ఎస్‌బీఐలో వచ్చే రెండేళ్లలో 10% ఉద్యోగాలు కట్‌ | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐలో వచ్చే రెండేళ్లలో 10% ఉద్యోగాలు కట్‌

Published Mon, Mar 27 2017 1:16 AM

ఎస్‌బీఐలో వచ్చే రెండేళ్లలో 10% ఉద్యోగాలు కట్‌

న్యూఢిల్లీ: దేశంలో దిగ్గజ బ్యాంకుగా ఉన్న ఎస్‌బీఐలో వచ్చే రెండేళ్లలో ఉద్యోగుల సంఖ్య 10 శాతం తగ్గనుంది. ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకు ఏప్రిల్‌ 1 నుంచి ఎస్‌బీఐలో విలీనం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో శాఖలు, ఉద్యోగుల స్థిరీకరణపై దృష్టి పెట్టనున్న బ్యాంకు రెండేళ్ల కాలంలో ఉద్యోగుల నియామకాలను తగ్గించుకోవడంతోపాటు డిజిటైజేషన్‌ను అమలు చేయనున్నట్టు బ్యాంకు ఎండీ రజనీష్‌ కుమార్‌ తెలిపారు.

 ఉద్యోగుల సంఖ్య రెండేళ్లలో 10 శాతం మేర తగ్గే అవకాశం ఉందన్నారు. ఎస్‌బీఐలో ప్రస్తుతం 2,07,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఏప్రిల్‌ 1 నుంచి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్‌; ట్రావెన్‌కోర్‌; పాటియాలా; మైసూర్,   హైదరాబాద్‌; భారతీయ మహిళా బ్యాంకులు విలీనం అవుతుండడంతో ఎస్‌బీఐ ఉద్యోగుల సంఖ్యకు 70,000 పెరిగి 2,77,000 కానుంది. ఉద్యోగుల సంఖ్య 2019 మార్చి నాటికి 2,60,000కు తగ్గు తుందని, అంతకంటే తక్కువే ఉండవచ్చని, విలీనం అనంతరం అసలు ప్రభావం తెలుస్తుందని రజనీష్‌ చెప్పారు.

దీంతోపాటు ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు ఉంటాయని, ఉద్యోగుల తొలగింపు మాత్రం పరిశీలనలో లేదన్నారు. వీఆర్‌ఎస్‌ అవకాశం ఇచ్చామని, ఏటా తగ్గే ఉద్యోగుల సంఖ్యలో అంతే మొత్తం భర్తీ చేయడం లేదని, డిజిటల్‌ చర్యల కారణంగానూ ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందన్నారు. ఉద్యోగుల నియామకం ఆగదని, కాకపోతే 50% మేర తగ్గించుకుంటామని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement