ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వ్యాపారం ఏకతాటిపైకి | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వ్యాపారం ఏకతాటిపైకి

Published Tue, May 16 2017 3:12 AM

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వ్యాపారం ఏకతాటిపైకి

ముంబై: ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుల వ్యాపారానికి సంబంధించి రెండు జాయింట్‌ వెంచర్లను కలిపేసే అవకాశం ఉంది. జీఈ క్యాపిటల్, ఎస్‌బీఐ ఈ రెండింటి భాగస్వామ్య సంస్థే ఎస్‌బీఐ కార్డు. ఇందులో ఎస్‌బీఐకి 60 శాతం, మిగిలిన వాటా జీఈ క్యాపిటల్‌కు ఉన్నాయి. ఈ వ్యాపారం నుంచి తప్పుకుంటున్నట్టు జీఈ క్యాపిటల్‌ ఇప్పటికే ప్రకటించింది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వ్యాపారం రెండు జాయింట్‌ వెంచర్లు(జేవీ)గా కొనసాగుతోంది. ఎస్‌బీఐ కార్డు అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ ఇందులో ఒకటి. ఇది క్రెడిట్‌ కార్డుల మార్కెటింగ్, పంపిణీ కార్యకలాపాలు చూస్తోంది. జీఈ క్యాపిటల్‌ బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ అన్న మరో జాయింట్‌ వెంచర్‌ ఎస్‌బీఐ కార్డుకు సంబంధించి తెర వెనుక టెక్నాలజీ, ప్రాసెసింగ్‌ ప్రక్రియలను చూస్తోంది.

 రెండింటిలోనూ ఎస్‌బీఐకి గణనీయమైన వాటా ఉన్నందున ఒకే వ్యాపారానికి సంబంధించి రెండు విభాగాలను కొనసాగించడంలో అర్థం లేదని ఎస్‌బీఐ కార్డు ఎండీ, సీఈవో విజయ్‌ జసూజా సోమవారం ముంబైలో మీడీయా సమక్షంలో పేర్కొన్నారు. బోర్డులోకి కొత్త ఇన్వెస్టర్‌ వచ్చిన తర్వాత ఈ రెండు జాయింట్‌ వెంచర్ల విలీనం సాధ్యమవుతుందన్నారు. వార్‌బర్గ్‌ పింకస్, కార్లిలే, క్రెడిట్‌ సైసన్‌ ఎబీఐలో జీఈకి వాటాను సొంతం చేసుకునేందుకు తుది బిడ్డర్లుగా ఉన్నాయి.

 ఎవరికి వాటా విక్రయించాలన్న విషయంపై జీఈ క్యాపిటల్‌ తుది నిర్ణయం తీసుకుంటుందని జసూజా చెప్పారు. ఈ జాయింట్‌ వెంచర్లలో ఎస్‌బీఐకి 60 శాతం వాటా ఉండగా, జీఈ నుంచి కొంత కొనుగోలు చేయడం ద్వారా 74 శాతానికి పెంచుకోనున్నట్టు ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య ఇటీవలే వెల్లడించారు.

Advertisement
Advertisement