రూ.1,000 కోట్లతో తెలంగాణలో ఎంఆర్‌ఎఫ్ విస్తరణ | Sakshi
Sakshi News home page

రూ.1,000 కోట్లతో తెలంగాణలో ఎంఆర్‌ఎఫ్ విస్తరణ

Published Thu, Feb 12 2015 1:35 PM

రూ.1,000 కోట్లతో తెలంగాణలో ఎంఆర్‌ఎఫ్ విస్తరణ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టైర్ల తయారీలో ఉన్న ఎంఆర్‌ఎఫ్ (మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ) తెలంగాణలో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఈ మొత్తాన్ని మెదక్ జిల్లా సదాశివపేట ప్లాంటు విస్తరణకు వెచ్చించనుంది. తెలంగాణలో పెట్టుబడికి ఎంఆర్‌ఎఫ్ సుముఖంగా ఉందని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర సాక్షి బిజినెస్ బ్యూరోకు బుధవారం తెలిపారు. ప్రభుత్వ పరంగా కంపెనీకి అన్ని రకాల అనుమతులను సత్వరం ఇస్తామని చెప్పారు.

తెలంగాణలో కంపెనీకి మెదక్ జిల్లా సదాశివపేటతోపాటు ఇదే జిల్లాలో అంకెన్‌పల్లి వద్ద ప్లాంట్లున్నాయి. అటు ఎంఆర్‌ఎఫ్ పెద్ద ఎత్తున విస్తరణ బాట పట్టింది. ప్లాంట్ల విస్తరణకు వచ్చే మూడేళ్లలో రూ.4,000 కోట్లు వెచ్చిస్తామని 2014 డిసెంబర్‌లో కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కోషీ వర్గీస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2010 తర్వాత కంపెనీ ఇంత పెద్ద ఎత్తున విస్తరణ ప్రణాళికతో ముందుకు రావడం ఇదే మొదటిది. రూ.3,000 కోట్లతో అయిదేళ్ల క్రితం ఎంఆర్‌ఎఫ్ విస్తరణ చేపట్టింది.

ఇందులో భాగంగానే తిరుచ్చి సమీపంలో ప్లాంటును స్థాపించింది. తాజాగా ఎంఆర్‌ఎఫ్ ఉత్తరాఖండ్‌లో బిర్లా టైర్స్‌కు చెందిన ఒక యూనిట్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు రూ.1,600 కోట్లకుపైగా వెచ్చిస్తున్నట్టు సమాచారం. ఎంఆర్‌ఎఫ్‌కు దేశవ్యాప్తంగా 10 ప్లాంట్లున్నాయి. రోజుకు 1.2 లక్షల టైర్లు తయారు చేసే సామర్థ్యం ఉంది. సెప్టెంబర్ 2014తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.14,789 కోట్ల టర్నోవర్‌పై రూ.908 కోట్ల నికర లాభం ఆర్జించింది.

Advertisement
Advertisement