Sakshi News home page

25 శాతం పెట్టుబడులు వచ్చినా చాలు...

Published Wed, Jan 13 2016 12:47 AM

25 శాతం పెట్టుబడులు వచ్చినా చాలు...

ఏపీకి దాదాపు రూ.5 లక్షల కోట్ల వరకూ పెట్టుబడి ప్రతిపాదనలు
ఎంఓయూల కోసం వచ్చినవన్నీ తాజా దరఖాస్తులే
సదస్సుకు ఊహించినదానికన్నా 4 రెట్ల స్పందన
విశాఖలో మల్టీప్రోడక్ట్ ఫుడ్ పార్క్
ప్రభుత్వంతో శ్రీనివాసా హేచరీస్ ఎంఓయూ
►  సీఐఐ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ చైర్మన్ సురేష్ రాయుడు చిట్టూరి

 
 విశాఖ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 విశాఖ జిల్లా నక్కపల్లిలో 55 ఎకరాల్లో మల్టీ ప్రోడక్ట్ ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు శ్రీనివాసా హేచరీస్ ఎండీ, సీఐఐ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ చైర్మన్ చిట్టూరి సురేష్ రాయుడు చెప్పారు. విశాఖలో జరుగుతున్న మూడురోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఈ మేరకు ఎంఓయూపై సంతకాలు చేసినట్లు ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు.
 
  ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...
 మీ ఎంఓయూ వివరాలేంటి?

 విశాఖ జిల్లా నక్కపల్లిలో 50 ఎకరాల్లో ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో శ్రీనివాసా హేచరీస్ తరఫున రెండు యూనిట్లు ఏర్పాటు చేస్తాం. దీంతో పాటు ఔత్సాహిక ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్ని ఆహ్వానించి వారికి  కూడా స్థలం కేటాయిస్తాం.
 
 ఈ సదస్సులో కుదిరే ఎంఓయూల విలువ ఎంత ఉండొచ్చు?
 ఈ మూడు రోజుల సీఐఐ సదస్సు సందర్భంగా జరిగిన మొత్తం ఒప్పందాల విలువ దాదాపు రూ. 5 లక్షల కోట్లు ఉండొచ్చని భావిస్తున్నాం.
 
♦  ఈ ఒప్పందాలన్నీ నిజంగా కంపెనీలుగా మారతాయా? ఒకవేళ మారితే ఎంత వరకూ..?
 సాధారణంగా అయితే ఇలాంటి సదస్సుల్లో జరిగే ఒప్పందాల్లో 25 శాతం వరకూ సాకారమవుతూ ఉంటాయి. అలా చూసుకున్నా లక్ష కోట్ల నుంచి 1.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయి. అయితే అధికారులు కొంచెం క్రియాశీలకంగా వ్యవహరించి, సాకారం చేయటానికి ఉండే ఇతర ప్రత్యామ్నాయాలను కూడా వెదికితే... 40 నుంచి 50 శాతం పెట్టుబడులు వాస్తవరూపం దాల్చే అవకాశాన్ని తోసిపుచ్చలేం.
 
 అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించటమంటే..?
 చిన్న ఉదాహరణ చెబుతా. ఓ కంపెనీకి 35 ఎకరాల భూమి కేటాయించారు. తొలి విడతలో అందులో 30 ఎకరాలిచ్చారు. కంపెనీ దాన్ని బ్యాంకు వద్ద తనఖా పెట్టి రూ.300 కోట్లు తెచ్చుకోవాలనుకుంది. బ్యాంకు కూడా ఓకే చేసింది. తీరా పత్రాలు తనఖా పెట్టాల్సి వచ్చేటప్పటికి.. 35 ఎకరాలని ఒప్పందంలో ఉంది. కానీ 30 ఎకరాల భూమే వీరిదగ్గరుంది. దాంతో బ్యాంకు తిరస్కరించింది. దాన్ని సరిదిద్ది కంపెనీకి రుణం తెప్పించటానికి చాలా తంటాలు పడాల్సి వచ్చింది. ఇలాంటి లోపాల్ని తొలగించేలా కాస్త సరళంగా వ్యవహరిస్తే చాలు.
 
 ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలు-దరఖాస్తుల్ని,  ఇప్పటికే పనులు ప్రారంభించిన వాటిని కూడా ఈ సదస్సులో కలిపేసి ఒప్పందాలు చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజమా?

 అలాంటిదేమీ లేదు. భాగస్వామ్య సదస్సును ప్రకటించి రెండు నెలలవుతోంది. అప్పటి నుంచి వచ్చిన దరఖాస్తుల్ని పరిగణనలోకి తీసుకుని వాటికే ఎంఓయూలు చేసుకుంటున్నాం. పాతవి ఒకటి రెండు ఉంటే ఉండొచ్చేమో!!
 
♦  మీ కంపెనీకి భూమి ఎంత కావాలి? ఎంత ఉంది?
 మాకు నక్కపల్లిలో సొంతంగా 350 ఎకరాలుంది. దాన్లో 50 ఎకరాల్లోనే ఇపుడు ఎంఓయూ చేసుకున్నాం. మిగిలింది కూడా దశలవారీగా చేపడతాం. వచ్చే ఐదేళ్లలో రూ.500 కోట్లు పెట్టుబడిగా వెచ్చిస్తాం.
 
♦  ఈ సదస్సులో ఇంధన రంగంపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి అంత భూమి ఉందా?
 సంప్రదాయేతర ఇంధనమైన పవన విద్యుత్, సోలార్ విద్యుత్‌లకు భూమి అనేది సమస్యే. కాకపోతే ప్రభుత్వం కేటాయిస్తున్నది బంజరు భూముల్నే. పెపైచ్చు దీనికి సంబంధించిన పాలసీ కూడా వినూత్నంగా ఉంది. పవన విద్యుత్‌కు సంబంధించి ఆఫీసు భవనాలు మాత్రమే కంపెనీకి... మిగిలిన భూమి రైతులకే ఉంటుంది. సోలార్‌కు బంజరు భూములే ఇస్తున్నారు కనక సమస్య లేదు.
 
 ఎక్కువ మంది ఏ ప్రాంతంపై ఆసక్తి చూపిస్తున్నారు?
 అన్ని చోట్లా ఉంది. విద్యుత్ ప్రాజెక్టులు రాయలసీమలో... ఐటీ విశాఖలో ఆసక్తి చూపిస్తున్నారు. విజయవాడలోనూ కొందరు ఏర్పాటు చేస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు వస్తే శ్రీకాకుళంలో ఎన్‌సీసీ, కర్నూలులో జైన్ ఇరిగేషన్, ఇంకా తూర్పు గోదావరి, నెల్లూరు, ప్రకాశంల లో కూడా ప్లాంట్లు ఏర్పాటుకు కంపెనీలు ముందుకొచ్చాయి.
 
 సదస్సుకు స్పందన ఎలా ఉంది?
 మేం అనుకున్న దానికన్నా 4 రెట్ల స్పందన ఉంది. ఎక్కువ మందిలో నమ్మకం కుదిరిందని దీన్ని బట్టి అర్థమవుతోంది.

Advertisement
Advertisement