నేటి నుంచే ఎస్‌బీఐ కొత్త ఛార్జీలు | Sakshi
Sakshi News home page

నేటి నుంచే ఎస్‌బీఐ కొత్త ఛార్జీలు

Published Sat, Jul 15 2017 7:03 PM

నేటి నుంచే ఎస్‌బీఐ కొత్త ఛార్జీలు

ముంబై : స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఇటీవల తగ్గించిన నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌ ఛార్జీలు నేటి(జూలై15) నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ తగ్గింపుతో ఆన్‌లైన్‌ మనీ ట్రాన్సఫర్‌ సర్వీసులు 75 శాతం తక్కువకు లభ్యమవుతున్నాయి. డిజిటల్‌ పెమంట్ల వృద్ధి చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఎస్‌బీఐ ఈ ఛార్జీల్లో కోత విధించిన సంగతి తెలిసిందే.  ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా జరిపే లావాదేవీలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తోంది. అలాగే బ్యాంక్‌.. ఐఎంపీఎస్‌ ద్వారా జరిపే ఫండ్‌ ట్రాన్స్‌ఫర్స్‌పై (రూ.1,000 వరకు) చార్జీలను రద్దు చేసింది.
 
ఎస్‌బీఐ తగ్గించిన ఛార్జీలు ఈ విధంగా ఉన్నాయి...
నెఫ్ట్‌ ద్వారా జరిపే ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు (రూ.10,000 వరకు) రూ.1కి, (రూ.1 లక్ష వరకు) రూ.2కు తగ్గాయి. అంతకముందు ఈ ఛార్జీలు రెండు రూపాయలు, నాలుగు రూపాయలుగా ఉన్నాయి.  రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు 12 రూపాయల నుంచి 3 రూపాయలకి దిగివచ్చాయి. ఇక రూ.2 లక్షలకుపైన ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు రూ.5గా ఉన్నాయి. ఈ చార్జీలు కూడా ముందు రూ.20గా ఉన్న విషయం విదితమే.
 
ఆర్‌టీజీఎస్‌ విధానంలో రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల మధ్య ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు 20 రూపాయల నుంచి 5 రూపాయలకు దిగివచ్చాయి. ఇక రూ.5 లక్షలకుపైన ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ చేస్తే రూ.10 చార్జీ పడుతోంది. ప్రస్తుతం ఈ చార్జీలు రూ.40గా ఉన్నాయి. కొత్తగా సవరించిన అన్ని చార్జీలకు జీఎస్‌టీ రేటు 18% వర్తిస్తుందని బ్యాంక్‌ తెలిపింది. బ్యాంక్‌ శాఖల్లో ఎగ్జిక్యూటివ్స్‌ ద్వారా జరిపే ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు భిన్నంగా ఉంటాయని పేర్కొంది. ఇక మార్చి చివరి నాటికి ఎస్‌బీఐకి 3.27 కోట్ల ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ కస్టమర్లు, 2 కోట్ల మంది మొబైల్‌ బ్యాంకింగ్‌ కస్టమర్లు ఉన్నారు.  

Advertisement
Advertisement