ఎస్‌బీఐ నిధుల వేట! | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ నిధుల వేట!

Published Wed, Jan 13 2016 1:27 AM

ఎస్‌బీఐ నిధుల వేట!

అప్రాధాన్య ఆస్తుల విక్రయం,
అనుబంధ విభాగాల లిస్టింగ్ సన్నాహాలు

 న్యూఢిల్లీ: తాజా మూలధన పెట్టుబడులు, అంతర్జాతీయ బ్యాంకింగ్ ప్రమాణాలకు సంబంధించి  బాసెల్ 3 నిబంధనలను 2019 మార్చి నుంచి అమలుపై బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కీలక వ్యూహ రచన చేస్తోంది. వచ్చే మూడేళ్లలో అనుబంధ విభాగాలను మార్కెట్‌లో లిస్టింగ్ చేయడం, అప్రాధాన్య ఆస్తుల (నాన్-కోర్ అసెట్స్) విక్రయం వంటివి ఇందులో ఉన్నాయి.
 
 బ్యాంక్ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఇక్కడ అసోచామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ విషయాలను వెల్లడించారు.  బాసెల్ 3 ప్రమాణాల ప్రకారం... బ్యాంకింగ్‌కు రూ.1.80 లక్షల కోట్లు అవసరం. ఇందులో రూ.70,000 కోట్లు మాత్రమే ప్రభుత్వం అందిస్తుంది. ఈ నేపథ్యంలో తనకు కావల్సిన మొత్తాలకు సంబంధించి ఎస్‌బీఐ దారులు వెతుకుతున్నట్లు బట్టాచార్య సంకేతాలు ఇచ్చారు. ముఖ్యాంశాలు చూస్తే...
 
 ప్రభుత్వం అందించగా... మిగిలిన మొత్తాలను బ్యాంకులే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. లాభాలు, నాన్-కోర్ అసెట్స్ విక్రయాలు ఇందుకు ఒక మార్గం. ఎస్‌బీఐని తీసుకుంటే నగదుగా మార్చుకోడానికి పలు నాన్-కోర్ అసెట్స్ ఉన్నాయి. అలాగే విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ... లిస్టెడ్ కాని అనుబంధ విభాగాలూ ఉన్నాయి. కనుక ఇందుకు సంబంధించి లిస్టింగ్, విక్రయ అంశాలపై బ్యాంక్ దృష్టి పెడుతుంది.
 
 ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ జనరల్ వంటి బీమా వెంచర్లలో 10 శాతం, 23 శాతం చొప్పున తన వాటాల తగ్గింపునకు ప్రణాళికలను ఇప్పటికే బ్యాంక్ ప్రకటించింది. మా తరహాలోనే పలు బ్యాంకులూ మూలధన సమీకరణలకు తమతమ వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి.

 బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్లు అధికంగా ఉన్నాయనడంలో నిజం లేదు. డిపాజిట్ రేట్లు ద్రవ్యోల్బణానికి తగిన విధంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రుణ రేటు తగ్గింపు కష్టం.
 

Advertisement
Advertisement