3 బిలియన్‌ డాలర్లు కట్టండి | Sakshi
Sakshi News home page

3 బిలియన్‌ డాలర్లు కట్టండి

Published Wed, Jul 19 2017 1:02 AM

3 బిలియన్‌ డాలర్లు కట్టండి

పీఎంటీ క్షేత్రాలపై ఆర్‌ఐఎల్, షెల్, ఓఎన్‌జీసీకి ప్రభుత్వం నోటీసులు
న్యూఢిల్లీ: పన్నా/ముక్తా, తపతి (పీఎంటీ) చమురు, గ్యాస్‌ క్షేత్రాల్లో ఉత్పత్తి వ్యయాల రికవరీకి సంబంధించి 3 బిలియన్‌ డాలర్లు చెల్లించాలంటూ ఆపరేటర్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్, రాయల్‌ డచ్‌ షెల్, ఓఎన్‌జీసీ సంస్థలకు డీజీహెచ్‌ నోటీసులు పంపింది. 2016 అక్టోబర్‌ నాటి ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ పాక్షిక ఉత్తర్వుల ప్రకారం అసలు, వడ్డీ, ఇతర చార్జీలతో కలిపి ఈ మొత్తం చెల్లించాలని మే ఆఖరులో పంపిన డిమాండ్‌ నోటీసులో సూచించింది.

అయితే, ఇందుకు ఆఖరు తేదీ, చెల్లించకపోతే పర్యవసానాలు వంటివేమీ అందులో పేర్కొనలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ తుది ఉత్తర్వులు వెలువరించడానికి ముందుగానే ‘పాక్షిక’ ఆర్బిట్రేషన్‌ అవార్డు ఆధారంగా డీజీహెచ్‌ ఈ నోటీసు జారీ చేసినట్లు వివరించాయి. మరోవైపు పరిహార మొత్తాన్ని (ఏదైనా కట్టాల్సింది ఉంటే) ఆర్బిట్రేషన్‌ ప్యానెల్‌ పూర్తిగా ఖరారు చేయకముందే ఇటువంటి చర్యలు సరికాదని ఆర్‌ఐఎల్‌ వర్గాలు పేర్కొన్నాయి. నోటీసులకు తగు వివరణ ఇప్పటికే పంపినట్లు తెలిపాయి.

వివరాల్లోకి వెడితే.. పీఎంటీలో ఆర్‌ఐఎల్, బీజీ ఎక్స్‌ప్లొరేషన్‌కు చెరి 30 శాతం, ఓఎన్‌జీసీకి మిగతా వాటాలు ఉన్నాయి. బీజీని టేకోవర్‌ చేసిన షెల్‌ ఆ తర్వాత దాని స్థానంలో వాటాలు దక్కించుకుంది. వ్యయాల రికవరీ, లాభాల్లో వాటాలు, ఉత్పత్తి పంపక ఒప్పందంలోని (పీఎస్‌సీ) అకౌంటింగ్‌ విధానాలు మొదలైన అంశాలపై ఆపరేటర్లకు, ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తింది. దీనిపై 2010లో ఆర్‌ఐఎల్‌ .. ప్రభుత్వంపై ఆర్పిట్రేషన్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లగా 2012లో దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అయితే, ప్రభుత్వం వీటిని సవాలు చేసింది. తదుపరి బ్రిటన్‌లో ఆర్బిట్రేషన్‌ కమిటీ.. ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది.

Advertisement
Advertisement