కరోనా : ట్రెండ్ సెట్ చేసిన అంబానీ, వేతనాల కోత | Sakshi
Sakshi News home page

కరోనా : ట్రెండ్ సెట్ చేసిన అంబానీ, వేతనాల కోత

Published Thu, Apr 30 2020 5:04 PM

RIL announces salary cuts:Mukesh Ambani to forgo entire compensation - Sakshi

సాక్షి, ముంబై:  కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ అధినేత అపర కుబేరుడు  ముకేశ్ అంబానీ తన వార్షిక వేతనాన్ని వదులు కోనున్నారు. అంతేకాదు  హైడ్రోకార్బన్స్ బిజినెస్ కు సంబంధించిన సీనియర్ ఉద్యోగుల జీతాల్లో కూడా కోత విధిస్తున్నట్టు రిలయన్స్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే సంవత్సరానికి రూ.15 లక్షల కన్నా తక్కువ సంపాదించే ఉద్యోగుల  జీతాల్లో కోత వుండదని స్పష్టం చేసింది. తద్వారా సామాన్య ఉద్యోగులను మినహాయించి మరోసారి  ట్రెండ్ సెట్ చేశారు ఈ కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబానీ.

ఏప్రిల్ 29న ఉద్యోగులకు రాసిన లేఖలో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ 2020-21 సంవత్సరానికి తన మొత్తం జీతం వదులుకుంటారని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హిటల్ ఆర్. మెస్వానీ వెల్లడించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ఇతర  సీనియర్  ఉద్యోగులు సహా రిఫరింగ్ బోర్డు డైరెక్టర్లు 30-50 శాతం వదులుకుంటారని ప్రకటించారు.  అంతేకాకుండా, మొదటి త్రైమాసికంలో సాధారణంగా చెల్లించే వార్షిక నగదు బోనస్, ఇతర ప్రోత్సాహకాల చెల్లింపును కూడా వాయిదా వేస్తున్నట్టు  తెలిపారు. (ఆసియాలో అపర కుబేరుడుగా అంబానీ)

శుద్ధి చేసిన ఉత్పత్తులు, పెట్రో కెమికల్స్ డిమాండ్ తగ్గడం వల్ల హైడ్రోకార్బన్స్ వ్యాపారం బాగా ప్రభావితమైంది. దీంతో ఖర్చుల తగ్గింపు అవసరమని మెస్వానీ పేర్కొన్నారు  కోవిడ్-19 సంక్షోభ సమయంలో నిర్వహణ ఖర్చులు, స్థిర వ్యయాల తగ్గింపుపై  దృష్టి పెట్టామని, దీనికి అందరూ  సహకరించాలని ఉద్యోగులను కోరారు. అయితే  లాక్‌డౌన్‌  వ్యాపార ప్రక్రియలను పునర్వ్యవస్థీకరించడానికి,  డిజిటలైజ్ చేయడానికి  తదుపరి ఉత్పాదకతను మెరుగుపరచడానికి అవకాశాన్నిఇచ్చిందని తన లేఖలో పేర్కొంది. కోవిడ్-19 కారణంగా భారతదేశంలోపాటు యావత్ ప్రపంచం తీవ్రమైన  సవాళ్లను ఎదుర్కంటోందనీ పరిశ్రమలు, వ్యాపారం ప్రభావితమయ్యాయని ప్రకటించిన  రిలయన్స్  తాము కూడా దీనికి మినహాయింపు కాదని తెలిపింది. కాగా  2008-09 నుంచి  11 ఏళ్లుగా  అంబానీ వేతనం ఏడాదికి రూ.15 కోట్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. (లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఇన్ఫీ మూర్తి స్పందన)

Advertisement

తప్పక చదవండి

Advertisement