వైద్య వ్యయాలు రిటైర్మెంట్‌ తర్వాత గణనీయంగా పెరిగిపోతాయి. దీంతో భవిష్యత్తులో వ్యయాలు ఇంకా పెరిగిపోవచ్చని, ప్రస్తుత స్థాయి ఖర్చులను కూడా రిటైర్మెంట్‌ తర్వాత బెంచ్‌ మార్క్‌గా తీసుకోవాలని సినర్జీ క్యాపిటల్‌ సర్వీసెస్‌ ఎండీ విక్రమ్‌ దలాల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతమున్నంత ఖర్చులకు తగ్గకుండానే రిటైర్మెంట్‌ సమయంలోనూ ఉంటాయన్నారు.

రిటైర్మెంట్‌ తర్వాత ఆదాయం
ఉద్యోగ జీవితానికి విరమణ చెప్పిన తర్వాత మీకొచ్చే మొత్తం ఆదాయం ఎంతో అంచనా వేసుకోవాలి. ఈపీఎస్‌ లేదా ఇతర పెన్ష¯Œ  సాధనాల రూపంలో నెలవారీగా ఆదాయం వచ్చేందుకు ఏర్పాటు ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మీకేమైనా ప్రాపర్టీలు ఉంటే వాటిపై వచ్చే అద్దె ఆదాయం కూడా కలుపుకోవాలి. మొత్తం ఖర్చులకు సరిపడా నికర నెలవారీ ఆదాయం కూడా ఉండాలి. లేదంటే అదనంగా మీరు సమకూర్చుకోవాలని అర్థం. అందుకని నేటి రోజుల్లో 60 ఏళ్లకే అందరూ పనికి సెలవు చెప్పేయడం లేదు. ఆ తర్వాత కూడా ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు. స్వయం ఉపాధిలో ఉన్న వారు కూడా తమ శరీరం సహకరించేంత కాలం వాటిని చక్కగానే కొనసాగిస్తున్నారు. అందుకని రిటైర్మెంట్‌ నాటికి హాయిగా విశ్రాంతి తీసుకుని, తమకు ఎదురయ్యే ఖర్చులకు సరిపడా ఆదాయం సమకూర్చుకుంటే సరి. లేదంటే రిటైర్మెంట్‌ తర్వాత కూడా కనీసం ఓ ఐదేళ్లపాటు ఆదాయ మార్గాలను చూసుకోవడం మంచి ఆలోచనే.  

30 యేళ్ల అవసరాలకు అనుగుణంగా
60 ఏళ్లు వచ్చే సరికి తదుపరి జీవన అవసరాలకు ఎంత కావాలో లెక్క వేసుకోవడం అన్నది కొంచెం కష్టమైన పని. ఎందుకంటే ఎంత కాలం జీవిస్తారు, ఏవైనా ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయా? అన్న అంశాలపై కావాల్సిన మొత్తం ఆధారపడి ఉంటుంది. కనీసం 90 ఏళ్ల పాటు జీవించి ఉంటామన్న అంచనాకు తగ్గట్టు ప్రణాళిక రూపొందించుకోవడం సరైనదిగా నిపుణుల సూచన. రిటైర్మెంట్‌ తర్వాత అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న నిధి ఎంత లేదన్నా కనీసం 25–30 ఏళ్ల అవసరాలకు కావాల్సి ఉంటుంది. 60 ఏళ్ల వయసులో నెలకు రూ.లక్ష ఆదాయం కోరుకుంటే, రిటైర్మెంట్‌ నిధిగా కనీసం రూ.2.57 కోట్లు అవసరం అవుతాయి.

పెట్టుబడులపై ఆచితూచి...
కనుక అధిక అవసరాల నేపథ్యంలో ఈక్విటీ వంటి అధిక వృద్ధి చూపించే పెట్టుబడులు అవసరం. చిన్న వయసు నుంచే ఈక్విటీల్లో కొంత మేర రిటైర్మెంట్‌ నిధి కోసం ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లాలి. చాలా మంది నిపుణులు 100 నుంచి తమ వయసును మినహాయించగా, వచ్చేంత ఈక్విటీలకు కేటాయింపులు చేసుకోవచ్చని సూచిస్తుంటారు. అలాగే, రిటైర్మెంట్‌కు వచ్చిన వెంటనే ఈక్విటీలోని పెట్టుబడులను పూర్తిగా డెట్‌ విభాగానికి మళ్లించాలన్నది ఇప్పటి పరిస్థితుల్లో సరైనది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. 60 ఏళ్ల వయసులోనూ తమ వద్దనున్న నిధిలో 40 శాతాన్ని ఈక్విటీలకు, 70 ఏళ్ల వయసులో 30 శాతాన్ని కేటాయించుకోవచ్చన్నది సూచన. సెన్సెక్స్‌ దీర్ఘకాలంలో సగటున 14 శాతం రాబడులను ఇచ్చింది. కొంచెం రిస్క్‌ తక్కువ కోణంలో ఆలోచించినా దీర్ఘకాలంలో 12 శాతం రాబడులు ఉంటాయన్నది నిపుణుల అంచనా. డెట్‌ ఫండ్స్‌లో దీర్ఘకాలంలో రాబడులు 8 శాతం ఉంటాయి. ద్రవ్యోల్బణ దీర్ఘకాల సగటు 6 శాతం మినహాయిస్తే వాస్తవ రాబడులు 2 శాతంగానే అనుకోవాలి.  

