మెప్పించిన ఇన్ఫీ... | Sakshi
Sakshi News home page

మెప్పించిన ఇన్ఫీ...

Published Tue, Jul 21 2015 11:20 PM

మెప్పించిన ఇన్ఫీ...

క్యూ1లో రూ.3,030 కోట్ల నికర లాభం; 5 శాతం అప్
♦ ఆదాయం రూ. 14,354 కోట్లు; 12.4 శాతం వృద్ధి
♦ ఈ ఏడాది డాలర్ ఆదాయ అంచనాలు పెంపు...
♦ 11 శాతం దూసుకెళ్లిన షేరు ధర...
 
 బెంగళూరు : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మెరుగైన ఫలితాలతో ఆకట్టుకుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(2015-16, క్యూ1)లో కంపెనీ రూ.3,030 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో రూ.2,886 కోట్లతో పోలిస్తే 5 శాతం వృద్ధి నమోదైంది. ఇక ఆదాయం కూడా 12.4 శాతం వృద్ధి చెంది రూ.14,354 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ.12,770 కోట్లుగా ఉంది. గడచిన 15 త్రైమాసికాల్లో ఆదాయ వృద్ధి(రూపాయల్లో) ఇదే అత్యధికమని కంపెనీ పేర్కొంది. పరిశ్రమ విశ్లేషకులు క్యూ1లో ఇన్ఫీ రూ.3,017 కోట్ల నికర లాభాన్ని రూ.14,097 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు. దీన్ని మించి కంపెనీ ఫలితాలను ప్రకటించడం గమనార్హం.

 సీక్వెన్షియల్‌గా...
 గతేడాది మార్చి క్వార్టర్(2014-15, క్యూ4, రూ.3,097 కోట్లు)తో పోలిస్తే సీక్వెన్షియల్ ప్రాతిపదిక క్యూ1లో లాభం 2.16 శాతం తగ్గింది. ఆదాయం 7 శాతం వృద్ధి చెందింది. మార్చి క్వార్టర్‌లో ఆదాయం రూ.13,411 కోట్లుగా నమోదైంది. డాలర్ రూపంలో చూస్తే ఇన్ఫోసిస్ క్యూ1లో 2,256 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. సీక్వెన్షియల్‌గా 4.5 శాతం వృద్ధి చెందింది. డాలర్ ఆదాయం 3 శాతం వృద్ధి చెందొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఇక స్థిర కరెన్సీ విలువ ప్రకారం డాలర్ ఆదాయం 4.4 శాతం ఎగసింది. ఐటీ అగ్రగామి టీసీఎస్ కంటే(3.5 శాతం వృద్ధి) మెరుగైన పనితీరును ఇన్ఫీ నమోదు చేసింది.

 గెడైన్స్ పెంపు...
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి డాలరు ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)లను ఇన్ఫోసిస్ 1 శాతం మేర పెంచింది. 7.2-9.2 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. అంతక్రితం 6.2-8.2 శాతంగా అంచనా వేసింది. అయితే రూపాయల్లో మాత్రం ఆదాయ గెడైన్స్‌ను గతంలో ప్రకటించిన విధంగా 10-12 శాతంగానే కొనసాగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

 ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు
►క్యూ1లో ఇన్ఫోసిస్ మొత్తం (అనుబంధ సంస్థలతో కలిపి) 79 కొత్త క్లయింట్లను జతచేసుకుంది. ఇందులో 6 మెగా కాంట్రాక్టులు ఉన్నాయి. టీసీవీ నుంచి 688 మిలియన్ డాలర్ల కాంట్రాక్టుతో పాటు 200 మిలియన్ డాలర్ల విలువైన రెండు ఒప్పందాలను క్యూ1లో కుదుర్చుకుంది.
►జూన్ చివరి నాటికి కంపెనీ వద్ద  రూ.30,235 కోట్ల నగదు నిల్వలు(లిక్విడ్ అసెట్స్) ఉన్నాయి. మార్చినాటికి ఈ మొత్తం రూ.32,585 కోట్లుగా ఉంది.

►క్యూ1లో ఇన్ఫీ స్థూలంగా 11,889 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది. అయితే 8,553 మంది కంపెనీని వీడటంతో నికరంగా 3,336 మంది కొత్త ఉద్యోగులే జతైనట్లు లెక్క. ఇక జూన్ చివరినాటికి అనుబంధ సంస్థలన్నింటితో సహా ఇన్ఫోసిస్‌లో మొత్తం సిబ్బంది సంఖ్య 1,79,523కు చేరింది. మార్చి చివరికి కంపెనీలో 1,76,187 మంది ఉద్యోగులు ఉన్నారు.
►ఇక ఇన్ఫోసిస్(స్టాండెలోన్ ప్రాతిపదికన)లో ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్) క్యూ1లో భారీగా తగ్గుముఖం పట్టింది. క్రితం ఏడాది తొలి త్రైమాసికంలో అట్రిషన్ 23.4 శాతం నుంచి ఈ క్యూ1లో 14.2 శాతానికి తగ్గింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కూడా అట్రిషన్ రేటు 26.4 శాతం నుంచి 19.2 శాతానికి దిగొచ్చింది.
 
  షేరు రయ్...

 ఆకర్షణీయమైన ఫలితాలు, గెడైన్స్ పెంపు నేపథ్యంలో ఇన్ఫీ షేరు ధర రివ్వున ఎగసింది. మంగళవారం బీఎస్‌ఈలో 11 శాతం దూసుకెళ్లి రూ.1,113 వద్ద స్థిరపడింది. ఇక కంపెనీ మార్కెట్ విలువ కూడా భారీగా పెరిగి రూ.2,55,570 కోట్లకి చేరింది. దీంతో టీసీఎస్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోల్‌ఇండియా తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఐదో అతిపెద్ద కంపెనీగా నిలిచింది. ఐటీసీ, ఓఎన్‌జీసీలను వెనక్కినెట్టింది.
 
 తొలి త్రైమాసికంలో కంపెనీ మెరుగైన ఫలితాలను నమోదు చేయడం శుభపరిణామం. క్లయింట్లతో సంబంధాలను పటిష్టం చేసుకోవడంతో పాటు బడా కాంట్రాక్టులను సంపాదించడం, నవకల్పనలపై మరింత దృష్టిపెట్టడం వంటివి కంపెనీ పనితీరు మెరుగుపడేందుకు దోహదం చేశాయి. భవిష్యత్తు తరం కంపెనీల్లో అగ్రస్థానానికి చేరుకునే విషయంలో ఇంకా ఇది ఆరంభం మాత్రమే. ఈ ఏడాది మిగతా కాలంలో పనితీరుకు తాజా ఫలితాలు మంచి చేయూతనందించనున్నాయి.
 - విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ

Advertisement
Advertisement