ఈ ఏడాదీ మొండిబకాయిల సెగ! | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదీ మొండిబకాయిల సెగ!

Published Wed, Mar 23 2016 1:33 AM

ఈ ఏడాదీ మొండిబకాయిల సెగ! - Sakshi

రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ అంచనా
బ్యాంకింగ్ లాభదాయకత తగ్గుతుందని విశ్లేషణ

న్యూఢిల్లీ:  రుణ నాణ్యత, మొండిబకాయిల సమస్య, మూలధన అవసరాలు వంటివి రానున్న 12 నెలలూ బ్యాంకింగ్‌పై వత్తిడిని కొనసాగిస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ క్రెడిట్ విశ్లేషకులు అమిత్ పాండే విశ్లేషించారు. ప్రధానంగా పారిశ్రామిక రంగం మందగమనం, కార్పొరేట్ల అధిక రుణ భారం వంటి అంశాలు ప్రత్యేకించి రుణ నాణ్యత అంశంలో సవాళ్లను విసురుతాయని ఆయన అన్నారు. బ్యాంకింగ్‌పై విడుదలైన ఒక ఎస్‌అండ్‌పీ నివేదిక సైతం ఇదే అంశాలను ప్రస్తావించింది. విశ్లేషణలో మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే...

రానున్న రెండు, మూడు త్రైమాసికాల్లోనూ భారత్ బ్యాంకింగ్ లాభదాయకత తగ్గుతుంది. కనీస రుణ రేటు తగ్గడం ఇందుకు ఒక కారణం.
2016-17 ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ది రేటు 11  నుంచి 13 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా కొనసాగుతున్న తరహాలోనే కార్పొరేట్ రుణాలతో పోల్చితే రిటైల్ రుణ వృద్ధి పెరిగే అవకాశాలు ఉన్నాయి.
బ్యాంకింగ్ రుణ వ్యయాలు అధిక స్థాయిలోనే కొనసాగవచ్చు. ప్రస్తుత స్థూల మొండిబకాయిలకు ప్రొవిజనింగ్ కేటాయిం పులు, బలహీన కార్పొరేట్ పనితీరు, ఎన్‌పీఏలు మరింతగా పెరిగే అవకాశాల వంటివి దీనికి ప్రధాన కారణం.
అంతర్జాతీయ బాసెల్-3 ప్రమాణాలకు అనుగుణంగా తాజా మూలధన కల్పన మద్దతు బ్యాంకింగ్‌కు కీలకం కానుంది.
మొండిబకాయిల విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకన్నా... ప్రైవేటు రంగ బ్యాంకింగ్ పరిస్థితి బాగుంది. ఇదే పరిస్థితి రానున్న 12 నెలల్లోనూ కొనసాగుతుంది.

రేటు కోత పావు శాతం: బీఓఎఫ్‌ఏ
ఏప్రిల్ 5 పాలసీ సమీక్ష సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు పావు శాతం తగ్గే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్(బీఓఎఫ్‌ఏ-ఎంల్) పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ రేటు అర శాతం తగ్గే వీలుందని అంచనావేసింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో ఆర్‌బీఐకి రేటు కోత నిర్ణయం తీలసుకుంటుందన్నది తమ అభిప్రాయమని  ఆర్థిక సేవల దిగ్గజం ఒక ప్రకటనలో పేర్కొంది. ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయం-వ్యయాలకు మధ్య వ్యత్యాసం) లక్ష్యాలకు కట్టుబడి ఉంటామన్న ప్రభుత్వ హామీ,  ద్రవ్యోల్బణం అదుపులో ఉం డడం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు-ప్రస్తుతం 6.75%) తగ్గింపునకు కలసి వస్తున్న అంశంగా పేర్కొంది. కాగా చిన్న పొదుపు మొత్తాలపై రేటు కోత బ్యాంకింగ్ రేటు ప్రయోజనం బదలాయింపునకు దోహదపడుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషించింది.

Advertisement
Advertisement