దీర్ఘకాలంలో కాంపౌండింగ్‌తో లాభం
మరి మన భారతీయుల జీవన అవసరాల ప్రకారం... 90ఏళ్ల ఆయుర్దాయం అనుకుంటే, రిటైర్మెంట్‌ తర్వాత 30 ఏళ్ల జీవన అవసరాల కోసం, 7 శాతం ద్రవ్యోల్బణ ప్రభావం, పన్ను అనంతరం రాబడులు 8 శాతం అంచనా ప్రకారం ఎంత లేదన్నా కనీసం వార్షిక ఖర్చులకు 28 రెట్ల మేర సమకూర్చుకోవాలన్నది ఓ సూత్రం. రాబడుల రేటు తక్కువగా ఉంటే, రిస్క్‌ తీసుకోని వారు రిటైర్మెంట్‌ అయ్యే నాటికి వార్షిక ఖర్చులకు కనీసం 30–33 రెట్ల మేర సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఏటా మూడు శాతం ఉపసంహరణకు వీలుంటుంది. అందుకే ఉద్యోగం లేదా సంపాదన ఆరంభమైన ఏడాది నుంచే రిటైర్మెంట్‌ తర్వాత జీవన అవసరాల కోసం తగిన ప్రణాళిక వేసుకుని, ఏటా ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో కాంపౌండింగ్‌ కారణంగా అవసరమైనంత నిధిని సులభంగానే సమకూర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ద్రవ్యోల్బణం ప్రభావం
అదనంగా కావాల్సింది చిన్న మొత్తంగానే ఇప్పుడు అనిపించొచ్చు. కానీ, మీరు రిటైర్‌ అయ్యే నాటికి ద్రవ్యోల్బణ ప్రభావంతో కావాల్సిన మొత్తం భారీగా పెరిగిపోతుందన్నది మరవద్దు. దీర్ఘకాలంలో సగటు వార్షిక ద్రవ్యోల్బణ ప్రభావాన్ని 6 శాతంగా పరిగణనలోకి తీసుకుని ఎంత కావాలన్నది అంచనాకు రావచ్చు. ఉదాహరణకు 6 శాతం ద్రవ్యోల్బణ రేటు ప్రకారం చూస్తే... ఇప్పుడు నెలవారీ రూ.లక్ష అవసరం అవుతుంటే, మరో 30 ఏళ్ల తర్వాత రూ.5.74 లక్షలు కావాల్సి ఉంటుంది.  

అసలు ఎంత కావాలి...
నిజానికి రిటైర్మెంట్‌ తర్వాత ఎంత కావాలనే విషయమై అమెరికాలో ఆర్థిక నిపుణులు కొన్ని సూత్రాలను రూపొందించారు. ఫిడెలిటీ సంస్థ రిటైర్మెంట్‌ నాటికి ఒకరి వార్షిక ఆదాయానికి పది రెట్ల మొత్తం సమకూర్చుకుంటే తర్వాతి జీవిత అవసరాలను అధిగమించొచ్చని అధ్యయనం ద్వారా తేల్చింది. ఈ ప్రకారం 30 ఏళ్ల వయసుకు వచ్చే సరికి వార్షికాదాయానికి కనీసం ఒక రెట్టు మొత్తాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. 40 ఏళ్లు వచ్చే సరికి మూడు రెట్ల మొత్తం కావాలి. 50 ఏళ్లకు ఆరు రెట్లు, 60 ఏళ్లకు తొమ్మిది నుంచి పది రెట్ల మొత్తాన్ని సమకూర్చుకునే ప్రణాళిక రూపొందించుకుని, అమలు చేస్తే సరి. అయితే, ఇది అమెరిక¯Œ  అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిందని గుర్తుంచుకోవాలి. ఇక ట్రినిటీ యూనివర్సిటీకి చెందిన ఫైనా¯Œ ్స నిపుణులు రూపొందించిన 4 శాతం సూత్రాన్ని కూడా తెలుసుకోవాల్సిందే. అంటే రిటైర్మెంట్‌ తర్వాత స్టాక్స్‌లో పెట్టుబడులను ఒకేసారి తీసుకోవడం కాకుండా ఏటా 4 శాతం చొప్పున వెనక్కి తీసుకోవాలి. ద్రవ్యోల్బణ రేటుకు సర్దుబాటు చేసిన తర్వాత ఎంత శాతాన్ని వెనక్కి తీసుకోవాలన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. మరికొందరు నిపుణుల సూత్రీకరణ ప్రకారం రిటైర్మెంట్‌ సమయంలో వార్షిక ఖర్చులు ఎంతున్నాయో, దానికి 25 రెట్లకు సరిపడా నిధి ఉంటే జీవన అవసరాలను గట్టెక్కవచ్చన్నది అంచనా. ఉదాహరణకు పదవీ విరమణ సమయానికి రూ.12 లక్షలు వార్షిక ఖర్చులుగా ఉన్నాయనుకుంటే కనీసం రూ.2.1 కోట్లు కావాల్సి వస్తుంది. అయితే, ఇవన్నీ అమెరికా అవసరాలకు అనుగుణంగా అక్కడి సంస్థలు, నిపుణులు రూపొందించిన అవసరాలు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా